breaking news
polyandry
-
ముగ్గురు భర్తల ముద్దుల పెళ్లాం!
ఒక వ్యక్తికి పలువురు భార్యలున్న కథలు మనం చాలానే విని ఉంటాం.. ఈమధ్యే హిమాచల్ యువతి ఆచారం ప్రకారం అన్నదమ్ముల్ని మనువాడడం చూశాంమహాభారతంలోని ‘‘పాంచాలి.. పంచ భర్తుక’’ అన్నట్టు కాదు కానీ...ఒక మహిళకు ముగ్గురు భర్తలుండటం గురించి మీరెప్పుడైనా విన్నారా?విని ఉండరు లెండి. ఎందుకంటే ఆమె ఉండేది టాంజానియాలో మరి!. ఇక్కడో విశేషం ఏంటంటే.. ముగ్గురు భర్తలుండటం కాదు, వాళ్లందరి పోషణ బాధ్యత తనే తీసుకోవడం!. ఎంచక్కా.. ఎలాంటి కీచులాటలూ లేకుండా అందరూ ఒకే ఇంట్లో కాపురం కొనసాగిస్తూండటం!. ఆ విశేషాలేవో చూసేద్దాం రండి..నెల్లి... టాంజానియా సరిహద్దులోని ఒకానొక పట్టణంలో ఉంటోంది. కార్లు అమ్మడం, కొనడం వృత్తి. బాగా సక్సెస్ఫుల్ కూడా. ఎనిమిదేళ్ల కాలంలో ఈమె వరుసగా ముగ్గురిని పెళ్లి చేసుకుంది. అంతకంటే ముందు కూడా ఒక భర్త ఉండేవాడు. కానీ.. ఓ కారు ప్రమాదంలో అతడు మరణించాడు. ఆ తరువాత ఒంటరిగానే ఉండాలని అనుకుంది. కానీ.. మరణించిన భర్త తమ్ముడు హసన్ ఆమె పంచన చేరాడు. మొదటి భర్తకు పుట్టిన పిల్లల పెంపకంలో చేదోడు వాదోడుగా ఉన్నాడు. కొంతకాలానికి ఈ వ్యవహారం కాస్తా ప్రేమకు ఆ తరువాత పెళ్లికి దారితీసింది. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. కొన్నేళ్లు గడిచాయో లేదో.. ఆమె జీవితంలోకి ‘జిమ్మీ’ ఎంటరయ్యాడు. ఇతగాడు అప్పట్లో బాగా డిప్రెషన్లో ఉండేవాడట. తనకు ఎవరూ లేరన్న ఫీలింగ్తో బాధపడేవాడు. పాపం అనుకుందేమో నెల్లీ అతడిని రెండో మొగుడిగా స్వీకరించింది. ఇది జరిగిన కొంత కాలానికి నెల్లీకి డానీ పరిచయమయ్యాడు. అప్పుడే డిగ్రీ పూర్తి చేసుకున్న డానీ ఉద్యోగం వేటలో ఉన్నాడు. దొరుకుతుందో లేదో అన్న బెంగ, దొరకదేమో అన్న అత్మనూన్యత భావం డానీని వెంటాడేవట. ఈ నేపథ్యంలో నెల్లీ అతడికి ధైర్యం చెప్పేది. ఆ తరువాత ఇతడిని మూడో భర్తగా స్వీకరించింది!అందరూ ఒకే ఇంట్లో..నెల్లీ, అమె ముగ్గురు భర్తలు కూడా ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఒకొక్కరికి ఒక్కో బెడ్రూమ్ కూడా ఉంది. ప్రస్తుత ముగ్గురు భర్తలూ నిరుద్యోగులు. దీంతో కార్ల డీలర్గా నెల్లీ సంపాదిస్తున్న దాంతోనే కుటుంబ నడుస్తోంది. ముగ్గురిలో ఎవరితో ఎంత సేపు గడపాలన్న విషయంలో నెల్లీ మాటే చెల్లుతుంది. వారానికి తగిన షెడ్యూల్ వేసుకుని ఆ ప్రకారం వారితో గడుపుతానంటోంది నెల్లీ. ‘‘ముగ్గురు భర్తలూ నాకు సమానమే. అందరినీ ఒకేలా చూసుకుంటా. వాళ్లు కూడా ఎంతో అనోన్యంగా ఉంటారు. బెస్ట్ ఫ్రెండ్స్ అని పిలుచుకుంటారు కూడా’’ అంటుంది నెల్లీ. హసన్, జిమ్మీ, డానీలు కూడా తమ ఉమ్మడి భార్య విషయంలో సంతోషంగానే ఉన్నారు. ఈ ఏర్పాటు బాగానే ఉందని చెబుతున్నారు. ‘‘మగాడికి ఎక్కువ మంది భార్యలున్నప్పుడు లేని అభ్యంతరం.. ఒక మహిళకు ఎక్కువమంది భర్తలుంటే ఎందుకుండాలి?’’ అని ఎదురు ప్రశ్నిస్తాడు జిమ్మీ. చిక్కులూ లేకపోలేదు..నెల్లీ వ్యవహారం టాంజానియాలో కొంతమేరకు చిక్కులు సృష్టించింది. చట్టం ప్రకారం ఈ దేశంలో బహుభార్యత్వం తప్పు కాదు కానీ.. బహుభర్తృత్వం(Polyandry) మాత్రం తప్పు. కేసు పెడితే నెల్లీకి మూడేళ్ల జైలు శిక్ష పడవచ్చునని టాంజానియా లాయర్ ఒకరు చెబుతున్నారు. అంతేకాదు.. నెల్లీ ఇరుగుపొరుగు కూడా ఈ వ్యవహారంపై చెవులు కొరుక్కుంటూనే ఉన్నారు. అయితే ఒక్కటైతే స్పష్టం. మానవ సంబంధాలన్నవి అంత సులువుగా అర్థం చేసుకోవడం చాలా చాలా కష్టం అని!!:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా -
అన్నదమ్ముల్ని పెళ్లాడిన యవతి.. ఇదెక్కడి ఆచారం!
ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి.. హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. కున్హట్ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు. Astonishing! Two real brother marry a Same Girl 👇In Shillai area of Sirmaur district, two real brothers have married the same girl. This has become a topic of discussion in the entire region. This tradition is ancient in the Giripar region but in today's modern era, due to the… pic.twitter.com/8fIOaeQtjs— Akashdeep Thind (@thind_akashdeep) July 19, 2025హట్టి తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ట్రాన్స్ గిరి రీజియన్లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్ ట్రైబ్(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట. అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు. హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి. తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి. -
ఒక మహిళ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు!
అందమైన జంట, అన్యోన్య దాంపత్యం, ముచ్చటైన జంట.. ఇలాంటి పదాలను తరచూగా వింటూనే ఉంటాం. ఎవరైనా భార్యాభర్తలు కలహాలు లేకుండా కాపురం చేస్తున్నా,, ఒకరినొకరు అర్థం చేసుకుని ఆనందంగా జీవిస్తున్నా ఈ పదాలతోనే వాళ్లను పొగడ్తల్లో ముంచేస్తాం. ఇద్దరు మనుషులు, వారి మనసులు కలిసి చేసే జీవనప్రయాణమే దాంపత్యం. ఏ సంప్రదాయం అయినా ఒక భర్తకు ఒక భార్య ఉండటమే చూడటానికి బాగుంటుంది. కానీ కొన్ని ఆచారాల్లో ఓ వ్యక్తి ఇద్దరు లేదా ఎంతమందినైనా పెళ్లి చేసుకునే వీలు కూడా ఉంటుంది. అయితే ఇష్టమొచ్చినన్ని పెళ్లిళ్లు చేసుకునే స్వేచ్ఛ మహిళలకు ఎందుకు ఉండకూడదు. ఈ ఆలోచన మనలో ఎంతమందికి వచ్చిందో తెలియదు. కానీ దక్షిణాఫ్రికాలో మహిళలు, పురుషులకు సమాన హక్కుల కోసం పోరాడుతున్న సామాజికవేత్తలు దీనిపై పోరాడుతున్నారు. ప్రపంచంలో అత్యంత ఉదారమైన రాజ్యాంగవ్యవస్థల్లో దక్షిణాఫ్రికా ఒకటి. ఇప్పటికే అక్కడ స్వలింగ వివాహాలు, బహుభార్యత్వం అమల్లో ఉన్నాయి. తాజాగా బహుభర్తృత్వంపై వెల్లువెత్తిన ప్రతిపాదనలను ఆ దేశ ప్రభుత్వం స్వీకరించింది. దేశంలోని మహిళలు అనేక మంది పురుషులను పెళ్లాడేందుకు చట్టబద్ధమైన అనుమతులు ఇవ్వడాన్ని పరిశీలిస్తూ సమగ్ర ప్రతిపాదనలతో ఓ ఫైలును డాక్యుమెంట్ను సిద్ధం చేసింది. ఈ మేరకు ప్రజల అభిప్రాయాలను స్వీకరించేందుకు హోంమంత్రిత్వశాఖ గ్రీన్ పేపర్ను జారీ చేసింది. మహిళలకు ఒకరి కంటే ఎక్కువ భర్తలను అనుమతించాలన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం చేసిన ప్రతిపాదన దేశంలో విస్తృత చర్చకు దారితీసింది. బహుభర్తృత్వ ప్రతిపాదనలను అక్కడి మతసంస్థల ప్రతినిధులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. వీరిలో అక్కడి బుల్లితెర ప్రముఖుడు మౌసా సెలేకూ సైతం ఉన్నారు. నలుగురు భార్యలున్న ఈయన.. బహుభర్తృత్వం ఆఫ్రికన్ సంస్కృతి సర్వనాశనమవుతుందని విమర్శించారు. ఓ మహిళ ఎన్నడూ పురుషుడి స్థానాన్ని భర్తీ చేయలేదని, బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుడితే ఎవరి తండ్రి ఎవరనేది ఎలా తెలుస్తుందని ప్రశ్నించారు. ఓ మహిళకు ఒకరిని మించి భర్తలున్నప్పుడు వారంతా ఆమె ఇంటి పేరును స్వీకరిస్తారా? అని ప్రశ్నించారు. అలాగే ఆఫ్రికన్ క్రిస్టియన్ డెమోక్రటిక్ పార్టీ నాయకుడు రెవరెండ్ కెన్నెత్ మెషో మాట్లాడుతూ.. బహుభార్యాత్వం ఆచరణలో ఆమోదయోగ్యమైనది. కానీ బహుభార్యత్వం ఆమోదయోగ్యం కాదని అన్నారు. అసూయ, నాదీ అన్న అధిపత్య ధోరణితో ఉండే పురుషాధిక్య సమాజంలో ఒక మహిళ ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చనేది పనిచేయదన్నారు. అయితే చట్టాన్ని మార్చుతూ చేసిన ప్రతిపాదనలోని కీలక సమస్యలపై సాంప్రదాయ నాయకులతో పాటు మానవ హక్కుల కార్యకర్తలు, ఇతర గ్రూప్లో ఆ దేశ హోంమంత్రిత్వశాఖ సంప్రదింపులు జరుపుతోంది. -
ఆమెకు 'ఇద్దరు'!
మహాభారతంలో పాండవులు ద్రౌపదిని పంచుకున్నారని చదువుకున్నాం. ఆధునిక యుగంలోనూ పాండవ సంతతి కొనసాగుతోంది. కెన్యాలో వెలుగు చూసిన ఘటన ఈ విషయాన్ని రుజువు చేస్తోంది. ఇద్దరు పురుషులు ఓ మహిళలను వంతులువారిగా పంచుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆమేరకు అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. అయితే ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో వీరి బాగోతం బట్టబయలయింది. మొంబాసా కౌంటీలోని కిసానిలో ఉన్న కిసిమాని ప్రాంతానికి చెందిన సిల్వెస్టర్ వెన్డ్వా, ఎలిజహ్ కిమాని అనే ఇద్దరు వ్యక్తులు ఒకే వితంతు మహిళతో ప్రేమాయణం సాగిస్తున్నారు. 25 నుంచి 31 ఏళ్ల వయసున్న ఈ ముగ్గురు నాలుగేళ్లకు పైగా ఈ బంధం సాగిస్తున్నారు. అయితే ఒకరి 'వ్యవహారం'లో మరొకరు తలదూర్చకూడదని వీరు ఒప్పందం చేసుకున్నారు. ఆమెకున్న కవల పిల్లలను తామే పెంచాలని నిర్ణయించుకున్నారు. ఇంతవరకు సవ్యంగా సాగిన వీరి వ్యవహారం ఒప్పందం ఉల్లంఘనతో వీధిన పడింది. వెన్డ్వా, కిమాని ఇద్దరూ ఆమెను పెళ్లాడేందుకు సిద్ధమవడంతో తగవు వచ్చింది. ఎదురు కట్నం ఇచ్చి మరీ మనువాడేందుకు ముందుకురావడంతో ఇద్దరి మధ్య గొడవ మొదలయింది. చివరకు రగడ పోలీసు స్టేషన్కు చేరడంతో మీడియా ద్వారా ప్రపంచమంతా పాకింది. ఇద్దరు పిల్లల తల్లైన వితంతు మహిళ కోసం ఇద్దరు వ్యక్తులు కొట్టుకోవడం తానెక్కడా చూడలేదని స్థానిక కమ్యూనిటీ పోలింగ్ అధికారి అబ్దుల్రహమాన్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు తాను ప్రయత్నిస్తున్నా అందుకు ఈ ముగ్గురు అంగీకరించడం లేదని స్థానిక కమ్యూనిటీ పోలింగ్ అధికారి అబ్దుల్రహమాన్ పేర్కొన్నారు. ఆమె లేకుండా బతలేమని వారిద్దరూ అంటున్నారని తెలిపారు. అలాగే ఆమె కూడా వీరిద్దరూ లేకుండా ఉండలేనంటుందన్నారు. బహుభార్యత్వం(పాలిగమి) కెన్యాలో నేరం కాదు. అయితే పాలియాండ్రి(ఒక మహిళ ఎక్కువ మంది భర్తలను కలిగివుండడం) గురించి వినడం ఇదే మొదటిసారి అని కెన్యా న్యాయనిపుణులు అంటున్నారు. పాలియాండ్రి చట్టవిరుద్ధమని ఎక్కడా లేదని స్పష్టం చేశారు. ఒక మహిళ ఎక్కువ మంది భర్తలను కలిగివుండడం అసహజమని పేర్కొన్నారు. ఈ సమస్య ఎలా పరిష్కారం అవుతుందని అందరూ ఆసక్తిగా గమనిస్తున్నారు.