
ఒక వధువు.. ఇద్దరు పెండ్లి కొడుకులు.. పైగా అన్నదమ్ములు.. వివాహంతో ఒక్కటయ్యారు. ఈ వేడుకకు వందలమంది హాజరై.. ఆ అరుదైన జంటను ఆశీర్వదించారు కూడా. ఈమధ్యకాలంలో జరిగే పరిణామాలతో పెళ్లంటేనే వణికిపోతున్న క్రమంలో.. ‘హవ్వా ఇదెక్కడి ఆచారం అనుకుంటున్నారా?’ అయితే ఈ కథనంలోకి పదండి..
హిమాచల్ ప్రదేశ్ సిరమూర్ జిల్లా షిల్లై గ్రామంలో జులై 12 నుంచి మూడు రోజులపాటు అంగరంగ వైభవంగా ఈ వివాహ వేడుక జరిగింది. హట్టి తెగ జానపద పాటలతో, నృత్యాలతో అన్నదమ్ములైన ప్రదీప్, కపిల్‌లను సునీతా చౌహాన్ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఈ వేడుకకు హాజరై వాళ్లను ఆశీర్వదించారు కూడా. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ప్రదీప్ స్థానికంగా ప్రభుత్వ ఉద్యోగి కాగా.. అతని సోదరుడు కపిల్ విదేశాల్లో జాబ్ చేస్తున్నాడు. కున్‌హట్ గ్రామానికి చెందిన సునీత పెద్దల మాటకు విలువ ఇచ్చే ఈ వివాహం చేసుకుందట. తమపై ఎవరి ఒత్తిడి లేదని, ఇష్టపూర్వకంగానే చేసుకున్నామని, పైగా ఇలా వివాహం చేసుకోవడం(polyandry) అనాదిగా తమ తెగలో వస్తున్న ఆచారమని చెబుతున్నారు. పైగా ఈ వివాహం తమకెంతో గర్వంగా ఉందని ఫొటో షూట్‌లో ఉత్సాహంగా పాల్గొంటూ చెప్పారు.
Astonishing! Two real brother marry a Same Girl 👇
In Shillai area of Sirmaur district, two real brothers have married the same girl. This has become a topic of discussion in the entire region. This tradition is ancient in the Giripar region but in today's modern era, due to the… pic.twitter.com/8fIOaeQtjs— Akashdeep Thind (@thind_akashdeep) July 19, 2025
హట్టి తెగ ప్రజలు హిమాచల్ ప్రదేశ్-ఉత్తరాఖండ్ సరిహద్దులో ట్రాన్స్ గిరి రీజియన్‌లో 450 గ్రామాల్లో నివాసం ఉంటున్నారు. మూడేళ్ల కిందటే ఈ తెగకు షెడ్యూల్డ్ ట్రైబ్(గిరిజన తెగ.. ఎస్టీ) గుర్తింపు దక్కింది. అయితే వేల ఏళ్లుగా బహుభర్తృత్వం((polyandry)ను ఈ తెగ పాటిస్తోందట. అందుకు భూవివాదాలే ప్రధాన కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు.
కుటుంబ ఐక్యత.. తద్వారా భూవివాదాలు లేకుండా ఉండేందుకే హట్టి తెగ ఈ ఆచారం మొదలుపెట్టిందట. సోదరుల మధ్య బంధం బలంగా ఉండి ఉమ్మడి కుటుంబంలో గొడవలు జరగవనేది మరో కారణం. అంతేకాదు.. ఇద్దరు భర్తలు ఉంటే తమ ఆడబిడ్డలకు రక్షణ బలంగా ఉంటుందని ఈ తెగవారు భావిస్తారట.
అయితే.. మారుతున్న పరిస్థితులు, మహిళలు చదువుకోవడం, ఆర్థికంగా స్థితిగతులు మెరుగుపడడం.. కారణాలతో ఈ తరహా వివాహాలు అరుదుగా జరుగుతూ వస్తున్నాయి. ఈ తరహా వివాహాలకు అక్కడి రెవెన్యూ చట్టాలు కూడా సమ్మతిని తెలుపుతున్నాయి. జోడిధారా పేరుతో గత ఆరేళ్లలో ఈ తరహా వివాహాలు ఐదు జరిగాయని అధికారులు చెబుతున్నారు.
హట్టి తెగలో ‘జాజ్దా’ పేరుతో ఈ వివాహ సంప్రదాయం కొనసాగుతుంది. పెళ్లి కూతురిని ఊరేగింపుగా పెళ్లి కొడుకులు ఉన్న ఊరికి తీసుకొస్తారు. అక్కడ వరుడి ఇంట సీంజ్ అనే పద్దతిలో పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు. వాళ్ల భాషలో పంతులుగారు మంత్రాలు చదువుతూ.. పవిత్ర జలాన్ని వధువు- ఇద్దరు పెళ్లి కొడుకుల మీద జల్లుతాడు. ఆపై ఆ ముగ్గురు ఒకరికొరు బెల్లం తినిపించుకుంటారు. ఆఖర్లో కుల్ దేవతా ఆశీర్వాదంతో ఈ వివాహ తంతు ముగుస్తుంది. హిమాలయ పర్వతాల రీజియన్‌లోని కొన్ని తెగలు ఒకప్పుడు ఈ తరహా వివాహాలకు మక్కువ చూపించేవి. తమిళనాడులో తోడా అనే తెగ ఒకప్పుడు ఈ ఆచారం పాటించేది. అలాగే నేపాల్, కెన్యాలో కొన్ని తెగల్లో ఇప్పటికీ ఈ తరహా వివాహాలు జరుగుతున్నాయి.