
తేదీ: జూలై ఐదు, 2025..
స్థలం: కేరళలోని పన్నియాంకర టోల్ ప్లాజా!
ఒక్కటొక్కటిగా కార్లు బారులు తీరుతున్నాయి!
నిమిషాలు గడుస్తున్నాయి కానీ..
ఒక టోల్‌బూత్‌లో వాహనాలు ఎంతకీ ముందుకు కదలడం లేదు!
హారన్లు మోగుతున్నాయి... అరుపులు వినిపిస్తున్నాయి..
ఇక లాభం లేదనుకుని కొన్ని వాహనాలు పక్క బూత్‌లకు మళ్లుతున్నాయి.
అంతటి హడావుడిలోనూ షెంటో వి.ఆంటో మాత్రం చాలా కూల్‌గా ఉన్నాడు!
ట్రాఫిక్ మొత్తం నిలిచిపోయిన బూత్‌లో అందరికంటే ముందు ఉన్నది అతడే. కేరళ సినిమా రంగంలో ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుంటున్న సినిమాటోగ్రఫర్ ఈ కుర్రాడు. పని కోసం పాలక్కాడ్, ఎర్నాకులం, త్రిశూర్ ప్రాంతాల్లో రోజూ తిరుగుతూంటాడు. రోజులాగే జూలై ఐదున అతడు పన్నియాంకర టోల్ ప్లాజా వద్ద వాహనాన్ని నిలిపేశాడు.. టోల్ కట్టమని బూత్‌లోని ఉద్యోగి అడుగుతూనే ఉన్నాడు కానీ షెంటో మాత్రం ససేమిరా అంటున్నాడు. డబ్బుల్లేక కాదు. ‘‘నేనిప్పటివరకూ ప్రయాణించిన టోల్ రోడ్డు ఏం బాగాలేదు. అన్నీ బాగా ఉంటేనే కదా నేను ఆ రోడ్డును వాడుకున్నందుకు టోల్ కట్టాలి. బాగాలేదు కాబట్టి కట్టను’’ అని భీష్మించుకున్నాడు.
ఉద్యోగి సూపర్‌వైజర్లు వచ్చినా షెంటో మాత్రం తన పంథా మార్చుకోలేదు. ఏమాత్రం తొణకకుండా, బెణకక్కుండా తన వైఖరిని విస్పష్టంగా చెబుతూనే ఉన్నాడు. ఎక్కడా మాట తూలింది లేదు. గట్టిగా అరిచిందీ లేదు. అంతేకాదు.. గుంతలు పడ్డ ఇలాంటి రహదారుల్లో తాను గర్భవతి అయిన తన చెల్లెల్ని తీసుకెళ్లానని, ఆమెకేమైనా అయిఉంటే బాధ్యత ఎవరిది? అని వివరిస్తున్నాడు. ఇలా ఏమాత్రం భద్రతలేని విధంగా రోడ్లు నిర్మించినందుకు.. నిర్వహణ చేయనందుకు టోల్ ఎందుకు కట్టాలని ప్రశ్నించాడు. సమయం గడుస్తోంది... షెంటో కదలనంటున్నాడు.. టోల్‌ప్లాజా ఉద్యోగులు వదలమంటున్నారు. ఆఖరుకు టోల్ నిర్వాహకులు ఈ విషయాన్ని తమ ఉన్నతాధికారులకు తెలిపారు. ఏం చేయాలో వారికీ దిక్కుతోచలేదు. మల్లగుల్లాలు పడ్డారో.. చర్చలు జరిపారో తెలియదు కానీ.. తొమ్మిదిన్నర గంటల తరువాత... ‘‘బాబూ నువ్వు టోల్ కట్టనవసరం లేదు. వెళ్లండి’’ అని దారి ఇచ్చారు. ఓరిమికి ఉన్న బలం ఇదన్నమాట!.
ఈ ఒక్క నిరసన వైరల్ అయిపోవడం పెద్ద విశేషం కాదు కానీ.. సాఫీగా ప్రయాణించలేని రోడ్లపై టోల్ ట్యాక్స్ వసూలు చేయకూడదని కేరళ హైకోర్టు స్వయంగా వ్యాఖ్యానించడం మాత్రం విశేషమే. పైగా తొమ్మిదిన్నర గంటలపాటు ఎలాంటి ఆవేశ కావేశాలకు లోను కాకుండా షెంటో తన వైఖరికి కట్టుబడి నిలిచిన తీరు అందరి మన్ననలు పొందింది. టోల్ ట్యాక్స్ వసూలు చేసే సంస్థలు కూడా కొంత రహదారులను సక్రమంగా నిర్వహిస్తే మేలేమో!.