
‘‘దేశం ఇప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉంది’’ నూటొక్క జిల్లాల అందగాడిగా పేరొందిన సినీ నటుడు, దివంగత నూతన్‌ప్రసాద్ ఒకానొక సినిమాలో చెప్పిన డైలాగ్ ఇది. నిజజీవితంలో ఇలాంటి డైలాగులు వినడం కష్టమే కానీ.. ప్రస్తుతం దేశం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉందని చెప్పక తప్పదు. ఊహూ.. మనం మాట్లాడుకుంటున్నది రాజకీయాల గురించి కానే కాదు. పాక్‌తో యుద్ధం.. లేదా అమెరికాతో టారిఫ్‌ల విషయం అంతకంటే కాదు. దీనికంటే కొంచెం సీరియస్ విషయం. దేశం భవిష్యత్తును నిర్ణయించేది కూడా. ఏమిటంటారా.. తాజా గణాంకాల ప్రకారం మన సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది!
జనాభా తగ్గితే మంచిదే కదా అంటున్నారా? నిజమే కానీ.. అన్నివేళలా కాదు. ఎందుకంటే.. సంతానోత్పత్తి రేటు తగ్గుతూనే ఉంటే.. దేశం ముసలిదైపోతుంది. వృద్ధుల వైద్యావసరాలు తీర్చడం కష్టమవుతుంది. ఇది కాస్తా ప్రభుత్వాలపై మరింత ఆర్థిక భారాన్ని మోపుతుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో వస్తున్న కొన్ని పోస్టులు గమనిస్తే మీకీ విషయం అర్థమైపోతుంది. ‘‘మా దేశం రండి. ఉచితంగా ఇల్లిస్తాం. ఉద్యోగం వెతుక్కునేంతవరకూ నెలవారీ భృతి కూడా ఇస్తాం’’ అంటూ కొన్ని యూరోపియన్ దేశాలు ఊరిస్తున్నాయి. ఆయా దేశాల్లో సంతానోత్పత్తి రేటు దశాబ్దాలుగా తగ్గిపోతూండటం వల్ల వచ్చిన సమస్య ఇది. ఇంతకీ మన దేశంలో పరిస్థితి ఎంత ప్రమాదకరంగా ఉంది? ఒక్కసారి పరిశీలిద్దాం..
1950లలో దేశ సగటు సంతానోత్పత్తి రేటు 6.18. అంటే పిల్లల్ని కనగలిగే వయసులో ఉన్న ఒక్కో మహిళ కనీసం ఆరుగురికి జన్మనిచ్చేదన్నమాట. నిజమే మరి.. మన తాత ముత్తాతల కుటుంబాలు చాలా పెద్దవిగానే ఉండేవి. ఉమ్మడి కుటుంబాలు... బోలెడంత మంది చిన్నాన్నలు, అత్తమ్మలు, మేనమామలు ఉండేవారు. అయితే.. దేశ అవసరాల కోసం అనండి.. ఇంకో కారణం చేతనైనా కానివ్వండి ఈ సంతానోత్పత్తి రేటు క్రమేపీ తగ్గుతూ వచ్చింది. 2018లో 2.2 గా ఉన్న సంతానోత్పత్తి రేటు 2021 నాటికి 1.9కి పడిపోయింది.
ఏ దేశంలోనైనా జనాభా క్రమేపీ పెరుగుతూ ఉండాలంటే సంతానోత్పత్తి రేటు 2.1 లేదా అంతకంటే ఎక్కువగా ఉండాలి. ఇంకోలా చెప్పాలంటే చనిపోయే వారికంటే పుట్టే వారు ఎక్కువగా ఉండాలంటే ఒక్కో మహిళ 2.1 మందిని కనాలన్నమాట. తాజాగా అంటే 2023ను బేస్ సంవత్సరంగా పరిగణించి చేసిన సర్వే ప్రకారం కూడా దేశ సంతానోత్పత్తి రేటు 1.9కి మించడం లేదు. అంటే... ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌కు ఉన్న రికార్డు చెరిగిపోనుందన్నమాట. ఎప్పుడన్నదే ప్రశ్న. ప్రస్తుత దేశ జనాభా కూర్పు ఎలా ఉందంటే.. పద్నాలుగేళ్ల లోపువారు 24 శాతం మంది ఉంటే పనిచేసే స్థితిలో ఉన్న వారు (15 - 64) వారు 68 శాతం మంది ఉన్నారు. మిగిలిన ఏడు శాతం మంది 65 ఏళ్లపైబడ్డ వృద్ధులు!
అయితే ఏంటి?
2050 నాటికి దేశంలో 65 ఏళ్లపైబడ్డ వారు మొత్తం జనాభాలో 20 శాతానికి చేరుకుంటారని అంచనా. అంటే.. సుమారు 19 కోట్ల మంది పని చేసే స్థితిలో ఉండరు. వీరందని పోషణ భారం ఇతరులపై పడనుంది. వృద్ధుల ఆరోగ్య అవసరాల కోసం ప్రభుత్వాలు మరింత ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. జర్మనీ, ఇటలీ, స్పెయిన్ వంటి దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి. ఫలితంగా ఆయా దేశాల గ్రామీణ ప్రాంతాలు దాదాపుగా నిర్మానుష్యమైపోయాయి. యువత ఉపాధివేటలో నగరాలకు మళ్లిపోవడం దీనికి కారణం. మన పల్లెల్లోనూ ఇదే పరిస్థితి. యూరోపియన్ దేశాల మాదిరిగా వృద్ధాప్య సంక్షోభం ఎదుర్కోకుండా ఉండాలంటే మౌలిక సదుపాయాలు (వృద్ధుల కోసం ప్రత్యేక ఆసుపత్రులు, ప్రభుత్వ పథకాలు వంటివి)పై పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టాలి. అలాగే ఉద్యోగాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచాలి. ఇందుకు తగినట్టుగా విధానాలు మార్చాలి. పిల్లల పెంపకం ఒక భారం కాకుండా ఉండేలా తగిన ఆర్థిక సంస్కరణలు తీసుకురావాలి.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా