
ఇంట్లో.. వీధుల్లో, క్లాసుల్లో.. ఆఫీసుల్లో కూడా.. మన చేతుల్లో స్మార్ట్‌ఫోన్ లేని సందర్భమంటూ ఉండదు. కానీ మనలో కొందరు ఇక్కడికే పరిమితం కావడం లేదు. ఉదయాన్నే బాత్రూమ్‌ల్లోకి వెంట తీసుకెళ్తున్నారు. రీల్స్ తిరగేస్తూ కాల కృత్యాలు తీర్చుకునే ఈ పద్ధతి కాస్తా డేంజర్‌గా మారుతోందంటున్నారు శాస్త్రవేత్తలు. ఇలా బాత్రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్లతో కాలక్షేపం చేసే వారిలో కనీసం సగం మందికి ‘హెమరాయిడ్స్’ వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎందుకు? ఎలా? ఏమిటి? అని అనుకుంటున్నారా?...
మలద్వారంలో ఒత్తిడి పెరిగిపోవడం, మంట/వాపులకు గురవడం వల్ల అక్కడి నరాలు వాచిపోతుంటాయి. వీటినే హెమరాయిడ్లు లేదా పైల్స్ అని పిలుస్తుంటారు. రోజంతా కూర్చొనే ఉండటం, పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకోకపోవడం, మలబద్ధకం, మహిళలైతే గర్భధారణ సమయంలో ఈ హెమరాయిడ్లకు కారణాలని వైద్యశాస్త్రం చెబుతోంది. బాత్రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్ వినియోగం అన్నది తాజాగా ఈ జాబితాలోకి చేరింది. బోస్టన్ (అమెరికా)లోని బెత్ ఇజ్రాయెల్ డెకోనెస్ మెడికల్ సెంటర్ శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం మల విసర్జన సమయంలో స్మార్ట్‌ఫోన్లను వాడితే హెమరాయిడ్లు వచ్చే అవకాశం 46 శాతం వరకూ ఎక్కువ అని తేలింది. స్మార్ట్‌ఫోన్లు మన జీవితాలపై ఎలాంటి ప్రభావాలు చూపుతాయన్న దానిపై ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నామని.. ఎప్పుడు? ఎక్కడ? ఎలా వాడతామన్నది అనూహ్యమైన పరిణామాలకు దారితీయవచ్చును అనేందుకు తాజా పరిశోధన ఒక నిదర్శనమని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ త్రిషా పశ్రీచా అంటున్నారు.
సంబంధం ఏమిటి?
స్మార్ట్‌ఫోన్లను బాత్రూమ్‌లలో వాడితే హెమరాయిడ్లు ఎందుకు వస్తాయన్న ప్రశ్నకు డాక్టర్ పశ్రీచా బదులిస్తూ.. ‘స్మార్ట్‌ఫోన్లల వాడకం వల్ల సమయం గుర్తుండకపోవడం చాలా సహజం. ఫలితంగా ఆ సమయంలో మలద్వారం వద్ద ఉన్న కండరాలు, నరాలపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ కాలం కొనసాగుతుంది. ఫలితంగా కాలం గడుస్తున్న కొద్దీ హెమరాయిడ్లు వచ్చే అవకాశాలు ఎక్కువ అవుతాయి’ అన్నారు. ఈ విషయాన్ని తెలుసుకునేందుకు డాక్టర్ పశ్రీచా బృందం 45 ఏళ్లు పైబడ్డ వారు 125 మందిని పరిశీలించింది. వీరందరూ పేగుల పరీక్ష (కొలనోస్కోపీ)కి సిద్ధంగా ఉన్న వారు. ఆహార అలవాట్లు, ఉండేచోటు, బాత్రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్లు వాడతారా? లేదా? వంటి పలు వివరాలను వీరి నుంచి సేకరించారు.
అలాగే మల విసర్జన అలవాట్లు కూడా అడిగి తెలుసుకున్నారు. కొలనోస్కోపీ సమయంలో వీరికి హెమరాయిడ్లు ఉన్నదీ లేనిది స్పష్టం కాగా.. స్మార్ట్‌ఫోన్లు వాడని వారితో పోల్చి చూసినప్పుడు వాడే వారిలో హెమరాయిడ్స్ ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉన్నట్లు స్పష్టమైంది. పరిశీలించిన ఈ 125 మందిలో 66 శాతం మంది బాత్రూమ్‌లలో స్మార్ట్‌ఫోన్‌ను వినియోగిస్తున్నారు. మిగిలిన వారితో పోలిస్తే వీరు ఐదు నిమిషాలు ఎక్కువ సమయం బాత్రూమ్‌లలో గడుపుతున్నారు.
స్మార్ట్‌ఫోన్లను బాత్రూమ్‌ల వరకూ తీసుకెళ్లకూడదన్న సాధారణ సలహాకు ఈ అధ్యయనం బలం చేకూరుస్తోందని, మలవిసర్జనకు ఎక్కువ సమయం పడుతూంటే ఎందుకు అన్న ప్రశ్న వేసుకుని అలవాట్ల సరిచేసుకోవాలని డాక్టర్ పశ్రీచా సూచించారు. అయితే కొంతమంది గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్‌లు మాత్రం స్మార్ట్‌ఫోన్ వాడినా, వాడకపోయినా బాత్రూమ్‌లో ఐదు నిమిషాల కంటే ఎక్కువ సమయం గడపడం అంత ఆరోగ్యకరమైన అంశం కాదని స్పష్టం చేస్తున్నారు.
-గిళియారు గోపాలకృష్ణ మయ్యా.