
గత కొంతకాలం కిందట రిటైర్ అయిన పరంధామయ్య మొదట్లో బాగానే ఉండేవారుగానీ ఈ మధ్య అంత చురుగ్గా లేకపోవడంతో పాటు ఎంతో విచారంగా కనిపిస్తున్నారు. పిల్లలిద్దరూ యూఎస్‌లో ఉండటంతో పరంధామయ్య దంపతులిద్దరూ ఒంటరిగానే ఉండాల్సి వస్తోంది. గతంలోలా ఎక్కడికీ వెళ్లడం లేదు. కాస్త మతిమరపు వచ్చినట్టుగా ఫీలవుతున్నారు కూడా.
బాగా సన్నిహితులైన ఒకరిద్దరు కనిపించి సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లమంటే... ‘తానేమైనా పిచ్చివాడిని అయిపోతున్నానా?’ అనే దిగులు ఆయన్ను మరింత కుంగదీస్తోంది. ఎట్టకేలకు కొందరు ఫ్రెండ్స్ ఆయనను సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకెళ్తే తేలిందేమిటంటే... ఆయన ‘వృద్ధాప్యం తాలూకు డిప్రెషన్’తో బాధపడుతున్నట్లు తేలింది. ఇంట్లో కనీసం మనవలూ, మనవరాళ్లూ ఉండి ఉంటే గ్రాండ్స్ పేరెంట్స్‌కు ఈ పరిస్థితి వచ్చేది కాదేమోనని చెప్పడంతో ఈ వృద్ధాప్యపు డిప్రెషన్ గురించి నలుగురికీ తెలియడం మంచిదని ఫీలయ్యారు పరంధామయ్య ఫ్రెండ్స్. వృద్ధాప్యంలో వచ్చే ఆ ‘ఓల్డ్ ఏజ్ డిప్రెషన్’ తాలూకు వివరాలివి...
ఆల్కహాల్‌తోనూ డిప్రెషన్...
కొందరు పెద్దవయసు వారు ఆ వయసులో బాగా నిద్రపట్టేందుకూ లేదా హాయిగా సాయంత్రాలు గడిపేందుకూ మద్యం ఒక సాధనమని అనుకుంటుంటారు. అయితే ఆ వయసులో అతిగా తాగే మద్యం వల్ల కూడా డిప్రెషన్ వస్తుంది. ఆల్కహాల్ వల్ల తేలిగ్గా కోపం, చిరాకు వంటి ఉద్వేగాలకు గురికావడం (ఇరిటబిలిటీ), యాంగై్జటీకి లోనుకావడం, మెదడులోని జీవక్రియలు అస్తవ్యస్తం కావడం జరగవచ్చు.
ఆల్కహాల్ కారణంగా వృద్ధులకు ఇచ్చే యాంటీ డిప్రెసెంట్ మందులు అంత ప్రభావపూర్వకంగా పనిచేయకపోవడం వంటివీ జరగవచ్చు. మద్యం నిద్ర నాణ్యతను దెబ్బతీసే ముప్పు ఉంటుంది. పైగా మద్యం మత్తులో పడిపోవడం జరిగి, ఆ వయసులో పూర్తిగా మరొకరిపై ఆధారపడాల్సి రావడం కూడా ఒక నిస్సహాయతతో పాటు... అలా ఆధారపడాల్సి రావడమనే భావన కూడా డిప్రెషన్‌కు దారితీయవచ్చు.
వయసు పైబడిన వారు ముందుగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే... తమ మనసుకు వచ్చిన సమస్యనూ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లాల్సిన పరిస్థితిని చాలా సహజమని గుర్తించాలి. తల్లిదండ్రులు కాస్తా గ్రాండ్ పేరెంట్స్‌గా మారే టైముకు పిల్లలు తమ పిల్లలతో (గ్రాండ్ చిల్డ్రెన్‌తో) కలిసి వాళ్ల కెరియర్ కోసం విదేశాలకు లేదా దూర్రపాంతాలకు వెళ్లడం చాలా సహజం. ఇటీవలి సామాజిక ధోరణి కారణంగా... తమ రిటైర్‌మెంట్ నాటికి పెద్దలు డిప్రెషన్‌కు లోనుకోవడం చాలా సాధారమవుతోంది. పైగా ఈ తరహా డిప్రెషన్ ఇటీవల చాలామందిలో విపరీతంగా విస్తరిస్తోంది. దురదృష్టవశాత్తు త వైద్యులను సంప్రదించేవారి సంఖ్య చాలా తక్కువగా ఉండటం ఆందోళన గొలిపే అంశం.
వృద్ధాప్య డిప్రెషన్‌కు కారణాలు...
నిజానికి డిప్రెషన్ ఏ వయసులోనైనా రావచ్చు. కానీ వృద్ధాప్యంలో డిప్రెషన్‌కు లోనయ్యేందుకు అవకాశాలు ఎక్కువ. అందుకు కారణాలివి...
→ ఒంటరితనం: ముందుగా చెప్పుకున్నట్టు తాము స్థిరపడటానికి పిల్లలు దూర్రపాంతాల్లో ఉంటారు. పెద్దలు తామంతట తాము కదల్లేని స్థితిలో ఉండి, ఇతరుల మీద ఆధారపడాల్సి రావడం డిప్రెషన్‌కు దారితీయవచ్చు.
→ ఆరోగ్య సమస్యలు: వృద్ధాప్యంలో అనారోగ్య సమస్యలు చాలా సాధారణం. దీర్ఘకాలిక వ్యాధులు, జ్ఞాపకశక్తి, శారీరక దృఢత్వం, వ్యాధి నిరోధకశక్తి తగ్గడం, శస్త్రచికిత్స చేయించాల్సిన జబ్బులకూ వృద్ధాప్యం కారణంగా చికిత్స తీసుకునే పరిస్థితి ఉండకపోవడం వంటి కారణాలతో డిప్రెస్ అవుతుంటారు.
→ అర్థం లేని భయాలు: ఎవరూ దగ్గరగా లేని సమయంలో తాము చనిపోతామేమో, అలాగైతే తాము చనిపోయిన విషయం పిల్లలకు ఎలా తెలుస్తుంది... లాంటి అర్థం లేని భయాలు వేధిస్తుంటాయి.
→ ఏ ప్రయోజనాల కోసం బతకాలనే భావన: ఇకపై ఎవరి ప్రయోజనాలకోసం, ఏం సాధించడానికి బతికి ఉండాలనే నిరాశాపూర్వకమైన భావనతో ప్రతికూల ఆలోచనలు వెంటాడటం.
→ ఇటీవల చూస్తున్న తమ తోటివారి మరణాలు: తమ బంధువుల్లో, తెలిసినవారిలో తమ వయసువారు చనిపోతుండటంతో కలిగే కుంగుబాటు. ఒకవేళ అలా మరణించిన వారిలో తమ జీవిత భాగస్వామి ఉండటం డిప్రెష¯Œ కు దారితీస్తుంది.
వైద్య ఆరోగ్య అంశాలతో కలిగే డిప్రెషన్...
వృద్ధాప్యంలో వచ్చే కొన్ని రకాల వ్యాధుల వల్ల అంటే ఉదాహరణకు... డయాబెటిస్‌తో పాటు దాని వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు, హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం, క్యాన్సర్, థైరాయిడ్ సమస్యలు, విటమిన్ బి–12 లోపం, మతిమరపు, అలై్జమర్స్ వ్యాధి, లూపస్, మల్టిపుల్ స్కి›్లరోసిస్ వంటి కారణంగా డిప్రెషన్‌కు లోనయ్యే అవకాశాలెక్కువ.
కొన్ని రకాల మందులతోనూ డిప్రెషన్...
కొన్ని సందర్భాల్లో ఆ వయసులో వాడే కొన్ని రకాల మందుల వల్ల కూడా డిప్రెషన్ రావచ్చు. ఉదాహరణకు మామూలుగా రక్తపోటుకు వాడే కొన్ని మందులు, బీటా బ్లాకర్లు, కొన్ని రకాల నిద్రమాత్రలు, క్యాల్షియమ్ ఛానెల్ బ్లాకర్లు, పార్కిన్‌సన్ డిసీజ్ తాలూకు మందులు, అల్సర్ మందులు, గుండెజబ్బుల మందులు, కొన్నిరకాల స్టెరాయిడ్స్, హైకొలెస్ట్రాల్ ఉన్నవారు వాడే మందులు, నొప్పినివారణ మందులు, ఆర్థరైటిస్ ఔషధాలు, ఈస్ట్రోజెన్ హార్మోన్ వంటివి పెద్దవయసు వారిలో డిప్రెషన్‌కు కారణం కావచ్చు.
డిప్రెషన్ నుంచి దూరమవ్వాలంటే...
తమ పట్ల తాము కాస్తంత శ్రద్ధ తీసుకోవడం ద్వారా ఎంతగా వయసు పైబడినప్పటికీ డిప్రెషన్‌ను దరిచేరనివ్వకుండా చూడవచ్చు. వృద్ధాప్యంలో డిప్రెషన్‌ను నివారించే చర్యలివే...
→ నలుగురినీ కలవడం : వృద్ధాప్యంలో కలిగే తీరికతో నలుగురినీ కలుస్తుండటం.(డిప్రెషన్ నివారణకూ లేదా అధిగమించడానికి ఇది బాగా పనిచేస్తుంది).
→ వ్యాయామం : తమకు శారీరక శ్రమ కలిగించని రీతిలో వాకింగ్ వంటి వ్యాయామల వల్ల డిప్రెషన్ దరిచేరదు.
→ కంటి నిండా నిద్ర: కంటినిండా నిద్రపోవడం డిప్రెషన్‌కు మంచి మందు. అయితే మితిమీర కూడదు. అంటే... నిద్రసమయం 7–9 గంటలు మించనివ్వవద్దు.
→ సమతుల ఆహారం : అన్ని పోషకాలు అందేలా తేలిగ్గా జీర్ణమయ్యే సమతులా ఆహారం తీసుకోవాలి. జంక్‌ఫుడ్ వద్దు.
→ హాబీలు : మనకు ఆసక్తి కలిగించే హాబీలను కొనసాగించవచ్చు. యుక్తవయసులో పనిఒత్తిడి, తీరిక లేని కారణంగా మానేసిన హాబీలను ఈ సమయంలో పునరుద్ధరించుకోవడం డిప్రెషన్ నివారణకు చాలా మేలు చేస్తుంది.
→ పెంపుడు జంతువులు : పెట్స్ ఆలనా–పాలనా డిప్రెషన్‌ను దరిచేరనివ్వవు.
→ కొత్త విద్యలు/ నైపుణ్యాలు : వీటిని నేర్చుకోవడం డిప్రెషన్‌ను అధిగమించడానికి చాలా మేలు చేస్తుంది. ఆసక్తి ఉంటే ఏ వయసులోనైనా, ఏ విషయాన్నైనా నేర్చుకోవచ్చు. పైగా వృద్ధాప్యంలో వేరే వ్యాపకాలేవీ ఉండవు కాబట్టి ఆ టైమ్‌లో నేర్చుకోవడం సులభం కూడా.
→ హాస్యం : ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ, హాస్యప్రియత్వం కలిగి ఉండటం.
వృద్ధాప్య డిప్రెషన్ లక్షణాలు
→ ఎప్పుడూ తీవ్రమైన నిరాశ, విచారం ∙నిత్యం అలసట ∙గతంతో తమకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిన హాబీలూ లేదా వ్యాపకాలపైనా ఆసక్తి కోల్పోవడం ∙ఒంటరిగా ఉండటానికి ఇష్టపడటం ∙్రఆకలి తగ్గడం ∙బరువు తగ్గం ∙తరచూ నిద్రాభంగం లేదా ఒక్కోసారి మితిమీరి నిద్రపోతుండటం ∙తనతో ఏ ప్రయోజనమూ లేదనీ, తాను సమాజానికి భారమనే భావన ∙మద్యం/డ్రగ్స్‌కు బానిస కావడం ∙త్వరగా మరణించాలనే భావన లేదా ఆత్మహత్యా ధోరణి/ ఆలోచనలూ/ యత్నాలు.
చికిత్స
పై నివారణ చర్యల తర్వాత కూడా డిప్రెషన్‌కు లోనైన వారికి సైకియాట్రిస్ట్ ఆధ్వర్యంలో ఎస్‌ఎస్‌ఆర్ మందులు, యాంటీడిప్రెసెంట్స్‌తో చికిత్స చేయాల్సి ఉంటుంది. కొందరిలో కేవలం కౌన్సెలింగ్‌తోనే సమస్య తీరవచ్చు. కొందరికి కౌన్సెలింగ్‌తో పాటు మందులూ అవసరం పడవచ్చు.
అది బాధా... డిప్రెషనా?
కొందరిలో డిప్రెషన్ కాకుండా తీవ్రమైన బాధ కూడా ఉండవచ్చు. కాస్త శ్రద్ధగా పరిశీలించుకుంటే అది డిప్రెషనా లేక బాధనా అన్నది గుర్తుపట్టడమూ కాస్తంత తేలికే. ఉదాహరణకు బాధలో ఉన్నవారికి అప్పుడప్పుడైనా సంతోష భావన కలుగుతుంది. అలాంటి సంతోష భావనలూ, ఆనందాలూ, ఇతరత్రా ఉద్వేగాలేవీ లేకుండా ఎప్పుడూ విచారం, బాధ, నిరాశ, నిస్పృహలతో ఉంటే అది డిప్రెషన్‌గా పరిగణించవచ్చు.
వృద్ధుల్లో డిప్రెషన్‌ను గుర్తించడమిలా...
→ తమలో అంతకు మునుపు లేని నొప్పులను ఏకరవు పెడుతుండటం ∙తాము ఏపనీ చేయలేకపోతున్న విషయాలను తరచూ ప్రస్తావిస్తూ ఉండటం ∙యాంగై్జటీకి గురికావడం / వేదన, బాధలను వ్యక్తపరుస్తుంటం ∙త్వరగా భావోద్వేగాలకు గురికావడం ∙వ్యక్తిగత విషయాలపై తగిన శ్రద్ధ చూపకపోవడం.
విచారం/బాధలూ లేకున్నా డిప్రెషన్!
సాధారణంగా డిప్రెషన్‌లో తీవ్రమైన విచారం, బాధ ఉండటం చాలా సాధారణం. కొందరిలో ఇలాంటి లక్షణాలేమీ కనిపించకుండానే డిప్రెషన్‌లోకి వెళ్లే అవకాశాలుంటాయి. ఏ పనిపైనా వాళ్లకు ఆసక్తిలేకపోవడం; ఏదైనా చేయాలంటే ఉత్సాహం లేకపోవడం (లో మోటివేషన్); ఏదైనా పని చేయడానికి తగిన శక్తి/సామర్థ్యం తమలో లేదనే భావన వంటి ఫీలింగ్స్‌తో ఈ డిప్రెషన్ కనిపిస్తుంది. కొందరిలో ఎప్పటికీ తగ్గని ఒంటి నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలతో కూడా వృద్ధాప్యపు డిప్రెషన్ వ్యక్తం కావచ్చు.
డాక్టర్ శ్రీనివాస్ ఎస్‌ఆర్‌ఆర్‌వై
హెచ్‌వోడీ ఆఫ్ సైకియాట్రీ –సీనియర్ సైకియాట్రిస్ట్
ఎంజీఎం ప్రభుత్వ ఆసుపత్రి, వరంగల్
– యాసీన్