పోస్ట్ పార్టమ్
బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లికి డిప్రెషన్ రావడం సహజం. దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్‌ను ఎదుర్కొంటున్నారని నిపుణులు అంటున్నారు. మైక్రో ఫ్యామిలీగా ఉండటం వల్ల పెంపకం బాధ్యత ఒత్తిడి కారణంగా డిప్రెషన్, యాంగ్జయిటీ ఎదుర్కొంటున్న తండ్రుల గురించి పట్టించుకోవాల్సి ఉంది.
కుంగిపోతారు
‘ఒక బిడ్డను పెంచడానికి ఓ ఊరంతా కావాలని’ సామెత. గతంలో ఉమ్మడి కుటుంబాల్లో బిడ్డల పెంపకానికి వెసులుబాటు ఉండేది. బాధ్యతను అందరూ పంచుకొని బిడ్డను కంటికి రెప్పలా కాపాడేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి మారిపోయింది. బిడ్డల పెంపకమంతా తల్లిదండ్రుల మీదే పడింది. ఈ కారణం వల్ల కొంత, భౌతిక–మానసిక మార్పుల వల్ల కొంత బిడ్డ పుట్టిన తొలి రోజుల్లో తల్లి కుంగుబాటుకు గురవడం చాలామందికి తెలిసిందే! దాన్నే పోస్ట్ పార్టమ్ డిప్రెషన్ అంటారు. అయితే తల్లులతోపాటు తండ్రులూ ఆ డిప్రెషన్ ను ఎదుర్కొంటున్నారని వైద్యనిపుణులు అంటున్నారు.
అసలేంటీ పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్?
స్త్రీ జీవితంలో మాతృత్వం మధురమైన అనుభవం. ఆ సమయంలో ఆమెలో అనేక శారీరక, మానసిక మార్పులు ఏర్పడతాయి. దాంతో ఒత్తిడి, చిరాకు, యాంక్సైటీ, కోపం, కుంగుబాటు ఆమెను చుట్టుముడతాయి. బిడ్డను రోజంతా చూసుకోవాల్సి రావడం, నిద్ర సరిగ్గా లేకపోవడం, ఒకేచోట గంటల తరబడి ఉండిపోవడం వల్ల పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కి గురవుతారు. ఇది కొందరితో గర్భధారణ సమయం నుంచే మొదలవుతుందని వైద్యులు అంటున్నారు. ఇన్నాళ్లూ ఈ సమస్య అమ్మలకే వస్తుందనే ఆలోచన ఉండగా, ప్రస్తుతం నాన్నలు కూడా ఈ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తేలింది.
నాన్నల్ని అర్థం చేసుకునేదెవరు?
ప్రస్తుతం చాలామంది 27 దాటాక పెళ్లిళ్లు చేసుకొని 30 ఏళ్లకు తండ్రవుతున్నారు. అటు ఉద్యోగం, ఇటు కెరీర్, ఈఎంఐలు, బాధ్యతలు, ఖర్చులు, అవసరాలతో సతమతమైపోతున్నారు. ఇలాంటి నేపథ్యంలో బిడ్డ పుట్టిన ఆనందం ఉన్నా, మెల్లగా ఆ ఆనందం స్థానంలో కొత్తగా రాబోయే ఖర్చులు, బాధ్యతలు వారిని భయపెడుతున్నాయి. బిడ్డ పుట్టాక రాత్రుళ్లు నిద్ర సరిగ్గా లేకపోవడం, భార్యాబిడ్డల్ని చూసుకోవాల్సి రావడం వంటి కారణాలతో మగవారు సైతం పోస్ట్‌పార్టమ్ డిప్రెషన్ కు గురవుతన్నారు. ఉన్నట్టుండి కోపం రావడం, చిన్న విషయాలకు చిరాకు పడటం, అరవడం, ఇంటికి దూరంగా ఉండాలనుకోవడం వంటివి ఈ డిప్రెషన్ తాలూకు లక్షణాలు. తలనొప్పి, వాంతులు, అజీర్తి, కీళ్ల నొప్పులు సైతం వీరిని వేధిస్తాయి.
మగవారికి అందాల్సిన చేయూత
బిడ్డ పుట్టిన తర్వాత చాలామంది తల్లి ఆరోగ్యంపైనే దృష్టి నిలుపుతారు. ఆమెను జాగ్రత్త చూసుకోవాలని భావిస్తుంటారు. తండ్రి పరిస్థితి ఏమిటి... అతను పడుతున్న ఇబ్బందులేమిటన్న విషయాన్ని చాలామంది పరిగణనలోకి తీసుకోరు. మగవారు కూడా తమ సమస్యల్ని బయటకు చెప్పుకునేందుకు మొహమాట పడతారు. లోలోపలే దాచుకొని సతమతమవుతారు. దీంతో వారి సమస్య మరింత పెరిగి ఒక్కోసారి ఆత్మహత్యా ప్రేరేపిత ఆలోచనల వరకూ వెళ్తుందని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో తల్లితోపాటు తండ్రికీ కుటుంబ సభ్యుల చేయూత అవసరమని, వారితో మాట్లాడుతూ, వారి సమస్యల్ని విని ఓదార్పు అందించాలని అంటున్నారు. అవసరమైతే మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లి కౌన్సిలింగ్ అందించాలంటున్నారు.


