అధ్యక్ష పదవికి మూడోసారి
అనర్హత మింగుడు పడని విషయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్య
ఏం చేసినా మూడోసారి
కష్టమన్న అమెరికా హౌస్ స్పీకర్
గ్వాంగ్‌జు (దక్షిణకొరియా): అమెరికా అధ్యక్ష పదవికి మూడోసారి కూడా పోటీపడాలన్న డొనాల్డ్ ట్రంప్ ప్రయత్నాలను సొంత పార్టీ నేతలే అసాధ్యమని తేల్చేయటంతో ఆయన తీవ్ర నైరాశ్యంలో మునిగిపోయారు. మూడోసారి పోటీకి అవకాశం లేకపోవటం దురదృష్టకరమని పేర్కొన్నారు. జపాన్ పర్యటన ముగించుకుని బుధవారం దక్షిణకొరియాకు వెళ్తూ తన ఎయిర్‌ఫోర్స్ వన్ విమానంలో ట్రంప్ మీడియాతో మాట్లాడారు.
అమెరికా కాంగ్రెస్‌లోని దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్ స్పీకర్, రిపబ్లికన్ నేత మైక్ జాన్సన్ మంగళవారం వాషింగ్టన్‌లో మీడియాతో మాట్లాడారు. ట్రంప్ మూడోసారి పోటీ చేయటం సాధ్యం కాదని తేల్చి చెప్పారు. 22వ రాజ్యాంగ సవరణ ఏ అమెరికన్ పౌరుడు కూడా మూడోసారి అధ్యక్షుడు కావటాన్ని అనుమతించదని స్పష్టంచేశారు.
ఒకవేళ ఆ రాజ్యాంగ సవరణను మళ్లీ సవరించి మూడోసారి అధ్యక్ష పదవికి అర్హత లభించేలా చట్టం చేయాలన్నా.. అది పదేళ్ల సుదీర్ఘ ప్రక్రియ అని పేర్కొన్నారు. మైక్ జాన్సన్ ప్రకటన గురించి మీడియా ప్రస్తావించగా ట్రంప్ నిర్వేదంగా మాట్లాడారు. ‘నేను చదివినదాన్ని బట్టి బహుషా నేను కొనసాగటానికి (మూడోసారి అధ్యక్షుడిగా) అనుమతి ఉండదట. ఇది చాలా దురదృష్టకరం. చూద్దాం ఏం జరుగుతుందో’ అని అన్నారు.
కష్టమే కాదు.. అసాధ్యం
మూడోసారి అధ్యక్షుడిగా కొనసాగటానికి ఎవరికీ సాధ్యం కాదని హౌస్ స్పీకర్ మైక్ జాన్సన్ స్పష్టంచేశారు. ‘నాకు తెలిసి అందుకు మార్గమే లేదు. ఈ విషయంలో రాజ్యాంగంలో ఉన్న అడ్డంకులపై ఆయన (ట్రంప్)తో నేను చర్చించాను. ఈ విషయంలో ఇక వివాదాన్ని రాజేయలేం. ఆయనకు ఇంకా నాలుగేళ్ల సమయం (అధ్యక్షుడిగా) ఉంది’అని పేర్కొన్నారు.
అయితే, తనకు మూడోసారి అధ్యక్షుడయ్యే అవకాశం లేకపోయినా తన రిపబ్లికన్ పారీ్టలో ఆ పదవికి అర్హత ఉన్న అనేకమంది నేతలు ఉన్నారని ట్రంప్ పేర్కొన్నారు. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్, విదేశాంగ మంత్రి మార్కో రుబియో వంటివారు అధ్యక్ష పదవికి పోటీ పడవచ్చని తెలిపారు. వచ్చేసారి ఉపాధ్యక్షుడిగా పోటీచేసి, తిరిగి అధ్యక్షుడు అయ్యే అవకాశం ఉందా? అని అడగ్గా.. ‘అలా చేయటానికి అవకాశం ఉంది. కానీ నేను చేయను’ అని బదులిచ్చారు.


