
హైదరాబాద్ చాలా పెద్ద నగరం. కానీ..
అబిడ్స్, కింగ్ కోఠీ, అమీర్‌పేట్ సర్కిల్‌తోపాటు కొన్ని చోట్ల ఒక దృశ్యం మాత్రం కామన్!
ఏమిటయ్యా అదీ అంటే.. టూవీలర్స్, కార్లలో వచ్చి మరీ కొందరు పావురాలకు గింజలు వేస్తూంటారు!
నిన్న మొన్నటివరకూ ఇలాంటి దృశ్యాలు దేశ ఆర్థిక రాజధాని ముంబైలోనూ కనిపించేవి కానీ.. ఇకపై కాదు!
ఎందుకంటారా? చదివేయండి..
పావురాలకు కాసిన్ని గింజలు వేయడం హైదరాబాద్, ముంబైల్లో మాత్రమే కాదులెండి.. దేశంలోని చాలా నగరాల్లో సర్వసాధారణంగా జరిగే విషయమే. జీవకారుణ్యానికి ఇదో పెద్ద నిదర్శనంగా చాలామంది పోజులు కొడుతూంటారు. ఆ పావురాలతో కలిసి రీల్స్ చేస్తూ కనిపిస్తారు. అయితే పది రోజుల క్రితం ముంబై హైకోర్టు ఈ తంతుకు ఫుల్‌స్టాప్ పెట్టమని స్పష్టం చేస్తూ ఆదేశాలిచ్చింది. ఎవరైనా మాట వినకపోతే.. వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని కూడా చెప్పింది. పిచ్చుకపై బ్రాహ్మాస్త్రం అన్నట్టు పావురాలకు తిండిపెడితే క్రిమినల్ కేసులు ఎందుకు అనుకుంటున్నారా? అయితే మీరు ఈ పావురాలతో వచ్చే ఆరోగ్య సమస్యల గురించి తెలుసుకోవాల్సిందే.
పావురాల వ్యర్థాల దగ్గరే ఉన్నందుకు ఈ మధ్యే గుజరాత్‌లోని 42 ఏళ్ల మహిళ ఊపిరితిత్తి మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. ఢిల్లీలో పదకొండేళ్ల బాలుడు పావురాల ఈకలను తట్టుకోలేక న్యుమోనిటిస్‌కు గురయ్యాడు. ముంబైలోనూ 2020లో ఇద్దరు మహిళలకు ఈ పావురాల కారణంగా ఊపిరితిత్తులు మార్చాల్సి వచ్చింది. అంత సమస్య ఉందన్నమాట ఈ పావురాలతో. ఏదో ముద్దుగా ఉంటాయి. కువకువలాడుతూంటే ముచ్చటేస్తుందని అనుకుంటాం కానీ... వాటితోపాటు వచ్చే ఆరోగ్య సమస్యలను మాత్రం విస్మరిస్తూంటాం. కావాల్సినంత తిండి ఫ్రీగా దొరుకుతూంటే అవి కూడా ఎప్పటికప్పుడు తమ సంతతిని పెంచుకుంటూ పోతున్నాయి. మరిన్ని చిక్కులు తెచ్చి పెడుతున్నాయి.
భవనాల పిట్టగోడలపై, చిన్న చిన్న కంతల్లోకి చేరే పావురాలు అక్కడ వ్యర్థాలను వదులుతూంటాయి. ఎండకు ఎండిన ఈ వ్యర్థాల్లోంచి పుట్టుకొచ్చే ఫంగస్ గాల్లోకి చేరుతుంది. ఆ గాలిని పీల్చిన వారికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం పెరుగుతుందన్నమాట. మీరు తరచూ జలుబులాంటి సమస్యలు ఎదుర్కొంటూంటే... లేదా ఊపిరితిత్తుల సమస్య ఉన్నా, తరచూ ఫుడ్‌పాయిజనింగ్‌కు, జీర్ణకోశ వ్యాధుల బారిన పడుతున్నా... మీ చుట్టుపక్కల పావురాలు ఎక్కువగా ఉన్నయేమో ఒక్కసారి చూసుకోండి మరి! ఇందుకే ముంబై హైకోర్టు పావురాలకు తిండిపెట్టే వారిపై క్రిమినల్ కేసులు పెట్టమని ఆదేశించింది. ఇక్కడ ఒక చిన్న ట్విస్ట్ ఉందండోయ్..
ముంబై హైకోర్టు ఆదేశాలకు అక్కడి జైన సమాజం తీవ్రంగా వ్యతిరేకించింది. నోరులేని మూగ జీవాలకు ఆహారం వేయడం తమ మత ధర్మం అంటూ వారు వీధుల్లోకి వచ్చారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. తాము పావురాలకు గింజలు వేసి తీరతామని ఎంత జరిమానా వేసిన భరిస్తామని కూడా తేల్చి చెప్పారు. ఈ విషయం అక్కడితో ఆగలేదు. ముంబై హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ దేశ అత్యున్నత న్యాయస్థానం ముందుకు చేరింది. ఈ కేసును సోమవారం విచారించిన జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయిల బెంచ్... హైకోర్టు ఆదేశాల్లో జోక్యం చేసుకునేందుకు నిరాకరిస్తూ పిటిషన్‌ను కొట్టి వేసింది. హైకోర్టు తీర్పులో ఏదైనా సవరణలు కావాలనుకంటే అక్కడికే వెళ్లాలని స్పష్టం చేసింది. చూడాలి ఏమవుతుందో.
::గిళియారు గోపాలకృష్ణ మయ్యా