
రోబోలు రోజు రోజుకూ తెలివిమీరి పోతున్నాయి. అలసట, శ్రమ, కోపతాపాలేవీ లేకుండా రోజంతా పనిచేయగలవు కాబట్టి మనిషి కూడా వాటికి మరిన్ని హంగులు చేరుస్తున్నాడు. ఈ క్రమంలో బ్యాటరీల్లో ఛార్జీలైపోతే తనంతట తానే వాటిని మార్చుకునే సరికొత్త రోబోను సిద్ధం చేసింది.. యూబీటెక్ కంపెనీ! వాకర్ ఎస్2 అని పిలుస్తున్న ఈ హ్యూమనాయిడ్ రోబోలో రెండు బ్యాటరీలుంటాయి. ఒకదాంట్లో ఛార్జ్ అయిపోతోందని తెలిస్తే చాలు.. ఈ రోబో దగ్గరలో ఏర్పాటు చేసిన బ్యాటరీ స్టేషన్‌కు వెళ్లి ఒకదాని తరువాత ఒకటి తీసేసి ఫుల్ ఛార్జ్ ఉన్నవాటిని అమర్చుకుంటుంది.
ఒక బ్యాటరీలో ఛార్జ్ అయిపోతోంది అనగా వాకర్ ఎస్2 బ్యాటరీ స్టేషన్‌కు వెళ్లి తన మొండెం భాగాన్ని సరైన పొజిషన్‌లో ఉంచి చేతుల చివరలో ఉన్న టూల్స్ సాయంతో బ్యాటరీని తొలగించుకుంటుంది. స్టేషన్‌లోని బ్యాటరీని బిగించుకుంటుంది. వాకర్ ఎస్2లోని కెమెరాలు బ్యాటరీపై ఉండే పచ్చటి లైట్ ఆధారంగా ఎంత ఛార్జ్ అయ్యిందో తెలుసుకుంటుందట. అచ్చం మనిషిలాగే రెండు కాళ్లపై నడిచే ఈ వాకర్ ఎస్2 సుమారు 5.6 అడుగుల ఎత్తు ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో దీన్ని ఆఫ్ చేసేందుకు కూడా ఒక బటన్ ఏర్పాటు చేశారు. మరిన్ని వివరాల కోసం ఇంకొంత కాలం వేచి ఉండాల్సిందే.
విద్యుత్తుతో నడిచే వాహనమైనా, ఇతరాలైనా పనిచేయాలంటే కరెంటు ప్లగ్‌కు కనెక్ట్ అయినా అయి ఉండాలి. లేదంటే బ్యాటరీలో ఎంతో కొంత ఛార్జ్ ఉండాలి. ఛార్జింగ్ చేసుకునేందుకు కొంత సమయం పడుతుందన్నది మనకు తెలిసిందే. ఇలా కాకుండా సెకన్లలో బ్యాటరీలను మార్చుకునే వాహనాలు కూడా ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి.
ఈ సౌకర్యాన్ని యూబీటెక్ ఇప్పుడు రోబోలకు అందించిందన్నమాట. ఇట్లాంటి రోబోలున్నాయి అనుకోండి.. ఫ్యాక్టరీల్లో కాఫీ, టీ, లంచ్ బ్రేకుల్లాంటివి అస్సలు ఉండవన్నమాట. అంతేకాదు...బ్యాటరీలు మార్చడానికి మనిషి అవసరమూ ఉండదు. ఫ్యాక్టరీల్లో అక్కడక్కడ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తే సరి. టెస్లా సంస్థకు చెందిన ఆప్టిమస్, టెస్లా బోట్, బోస్టన్ డైనమిక్స్ సిద్ధం చేస్తున్న అట్లాస్, ఫిగర్ ఏఐ రోబోలన్నింటిలో బ్యాటరీలు ఫిక్స్ అయిపోయి ఉంటాయి. ఛార్జ్ అయిపోతే దగ్గరలో ఉండే సాకెట్‌లోకి ప్లగ్ పెట్టి ఛార్జ్ చేసుకోవాలి. ఒక్క అజిలిటీ రోబోటిక్స్ మాత్రమే బ్యాటరీలను మార్చుకునేందుకు అవకాశం కల్పించింది
-గిళియారు గోపాలకృష్ణ మయ్యా
Photos and video credit to UBtech