
ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ తాజాగా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్స్ విభాగంలోకి ప్రవేశించింది. గృహావసరాల కోసం ఓలా శక్తి పేరుతో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టం (బీఈఎస్‌ఎస్) సొల్యూషన్‌ను ఆవిష్కరించింది.
దేశీయంగా విద్యుత్ కొరత లేదని, కాకపోతే నిల్వ చేసుకోవడానికి సంబంధించి సవాళ్లు ఉంటున్నాయని సంస్థ సీఎండీ భవీష్ అగర్వాల్ తెలిపారు. దీన్ని ఒక అవకాశంగా మల్చుకోవచ్చని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసం ప్రపంచ స్థాయి బ్యాటరీ, సెల్ టెక్నాలజీని రూపొందించామని, ఓలా శక్తి దానికి కొనసాగింపని అగర్వాల్ చెప్పారు.
అధునాతన 4680 భారత్ సెల్‌ని ఉపయోగించి దీన్ని పూర్తిగా దేశీయంగా తయారు చేసినట్లు వివరించారు. ప్రస్తుతం బీఈఎస్‌ఎస్ మార్కెట్ రూ. 1 లక్ష కోట్లుగా ఉండగా, 2030 నాటికి రూ. 3 లక్షల కోట్లకు చేరుతుందనే అంచనాలు ఉన్నాయి.
ఓలా శక్తి ముఖ్య ఫీచర్లు
తక్షణ పవర్ స్విచింగ్:సాంప్రదాయ ఇన్వర్టర్లు లేదా డీజిల్ జనరేటర్ల మాదిరిగా కాకుండా, ఉపకరణాలను సురక్షితంగా ఉంచుతూ, తక్షణమే (0 మిల్లీసెకన్లు) శక్తిని మారుస్తుంది.
స్మార్ట్ ఎనర్జీ మేనేజ్‌మెంట్:రియల్‌టైమ్‌లో శక్తి వినియోగాన్ని పర్యవేక్షిస్తుంది. నియంత్రిస్తుంది. వినియోగ విధానాలను తెలుసుకుని వినియోగాన్ని ఆప్టిమైజ్ చేస్తుంది. విద్యుత్, డబ్బు ఆదా చేయడంలో సహాయపడుతుంది.
వోల్టేజ్ రక్షణ: విస్తృత వోల్టేజ్ పరిధిలో (120V–290V) పనిచేస్తుంది. పరికరాలను హెచ్చుతగ్గుల నుండి రక్షిస్తుంది.
సురక్షితం, సమర్థవంతం: రన్నింగ్ లేదా నిర్వహణ ఖర్చులు లేకుండా ఆటోమోటివ్-గ్రేడ్ భద్రత, 98 శాతం వరకు సామర్థ్యం.
వాతావరణ నిరోధకత: IP67-రేటెడ్ బ్యాటరీలకు దుమ్ము, నీరు, భారీ వర్షాల నుండి పూర్తిగా రక్షణ
అధునాతన ఫీచర్లు:టైమ్-ఆఫ్-డే (ToD) ఛార్జింగ్, స్మార్ట్ బ్యాకప్ ప్రాధాన్యత, రిమోట్ డయాగ్నస్టిక్స్, OTA సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు, విస్తరణ ఎంపికలు, అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసం ఆన్‌లైన్ ఆపరేషన్.
ధర, లభ్యత
ఓలా శక్తి 1.5 kWh, 3 kWh, 5.2 kWh, 9.1 kWh కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. మొదటి 10,000 యూనిట్లకు ప్రారంభ ధరలు ఇలా ఉన్నాయి.. 1.5 కిలోవాట్లకు రూ.29,999, 3 కిలోవాట్లకు రూ. 55,999, 5.2 కిలోవాట్లకు రూ.1,19,999, 9.1 కిలోవాట్లకు రూ. 1,59,999 లుగా కంపెనీ నిర్ణయించింది. రూ.999 ధరతో రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. వచ్చే ఏడాది మకర సంక్రాంతి నుండి డెలివరీలు ఉంటాయని భావిస్తున్నారు.