
మహానగరాల్లో ట్రాఫిక్ సమస్యల గురించి నిత్యం వింటూనే ఉన్నాం.. చినుకుపడితే చాలు.. కిలోమీటర్ల జామ్‌లు.. గతుకుల రోడ్లు, కార్పొరేషన్ల తవ్వకాలు.. పూర్తికాని నిర్మాణాలు..ట్రాఫిక్ చిక్కులకు బోలెడు కారణాలు ఉండవచ్చు కానీ.. పరిష్కార మార్గాలు మాత్రం గగన కుసుమాలే! వీటన్నింటితో ప్రశాంత్ పిట్టి ఎంత విసిగిపోయాడో కానీ.. ఈ సమస్యకు ఫుల్‌స్టాప్ పెట్టాల్సిందేనని తీర్మానించాడు! కోటి రూపాయలు ఖర్చు పెడతా కలిసి రండని ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లకు పిలుపునిచ్చాడు!
కర్ణాటక రాజధాని బెంగళూరును ఒకప్పుడు ఉద్యాన నగరి అని పిలుచుకునేవారు కానీ ఇప్పుడది వాహనాల పద్మవ్యూహం! అభిమన్యుడు సైతం ఛేదించలేని దుర్భర నరకం! ‘ఈజ్ మై ట్రిప్’ కంపెనీ వ్యవస్థాపకుడిగా ఎందరి ప్రయాణాలనో సులభతరం చేసిన ప్రశాంత్ పిట్టికి కూడా బెంగళూరు ట్రాఫిక్ రోజూ సవాళ్లు విసురుతూనే ఉంది. మొన్నటికి మొన్న శనివారం అర్ధరాత్రి.. 11.5 కిలోమీటర్ల దూరం వెళ్లేందుకు 145 నిమిషాల టైమ్ పట్టిందట.
ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ఉద్దేశించిన ఔటర్ రింగ్ రోడ్డులోనే ఒక చోట సుమారు వంద నిమిషాలు ఇరుక్కుపోయానని, అక్కడ కనీసం ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ లేదా సిగ్నల్ కానీ లేకపోవడం వల్ల ఈ సమస్య వచ్చిందని వాపోయాడు ప్రశాంత్! ఈ జామ్‌లతో విసిగిపోయిన ప్రశాంత్... తన ఎక్స్ అకౌంట్‌లో ఒక ప్రకటన చేశాడు. ‘‘కోటి రూపాయలు ఖర్చు పెట్టేందుకు సిద్ధం. గూగుల్ మ్యాప్స్, కృత్రిమ మేధల సాయంతో బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సమస్యలు సృష్టిస్తున్న ప్రాంతాలను గుర్తిద్దాం’’ అని కోరాడు.
గూగుల్ మ్యాప్స్‌కు శాటిలైట్ ఇమేజరీ తోడు...
ఈ ఏడాది ఏప్రిల్‌లో గూగుల్ మ్యాప్స్ ‘‘రోడ్ మేనేజ్మెంట్ ఇన్‌సైట్’’ పేరుతో కొన్ని వివరాలు ఇవ్వడం మొదలుపెట్టిన విషయాన్ని ప్రస్తావించాడు ప్రశాంత్. ఏ రోడ్డులో ట్రాఫిక్ ఉన్నదో గుర్తించి ఇంకోమార్గంలో వెళ్లమని సూచిస్తుందన్నమాట ఈ రోడ్ మేనేజ్మెంట్ ఇన్‌సైట్. దీనికి ఉపగ్రహ ఛాయాచిత్రాల ద్వారా అందే సమాచారాన్ని జోడించి బెంగళూరు నగరం మొత్తమ్మీద ట్రాఫిక్‌ను అడ్డుకునే ఇరుకు ప్రాంతాలను గుర్తిద్దామని ప్రశాంత్ పిలుపునిచ్చాడు. ఒక నెలరోజులపాటు గమనిస్తే ఎప్పుడు ఎక్కడ ఎంత మేరకు ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందో తెలిసిపోతుందని, ఆ తరువాత ఈ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టడం ద్వారా ట్రాఫిక్ పోలీసులు క్రమబద్ధీకరించగలరని వివరించాడు.
I am committing INR 1 Cr to find Bangalore Choke-Points via Google Maps & AL.
11 km → 2.15 hours in Bangalore Traffic on Saturday late night!
I was stuck at one choke-point at ORR, where I spent 100 mins struggling to understand why there is no traffic-light or cop here!
But… pic.twitter.com/b8Nf5vnUKf— Prashant Pitti (@ppitti) July 14, 2025
ఈ పని తన ఒక్కడి వల్లే కాదన్న ఆయన ఒకరిద్దరు ఏఐ/ఎంఎల్ ఇంజినీర్లు కలిసిరావాలని కోరాడు. గూగుల్ మ్యాప్స్, జీపీయూ, ఏపీఐ కాల్స్, ఉపగ్రహ ఛాయాచిత్రాల కోసం కావాల్సిన మొత్తాలతో కలిపి ఈ ప్రాజెక్టు కోసం కోటి రూపాయల వరకూ తాను ఖర్చు పెడతానని కూడా ప్రకటించాడు. బెంగళూరు ట్రాఫిక్ పోలీసులు, కార్పొరేషన్‌లు ఇప్పటికే సేకరిస్తున్న సమాచారాన్ని అందించడంతోపాటు... తామిచ్చే సలహా, సూచనలను పాటించేందుకు ఒక టీమ్‌ను ఏర్పాటు చేస్తే చాలు పని మొదలుపెడతానని చెప్పారు.
బెంగళూరు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి చేపట్టిన ఈ ప్రాజెక్టు గురించి కార్పొరేషన్, ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులకు తెలిసేంతవకూ తన ట్వీట్‌ను ట్యాగ్ చేయాలని పిలుపునిచ్చాడు. అలాగే ఈ పనిలో సాయం చేసేందుకు సిద్ధంగా ఉన్న ఇంజినీర్లు తన ట్వీట్‌కు ‘ఇన్’ అని కామెంట్ చేయాలని, ట్రాఫిక్ కారణంగా సమయం వృథా అవుతోందని భావిస్తున్న వాహనదారులందరూ ట్వీట్‌పై కామెంట్ చేయడంతోపాటు నలుగురికి షేర్ చేయాలని కోరారు. ఆల్ ద బెస్ట్ ప్రశాంత్ పిట్టి!