సీజేఐపై దాడి ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌ | Lawyer Who Threw Shoe At CJI Gavai Expelled From Bar, Read Full Story For Details | Sakshi
Sakshi News home page

సీజేఐపై దాడి ఎపిసోడ్‌లో బిగ్‌ ట్విస్ట్‌

Oct 9 2025 11:20 AM | Updated on Oct 9 2025 1:42 PM

Lawyer who threw shoe at CJI Gavai expelled from Bar

భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌పై దాడి కేసులో ట్విస్ట్‌ చోటు చేసుకుంది. సీజేఐపైకి షూ విసిరిన లాయర్‌ రాకేష్‌ కిషోర్‌(71)ను బహిష్కరిస్తూ సుప్రీం కోర్టు బార్‌ అసోషియేషన్‌ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు.. ఆయన భవిష్యత్తులో కోర్టు ప్రాంగణంలోకి అడుగుపెట్టకుండా ఎంట్రీ కార్డును రద్దు చేసినట్లు గురువారం ప్రకటించింది.

అక్టోబర్ 6వ తేదీన సుప్రీం కోర్టులో జరిగిన షాకింగ్‌ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారి తీసింది. కోర్టు నెంబర్‌ 1 హాల్‌లో.. కేసుల మెన్షనింగ్‌ జరుగుతున్న సమయంలో ఓ వ్యక్తి తన కాలి బూటు తీసి సీజేఐ వైపు విసిరాడు(Attack on BR Gavai). అయితే అది బెంచ్‌ దాకా వెళ్లకుండా కింద పడిపోయింది. తోటి లాయర్లు ఆ వ్యక్తిని నిలువరించి.. కోర్టు సిబ్బందికి అప్పగించారు. అయితే.. ఇలాంటి చర్యలు తనని ప్రభావితం చేయలేవన్న జస్టిస్‌ గవాయ్‌.. కోర్టు కలాపాలు కొనసాగించాలని ఆదేశించారు.

దాడి సమయంలో సదరు లాయర్‌ ‘‘సనాతన ధర్మాన్ని అవమానించడాన్ని సహించం’’ అంటూ నినాదాలు చేశాడు. సీజేఐ సూచనతో అతనిపై పోలీసులకు సుప్రీం కోరటు రిజిస్ట్రార్‌ ఫిర్యాదు చేయలేదు. దీంతో ఢిల్లీ పోలీసులు అతన్ని మూడు గంటలపాటు విచారించి షూతో పాటు అతని పేపర్లు ఇచ్చి వదిలేశారు. దాడికి పాల్పడిన వ్యక్తిని రాకేష్‌ కిషోర్‌గా నిర్ధారించారు. అయితే.. 

దాడికి ప్రయత్నించినందుకుగానూ బార్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా రాకేష్‌ కిషోర్‌(Rakesh kishore)పై చర్యలకు ఉపక్రమించింది. దేశవ్యాప్తంగా ఎలాంటి కోర్టు, ట్రిబ్యునల్, అధికార సంస్థల్లో ప్రాక్టీస్ చేయకుండా  తాత్కాలికంగా సస్పెండ్‌ చేసింది. జరిగిన ఘటనపై 15 రోజుల్లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈలోపే.. సుప్రీం కోర్టు బార్‌ అసోషియేషన్‌ బహిష్కరణ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఇదిలా ఉండగా..

దాడిని సమర్థించుకున్న రాకేష్‌ కిషోర్‌.. అదంతా దైవ నిర్ణయమని అంటున్నారు. అంతేకాదు.. తన నుంచి కనీస వివరణ తీసుకోకుండానే సస్పెండ్‌ చేయడాన్ని కూడా తీవ్రంగా తప్పు బడుతూ పలు ఇంటర్వ్యూలు ఇవ్వసాగారు. మరోవైపు..

సస్పెండెడ్‌ లాయర్‌ రాకేష్‌ కిషోర్‌పై బెంగళూరులో కేసు నమోదు అయ్యింది. సీజేఐపై ఉద్దేశపూర్వకంగానే దాడి చేశారంటూ.. ఆల్‌ ఇండియా అడ్వొకేట్స్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు భక్తవత్సల ఫిర్యాదు చేశారు. దీంతో విధానసౌధ పీఎస్‌లో బుధవారం కేసు నమోదు చేశారు. జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు కావడంతో.. ఢిల్లీకి కేసు బదిలీ కానుంది. 

నోట్‌: ఆ బూటు విసిరింది నేను కాదు కథనంలో లాయర్‌ పేరును రాజేష్‌ కిషోర్‌గా పేర్కొన్నాం. ఎన్డీటీవీ కథనం తప్పుగా పేర్కొనడంతో అలా ఇవ్వాల్సి వచ్చింది. ఆ లాయర్‌ అసలు పేరు రాకేష్‌ కిషోర్‌ అని గమనించగలరు.

ఇదీ చదవండి: షూ దాడి: ఇంతకీ చీఫ్‌ జస్టిస్‌ గవాయ్‌ ఏం వ్యాఖ్యలు చేశారంటే..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement