
న్యూఢిల్లీ: ధ్వంసమైన ఏడడుగుల విష్ణుమూర్తి విగ్రహాన్ని పునరుద్ధరించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని సుప్రీంకోర్టు కొట్టేసింది. ఈ క్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఆ వ్యాఖ్యలను ఆయన ఉపసంహరించుకోవాలంటూ పలువురు డిమాండ్ చేస్తున్నారు.
మధ్యప్రదేశ్‌లోని ఛాతర్‌పూర్‌జిల్లాలోని యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించిన ప్రఖ్యాత ఖజురహో ఆలయ సముదాయంలోని జవారీ ఆలయంలో విష్ణుమూర్తి విగ్రహం ధ్వంసమైంది. ఈ విగ్రహాన్ని పక్కనబెట్టి కొత్త విగ్రహాన్ని ప్రతిష్టించేలా ఆదేశాలు ఇవ్వాలని(Khajuraho Vishnu idol case) రాకేశ్ దలాల్ అనే వ్యక్తి ఈ పిల్ వేశారు. ఈ పిల్ స్వీకరణ అంశాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ కె.వినోద్ చంద్రనల్ ధర్మాసనం పరిశీలించింది.
‘‘ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదు. పబ్లిసిటీ ప్రయోజన వ్యాజ్యం. ఇందులో మేం చేసేది ఏం లేదు. భారత పురతత్వ విభాగం(ఏఎస్‌ఐ) పరిధిలో ఆలయం ఉంది. వాళ్లనే అభ్యర్థించండి. లేదంటే మీరెలాగూ విష్ణుమూర్తికి పరమభక్తుడిని అని చెబుతున్నారుగా. ఆయననే వేడుకోండి. శైవత్వానికి మీరు వ్యతిరేకులు కాకపోతే అదే ఖజురహోలో అతిపెద్ద శివలింగం ఉంది. అక్కడ కూడా మీరు విన్నవించుకోవచ్చు. విగ్రహ పునరుద్ధరణ, పునర్‌నిర్మాణంపై ఏఎస్‌ఐ తుది నిర్ణయం తీసుకుంటుంది’’ అని వ్యాఖ్యానించారు.
అయితే తీర్పు సందర్భంగా సీజేఐ జస్టిస్ గవాయ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఒక వర్గం మనోభావాలు దెబ్బ తీసేలా ఆయన మాట్లాడారంటూ సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. అంతేకాదు.. ఆయన్ని అభిశంసించాలంటూ కొందరు నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
వినీత్ జిందాల్ అనే న్యాయవాది సీజేఐ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలో భారత రాష్ట్రపతికి, సుప్రీం కోర్ట్‌కు ఆయన ఓ లేఖ రాశారు. ప్రతి మత విశ్వాసానికి గౌరవం ఇవ్వాలి అని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. సత్యం సింగ్ రాజ్‌పుత్ అనే మరో న్యాయవాది జస్టిస్ బీఆర్ గవాయ్‌కు బహిరంగ లేఖ రాశారు. విష్ణుమూర్తి భక్తుడిగా ఆయన వ్యాఖ్యలు నన్ను వ్యక్తిగతంగా బాధించాయి. కాబట్టి వెంటనే ఆయన వాటిని ఉపసంహరించుకోవాలి అని లేఖలో డిమాండ్ చేశారు. ప్రస్తుతం సీజేఐ వ్యాఖ్యలపై న్యాయ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది.