
కర్ణాటక: కట్నం తీసుకోవడం, ఇవ్వడం చట్టరీత్యా నేరం అనేది అందరికీ తెలిసిందే. కానీ సమాజంలో కట్నవ్యవస్థ పాతుకుపోయింది. కూలీల నుంచి కుబేరుల వరకు వధువుల తల్లిదండ్రులు కట్నకానుకలను ఇచ్చుకోవాల్సి వస్తోంది. లేదంటే పెళ్లి క్యాన్సిల్ అనే మాట వినిపిస్తుంది. అలాంటి సంఘటనే కళా సాంస్కృతిక నగరం మైసూరులో చోటుచేసుకుంది.
మరో రూ.25 లక్షలు, కారు కోసం పట్టు..
అడిగినంత కట్నం ఇవ్వలేదని కాబోయే వరుడు, అతని కుటుంబసభ్యులు పెళ్లిని రద్దు చేసుకున్నారు. దీంతో వ్యవహారం పోలీసు స్టేషన్‌కు చేరింది. వివరాలు... నగరంలోని గంగోత్రి లేఔట్‌లో మమతాదేవి కుమార్తె డాక్టర్.నీతు కు కుర్గళ్ళికి చెందిన తేజస్‌తో ఆగస్టు ఆఖరిలో ఘనంగా నిశ్చితార్థం చేసింది. వరునికి 150 గ్రాముల బంగారం, ఒక వజ్రాల ఉంగరం, రూ. 10 లక్షల నగదును అందజేశారు. వారు కోరినట్లుగానే కోటె హుండి గ్రామంలోని ఓ విలాసవంత హోం స్టేలో నిశి్చతార్థాన్ని జరిపించారు. అలాగే సా.రా కన్వెన్షన్ హాల్ళో పెళ్ళి జరిపించాలని షరతు పెట్టగా వధువు కుటుంబీకుల అంగీకరించారు. రూ. 1.50 లక్షల అడ్వాన్స్ కట్టి హాల్‌ని బుక్ చేసుకుని, పెళ్లి పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంతలో తేజస్, తల్లిదండ్రులకు మరింత దురాశ పుట్టింది.
మరో రూ.25 లక్షల నగదు ఇవ్వాలని, రూ. 20 లక్షల కారును కొనివ్వాలని గొంతెమ్మ కోర్కెలు కోరారు. దీంతో వధువు తల్లి, కుటుంబీకులు విసిగిపోయారు. ఇప్పటికే చాలా ఇచ్చామని, ఇంక ఇవ్వలేదని తెలిపారు. వరుడు, తల్లిదండ్రులు భగ్గుమన్నారు, కారు కొనివ్వలేనివారు ఎందుకు పెళ్లికి ఒప్పుకున్నారు, ఈ పెళ్లి మాకు వద్దని చెప్పేశారు. వధువు కుటుంబసభ్యులు ఎంత బతిమిలాడినా వారు అంగీకరించలేదు. దీంతో న్యాయం చేయాలని సరస్వతీపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరుడు తేజస్, అతని తల్లిదండ్రులు నాగరత్న, మహాదేవ, కుటుంబీకులు శశికుమార్, సుమపై కేసు పెట్టారు.