
ఆరోగ్యం.. కడుపులోని చల్ల కదలకుండా!
ఊబకాయం తగ్గించుకునేందుకు..
ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకూ..
రకరకాల వ్యాయామాలు చేస్తున్న వారందరికీ ఓ గుడ్‌న్యూస్!
ఈ తంటాలేవీ పడక్కరలేదు అంటున్నారు శాస్త్రవేత్తలు!
ఎంచక్కా అప్పుడప్పుడూ ఓ మాత్ర వేసేసుకుంటే చాలని..
వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వచ్చేస్తాయని చెబుతున్నారు!
ఆ వివరాలేమిటో చూద్దామా?
ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం.. అందుకు తగ్గట్టుగా తగిన వ్యాయామంతో శరీరాన్ని ఫిట్‌గా ఉంచుకోవడం.. ఈ ఆధునిక కాలంలో చాలామంది పాటించే సూత్రం. అయితే, కొంత మందికి వ్యాయామం ఎంత చేసినా.. ఎంతలా కడుపు కట్టుకున్నా ఒళ్లు తగ్గదు. ఆరోగ్య సమస్యలూ వీరిని పీడిస్తూంటాయి. ఇలాంటి వారికీ ఉపయోగపడే ఓ ప్రయోగాన్ని చేశారు చైనీస్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ శాస్త్రవేత్తలు. బీట్‌రూట్, పాలకూర, గింజ ధాన్యాల్లో సహజంగా లభించే ఓ పదార్థం.. వ్యాయామం చేస్తే వచ్చే ఫలితాలను ఇస్తున్నట్లు గుర్తించారు. అంతేకాదు.. ఈ పదార్థం ద్వారా వయసుతోపాటు వచ్చే చాలా ఆరోగ్య సమస్యలను దూరంగా ఉంచవచ్చు అని తేలింది.
శారీరక వ్యాయామం చేయకున్నా ఆ ఫలితాలన్నీ ఇచ్చే అద్భుతం కోసం శాస్త్రవేత్తలు ఒకవైపు పరిశోధనలు చేస్తూనే ఉండగా.. చైనా శాస్త్రవేత్తలు ఈ దిశగా ఒక అడుగు ముందుకు వేయగలిగారు. క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తున్న వారిని పరిశీలించగా.. మిగిలిన వారితో పోలిస్తే వీరిలో బెటనైన్ అనే పదార్థం ఎక్కువ మోతాదులో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది మూత్రపిండాల ద్వారా శరీరానికి అందుతుంటుంది. బెటనైన్ ఎలా ఉత్పత్తి అవుతుంది? ఎలా ఉపయోగపడుతుంది అని వివరంగా తెలుసుకునేందుకు శాస్త్రవేత్తలు పరిశోధనలు ప్రారంభించారు.
ఇందు కోసం కొంతమంది యువకులను ఎంచుకుని ఆరేళ్లపాటు పరిశీలించారు. వీరు రెండు రకాల వ్యాయామాలు చేసేవారు. కొందరు శారీరక దారుఢ్యానికి పరీక్ష పెట్టే ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేస్తుండగా.. మిగిలిన వారు ఎక్కువ శ్రమ ఉన్నవి చేస్తున్నారు. రెండింటివల్ల శరీరంలో ఎలాంటి మార్పులు వస్తున్నాయో గుర్తించాలన్నది దీని ఉద్దేశం. ఆశ్చర్యకరంగా శరీర కణాల వయసు పెరగకుండా చేయడంలో మూత్రపిండాలు కీలకపాత్ర పోషిస్తున్నట్లు తెలిసింది!. ఎండ్యూరెన్స్ వ్యాయామాలు చేసే వారిలో కణాల వార్ధక్యం, మంట/వాపు మిగిలిన వారికంటే తక్కువగా ఉన్నట్లు తెలిసింది. శారీరక శ్రమ ఎక్కువగా ఉన్న వ్యాయామాలు చేస్తున్న వారిలో కణాలు ఒత్తిడికి గురవుతున్నట్లు స్పష్టమైంది.
ఎండ్యూరెన్స్ వ్యాయామం చేస్తున్న వారిపై మరిన్ని పరిశోధనలు చేయడం ద్వారా రోగ నిరోధక శక్తిని ప్రభావితం చేసే ఒక ప్రొటీన్ (ఈటీఎస్1) ఉత్పత్తి తగ్గినట్లు స్పష్టమైంది. అదే సమయంలో కిడ్నీల్లో బెటనైన్ తయారవడం ఎక్కువైంది. వయసు ఎక్కువగా ఉన్న వారు వ్యాయామం చేసిన తరువాత రక్తంలో బెటనైన్ ఎక్కువగా ఉన్నట్లు, ఈ పదార్థం కండరాల శక్తి, జీవక్రియలు, కణంలో చక్కెరలను శక్తిగా మార్చే మైటోకాండ్రియాల ఆరోగ్యం మెరుగైనట్లు తెలిసింది. దీంతో వ్యాయామంతో వచ్చే ప్రయోజనాల వెనుక బెటనైన్ ఉందని స్పష్టమైంది.
ఎలుకలకు ఇచ్చి చూశారు..
తమ అంచనాలను నిర్ధారించుకునేందుకు శాస్త్రవేత్తలు వయసు మళ్లిన ఎలుకలకు నిర్దిష్ట మోతాదుల్లో బెటనైన్ అందించారు. ఆ తరువాత పరిశీలించినప్పుడు వ్యాయామం చేస్తే వచ్చే లాభాలన్నీ వాటిల్లోనూ కనిపించాయి. అంటే కండరాలు గట్టిపడ్డాయి, ఎక్కువ కాలం శ్రమను ఓర్చుకోగలిగాయి. మంట/వాపు వంటివి తగ్గాయి అన్నమాట!. కణజాలం పునరుత్పత్తి కూడా వేగంగా జరుగుతున్నట్లు తెలిసింది. ‘వ్యాయామం చేయడం వల్ల ముందుగా శరీరంలో మంట/వాపు వస్తాయి. ఒత్తిడి కూడా పెరుగుతుంది. అలాగే కొనసాగిస్తే.. ఇవి తగ్గిపోతాయి. కిడ్నీ ద్వారా ఉత్పత్తి అయ్యే బెటనైన్ తగ్గిస్తుంది’ అని ఈ ప్రయోగాల్లో పాలుపంచుకున్న శాస్త్రవేత్త లియు గువాంగ్‌హూయి తెలిపారు.
మొత్తమ్మీద విషయం ఏమిటంటే.. వ్యాయామం అప్పుడప్పుడు చేయడం కాకుండా.. క్రమం తప్పకుండా చేయాలి అని!!. అలాగే బెటనైన్ సమృద్ధిగా లభించే ఆహార పదార్థాలు తినడమూ శరీరానికి మేలు చేస్తుందన్నమాట!. లేదా.. మరిన్ని పరిశోధనల తరువాత బెటనైన్ సప్లిమెంట్లు మార్కెట్‌లోకి వచ్చినప్పుడు వాటిని రోజూ తీసుకోవచ్చు!!.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.