
ఒక లక్ష తొంభై వేల కోట్ల రూపాయలు! మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, ఎల్‌ఐసీ, ఈపీఎఫ్, బ్యాంకు డిపాజిట్లలో మూలుగుతున్న మొత్తమిది. ఈ సొమ్ము మాది అని ఎవరూ అడక్కపోవడంతో అవి అలాగే పడి ఉన్నాయి. పైగా ఈ లెక్క మార్చి 2024 నాటిది. అప్పటికి బ్యాంకుల్లో రూ.62 వేల కోట్ల డిపాజిట్లు అన్‌క్లెయిమ్డ్‌గా ఉంటే ఏడాది తరువాత ఈ మొత్తం రూ.78 వేల కోట్లకు చేరుకుంది. ఎప్పటికైనా అవసరం పడుతుందని పెట్టిన ఈ పెట్టుబడులను ఎందుకిలా అనాథల్ని చేస్తున్నారు? అనూహ్యంగా మరణించారా? అలాంటప్పుడు వారసులైన ఎందుకు క్లెయిమ్ చేయలేదు? ఆసక్తికరమైన ఈ ప్రశ్నలకు సమాధానాలు చూద్దామా?.
మన ఇళ్లల్లో పెద్దవారు కొడుకులు, మనవళ్లు, మనవరాళ్లపై ప్రేమతో ఫిక్స్‌డ్ డిపాజిట్లు చేస్తూంటారన్నది అందరికీ తెలిసిన విషయమే. భవిష్యత్తు అవసరాల కోసం తమ పేర్లపై డిపాజిట్లు చేసుకునేవారూ ఉంటారు. అయితే.. చాలా సందర్భాల్లో తాము ఫలానా వారి పేరుపై డిపాజిట్లు చేశామని చెప్పేవాళ్లు తక్కువ. తమ తదనంతరం మాత్రమే వారికి తెలియాలని ఆశిస్తూంటారు. అయితే.. ఏదైనా ఒక డిపాజిట్ పదేళ్లపాటు ఆక్టివ్‌గా లేదనుకోండి.. బ్యాంకు దాన్ని డిపాజిటర్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్‌నెస్ ఫండ్‌కు బదిలీ చేసేస్తుంది. ఆర్‌బీఐ నిర్వహిస్తున్న ఈ ఫండ్ డిపాజిట్‌దారుల హక్కులపై అవగాహన కల్పించేందుకు పనిచేస్తోంది. ఆర్‌బీఐ వేర్వేరు బ్యాంకుల ద్వారా వచ్చి చేరే అన్‌క్లెయిమ్డ్ డిపాజిట్ మొత్తాలపై కొంత వడ్డీ కూడా చెల్లిస్తూంటుంది. భవిష్యత్తులో ఎవరైనా క్లెయిమ్ చేస్తే వారికి వడ్డీతోసహా చెల్లిస్తారు.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. చాలా డిపాజిట్లకు సంబంధించి నామినీలు ఉంటారు కానీ.. మరణానంతరం వీరికి ఆ మొత్తం దక్కుతుందన్న గ్యారెంటీ ఉండదు. మరణించిన వారు విల్లు రాయకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. అంటే.. డిపాజిట్లపై నామినీగా మీ పేరు ఉన్నంత మాత్రాన ఆ వ్యక్తి మరణించిన తరువాత ఆ మొత్తం మీకు దక్కదన్నమాట. డిపాజిట్ చేసిన వ్యక్తికి చట్టపరంగా ఎంతమంది వారసులు ఉంటే అంత మందికి సమానంగా పంచాలని చట్టం చెబుతోంది. కాబట్టి... ఎవరైనా మరణానంతరం తమకిష్టమైన వారికి ఆస్తులు ఇవ్వాలని అనుకుంటే అందుకు మేలైన మార్గం విల్లు రాయడమే అంటున్నారు ఆర్థిక నిపుణులు.
..మీ పెద్దవారు ఎవరైనా మీ పేరుతో డిపాజిట్ చేసి మరణించారని అనుకుంటున్నారా? ఆ మొత్తం అన్‌క్లెయిమ్డ్‌గా ఉందని భావిస్తున్నారా?. అయితే ఆర్‌బీఐ నిర్వహిస్తున్న https://udgam.rbi.org.in/unclaimed-deposits/#/login ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు. ఫోన్ నెంబరు, కొన్ని ప్రాథమిక వివరాలు నమోదు చేసుకుని పాన్, ఓటర్ ఐడీ వంటి వివరాల ద్వారా ఎవరైనా మీ పేరుతో డబ్బు డిపాజిట్ చేశారా? అన్నది తెలుసుకోవచ్చు. ఒకవేళ మీ పేరుతో ఏదైనా డిపాజిట్ ఉండి అది అన్‌క్లెయిమ్డ్‌గా ఉంటే అకౌంట్ ఉన్న బ్యాంకు ద్వారా ఆ మొత్తాన్ని పొందవచ్చు.
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా.