
ప్రభుత్వ అధికారుల అవినీతి కథలు కొత్తేమీ కాదు కానీ.. మధ్యప్రదేశ్‌లోని ఈ తాజా ఘటన మాత్రం కొంచెం విచిత్రమైందే. గంట సమయంలో కొందరు అధికారులు ఎకాఎకిన 14 కిలోల డ్రైఫ్రూట్స్ లాగించేశారట. దీనికి సంబంధించి రూ.85 వేల బిల్లు పెడితే.. పై అధికారులకు డౌటొచ్చింది. విచారణ జరగడంతో పాపం చిక్కిపోయారు! వివరాలు...
మధ్యప్రదేశ్‌లోని శాధోల్ జిల్లాలో ఉండే చిన్న గ్రామం భడ్‌వాహీ. వాన నీటి సంరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం ‘జల్ గంగ సంవర్ధన్’ పేరుతో ఒక కార్యక్రమం చేపట్టింది. ఈ సమావేశానికి జిల్లా కలెక్టర్, ఎస్‌డీఎం, పంచాయతీ కార్యదర్శి తదితరులు హాజరయ్యారు. అంతా కలిపి 24 మంది మాత్రమే. కానీ బిల్లు మాత్రం రూ..85 వేలు అయినట్లు పెట్టారు.
వీళ్లంతా కలిసి ప్రజాధనం దోచేస్తున్నారు అనుకున్నారో ఏమో.. గుర్తు తెలియని వ్యక్తులు ఈ బిల్లును కాస్తా సోషల్ మీడియాలో పడేశారు. ఇంకేముంది.. ఒక్కపట్టున వైరల్ అయిపోయింది అది. గంట టైమ్‌లో ఈ 24 మంది అధికారులు కూర్చుని 14 కిలోల బాదాం, జీడిపప్పు, ఎండు ద్రాక్ష తిన్నారట. ఇది చాలదన్నట్టు 30 కిలోల స్నాక్స్, కాఫీ/టీల కోసం ఆరు లీటర్ల పాలు.. ఐదు కిలోల చక్కెర వాడామని బిల్లులో పెట్టారు.
వీటికి రకరకాల పండ్లు అదనం! విచిత్రమైన విషయం ఇంకోటి ఉంది. సమావేశానికి హాజరైన గ్రామస్తులకు కిచిడీ మాత్రమే వడ్డించి వీరు మాత్రం పంచభక్ష్య పరమాన్నాల టైపులో డ్రైఫ్రూట్స్‌తో ‘బ్రేవ్’ మని తేన్చడం!
గంట సమావేశంలో రూ.85 వేల బిల్లు ఏమిటా? అన్న అనుమానం పై అధికారులకు రావడంతో విషయం బయటకొచ్చింది. విచారణ మొదలైంది. ‘‘అబ్బే.. మేం అసలు డ్రైఫ్రూట్స్ ముట్టుకోలేదు’’ అని కొందరు అధికారులు సన్నాయి నొక్కులు నొక్కడం కొసమెరుపు!
-గిళియారు గోపాలకృష్ణ మయ్యా