కాలం కలిసొచ్చింది... కారు నడిచొచ్చింది! | Musk Tesla first driverless Model Y Car delivery To Customer Home Details | Sakshi
Sakshi News home page

కాలం కలిసొచ్చింది... కారు ఇంటికే నడిచొచ్చింది!

Jun 28 2025 1:54 PM | Updated on Jul 4 2025 4:53 PM

Musk Tesla first driverless Model Y Car delivery To Customer Home Details

‘‘కలిసొచ్చే కాలానికి... నడిచొచ్చే కొడుకు పుడతాడంట!’’ పాతకాలపు సామెత. ఈ టెక్నాలజీ యుగంలో ఈ పప్పులేమీ ఉడకవు. కానీ.. డబ్బులు ఉంటే షోరూమ్‌కు వెళ్లి బోలెడన్ని పత్రాలపై సంతకాలు పెట్టి డ్రైవింగ్‌ వస్తే సొంతంగా.. లేదంటే అద్దెడ్రైవర్‌ను పెట్టుకుని మరీ తెచ్చుకోవాల్సిన కారు మాత్రం ఇప్పుడు దానంతట అదే నడిచొస్తుంది!. విషయం ఏమిటో మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది!.. 

ఎలాన్‌ మస్క్‌ సృష్టించిన అద్భుతం డ్రైవర్‌లెస్‌ కారు మొట్టమొదటిసారి కొనుగోలుదారు ఇంటి వద్దకు వచ్చేసింది. ఈ విషయాన్నే టెస్లా కార్ల కంపెనీ యజమాని ఈలాన్‌ మస్క్‌ గర్వంగా తన ‘ఎక్స్’ ప్లాట్‌ఫామ్‌పై పంచుకున్నారు కూడా. ఎలాంటి మానవ సాయం, జోక్యం లేకుండా.. టెక్సస్‌లోని టెస్లా గిగా ఫ్యాక్టరీలో తయారైన ‘మోడల్‌ వై’ కారు స్థానికంగా కొనుగోలుదారు వద్దకు గంటకు 72 మైళ్ల వేగంతో ప్రయాణిస్తూ వచ్చిందన్నమాట. 

పైగా... అనుకున్నదాని కంటే ఒక రోజు ముందుగా ఎలాన్‌ మస్క్‌ పుట్టినరోజు నాడే ఈ కారు డెలివరీ కావడం ఒక విశేషం. ఆటోమొబైల్‌ రంగ చరిత్రలో ఇదో చిరస్మరణీయ ఘట్టం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహమూ లేదు. డ్రైవర్ల అవసరం లేని వాహనాలతో క్యాబ్‌లు నడపాలన్న మస్క్‌ ఆలోచనలు వాస్తవమయ్యే దిశగా ఇంకో ముందడుగూ పడిందన్నమాట!. 

మోడల్‌ వై గురించి క్లుప్తంగా..
2020లో లాంచ్‌ అయిన కాంపాక్ట్‌ ఎలక్ట్రిక్‌ ఎస్‌యూవీ ఇది. టెస్లా మోడల్‌ త్రీ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఐదుగురు కూర్చోగలరు. కొన్ని ప్రాంతాల్లో ఏడు సీట్లు ఉన్న వేరియంట్‌ కూడా అందుబాటులో ఉంది. టెక్సస్‌లోని ఆస్టిన్‌ ప్రాంతం ఫ్రీమాంట్‌లోని టెస్లా గిగాఫ్యాక్టరీతోపాటు షాంఘై, బెర్లిన్‌లలో ఈ మోడల్‌ వై కార్లు తయారవుతున్నాయి. వేరియంట్‌ను బట్టి 60 - 81 కిలోవాట్‌ హవర్ల బ్యాటరీతో నడుస్తుంది. లిథియం అయాన్‌ ఫాస్పే్‌ట్‌ (ఎల్‌ఎఫ్‌పీ), నికెల్‌ మాంగనీస్‌ కోబాల్ట్‌ (ఎన్‌ఎంసీ) బ్యాటరీలతో లభిస్తుంది. ఒకసారి ఛార్జ్‌ చేస్తే వేరియంట్‌ను బట్టి 320 నుంచి 330 మైళ్ల దూరం ప్రయాణించగలదు. పావుగంటలోనే 180 ​మైళ్ల దూరం ప్రయాణించగలిగేంత విద్యుత్తును ఛార్జ్‌ చేసుకోవచ్చు. కేవలం 5.4 సెకన్లలోనే 60 మైళ్ల వేగాన్ని అందుకోగల శక్తి దీని సొంతం. 

గరిష్ట వేగం గంటకు 155 మైళ్లు! 
వాహనం లోపలి విశేషాల గురించి చూస్తే.. 15.4 అంగుళాల విశాలమైన టచ్‌స్ట్రీన్‌, పనోరమిక్‌ గ్లాస్‌ రూఫ్‌లు ఉంటాయి. కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టగలిగితే ఫుల్‌ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ వేరియంట్‌ను కొనుక్కోవచ్చు. లేదంటే కొన్ని పరిమితమైన ఫీచర్లతో డ్రైవింగ్‌ అవసరాన్ని తగ్గించేవి లభిస్తాయి. తెల్లగీతల మధ్య మాత్రమే ప్రయాణించడం, అడాప్టివ్‌ క్రూయిజ్‌, ఎమర్జెన్సీ బ్రేకింగ్‌ వంటివి అన్నమాట. అత్యాధునిక ఆడియో సిస్టమ్‌ ఉండనే ఉంది. భద్రత విషయానికి వస్తే ఫైవ్‌ స్టార్‌ రేటింగ్‌ లభించింది. చివరిగా ధరల గురించి... రకాన్ని బట్టి 39.3 లక్షల రూపాయలు (46000 డాలర్లు) నుంచి 41.01 లక్షల రూపాయలు (48,000 డాలర్లు) వరకూ ఉంటుంది.

::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

Advertisement
 
Advertisement
Advertisement