
ఆండ్రాయిడ్ ఫోన్లలో ‘ప్రకంపనల’ హెచ్చరిక
5 ఏళ్ల కిందటే అందుబాటులోకి తెచ్చిన గూగుల్
98 దేశాల్లో 79 కోట్ల మందికి అలర్ట్స్ జారీ
ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల ఫోన్లలో ఏఈఏ
ఫోన్ అంటే కాల్స్, మెసేజెస్, వినోదమేనా? అంతకు మించి.. చూడ్డానికి చిన్న పరికరమే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని కూడా. అవును మీరు చదువుతున్నది నిజమే. భూకంప కేంద్రం నుంచి తీవ్రత చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించేలోపే.. విపత్తు రాబోతోందని యూజర్లను హెచ్చరించే వ్యవస్థ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంది. మొబైల్‌లోని యాక్సిలరేషన్ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచంలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు సందేశాల రూపంలో హెచ్చరిస్తోంది.
– సాక్షి, స్పెషల్ డెస్క్
ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్ (ఏఈఏ) వ్యవస్థను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2020 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో పరిచయం చేసింది. ప్రాథమిక (ప్రైమరీ వేవ్స్), ద్వితీయ (సెకండరీ వేవ్స్) భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఏఈఏ సిస్టమ్ ఇప్పటి వరకు 98 దేశాలలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపింది. ఇప్పటి వరకు 18,000 పైచిలుకు భూకంప సంఘటనలకు సంబంధించి 79 కోట్లకుపైగా అలర్ట్స్ జారీ చేసింది.
ఈ వ్యవస్థ ఇప్పుడు నెలకు సగటున 60 హెచ్చరికలను పంపుతోంది. దాదాపు 1.8 కోట్ల మంది కనీసం ఒక హెచ్చరికనైనా అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ సీస్మాలజీ ల్యాబొరేటరీ మూడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనితీరు, పద్ధతులను వివరిస్తూ డేటాను విడుదల చేశాయి.
సెకన్ల ముందు హెచ్చరిక..
భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్‌తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. భూ ప్రకంపనలను గుర్తించడానికి ఫోన్‌లోని యాక్సిలెరోమీటర్ సాయంతోనే భూ ప్రకంపనలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది.
భూకంప తరంగాలు ఫోన్‌ను చేరగానే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపుతుంది. ఒక ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తే భూకంపం సంభవించినట్టు గూగుల్ నిర్ధారిస్తుంది. అత్యంత తీవ్రంగా భూమి కంపించకముందే ప్రభావిత ప్రాంతంలో.. ఆండ్రాయిడ్ ఫోన్‌ను వాడుతున్న వారికి ఈ వ్యవస్థ హెచ్చరికలను పంపుతుంది. భూకంప తరంగాల కంటే వేగంగా హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఏఈఏ కాంతి వేగాన్ని ఉపయోగిస్తుంది.
యూఎస్‌తో మొదలు..
ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్‌లో మొదలైంది. 2021లో న్యూజిలాండ్, గ్రీస్‌లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించారు. ఈ వ్యవస్థ హెచ్చరించిన సంఘటనల్లో 2023లో టర్కీ–సిరియా (రిక్టర్ స్కేల్‌పై తీవ్రత 7.8), ఫిలిప్పీన్స్ (6.7), నేపాల్ (5.7), 2025 ఏప్రిల్‌లో టర్కీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలు ఉన్నాయి.
ఇప్పటివరకు గుర్తించిన సంఘటనలలో 2,000 కంటే ఎక్కువ తీవ్ర భూకంపాలు ఉన్నాయి. ఇక ఏఈఏ బృందం 2023 ఫిబ్రవరి–2024 ఏప్రిల్ మధ్య 15 మందిని సర్వే చేస్తే.. 79% మంది ఈ హెచ్చరికలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం రాకముందే హెచ్చరిక అందుకున్నట్టు 5.4 లక్షల మంది చెప్పడం విశేషం.
కోట్లాది మందికి..
2023 నవంబర్‌లో ఫిలిప్పీన్స్‌లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. భూకంపం ప్రారంభమైన 18.3 సెకన్ల తర్వాత ఈ వ్యవస్థ మొదటి హెచ్చరికను పంపింది. అత్యంత తీవ్ర ప్రకంపనలు సంభవించిన భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నవారికి 15 సెకన్లపాటు మెసేజులు పంపారు. దూరంగా ఉన్నవారికి, తక్కువ ప్రకంపనలు వచ్చిన ప్రాంత యూజర్లకు ఒక నిమిషంపాటు అలర్ట్స్ జారీ చేశారు.
ఇలా మొత్తంగా 25 లక్షల మందిని అప్రమత్తం చేశారు. 2023 నవంబర్‌లో నేపాల్‌లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కోటి మందికిపైగా హెచ్చరికలు అందాయి. 2025 ఏప్రిల్‌లో టర్కీలో భూమి కంపించడం ప్రారంభమైన 8 సెకన్ల తర్వాత మొదటి అలర్ట్ జారీ అయింది. ఈ ఘటనలో 1.1 కోట్ల మందికిపైగా ఈ సందేశాలు అందుకున్నారు.
అలర్ట్స్ అందుకోవాలంటే వినియోగదారులు వైఫై లేదా సెల్యులార్ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ ఎర్త్‌క్వేక్ అలర్ట్, లొకేషన్ సెట్టింగ్స్ రెండూ ఆన్‌లో ఉండాలి.
భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్‌తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది.