
వాషింగ్టన్: వైద్య చరిత్రలో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) అద్భుతం చేసింది. పెళ్లైన 18 ఏళ్ల తర్వాత మహిళ గర్భం దాల్చేందుకు దారి చూపించింది. త్వరలో ఆమె అమ్మ కాబోతుంది. అంతేకాదు స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా చరిత్రలో నిలిచారు. ఇంతకీ ఆ ఎవరా? తల్లి.
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ మాత్రమే కాదు. మానవ జీవితాల్లో పెనుమార్పులు తెస్తున్న అద్భుత సాధనం. ఏఐతో ఉద్యోగాలకు ఎసరు అని అనుకునే వారికంటే దాని వల్ల మా జీవితాలే మారిపోయాయని సంతోషపడే వారు కోకొల్లలు. అలాంటి వారిలో ఈ మహిళ ఒకరు. వ్యక్తిగత భద్రత దృష్ట్యా ఆమె పేరు బహిర్గతం చేయలేదు.
వివరాల్లోకి వెళితే.. వాళ్లిద్దరూ భార్య,భర్తలు. వివాహం జరిగి 18 ఏళ్లవుతుంది. సంతనాలేమి సమస్యతో బాధపడుతున్నారు. సంతానం కోసం ఎక్కని గుడి లేదు. మొక్కని దేవుడు లేడు. సంతానం కోసం ఎన్ని ప్రయత్నాలో చేయాలో అన్నీ చేశారు. గతంలో అనేక సార్లు ఐవీఎఫ్ (In Vitro Fertilization) ద్వారా ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కారణం? ఆమె భర్త అజోస్పెర్మియా అనే అరుదైన సమస్యతో బాధపడుతున్నారు. అంటే వీర్యంలో స్పెర్మ్ కనిపించకపోవడం అన్నమాట.
అయితే, ఈ నేపథ్యంలో ఆ దంపతులు కొలంబియా యూనివర్సిటీ ఫెర్టిలిటీ సెంటర్‌ను ఆశ్రయించారు. అక్కడ స్టార్(Sperm Tracking and Recovery) అనే ఏఐ ఆధారిత పద్ధతిని ఉపయోగించారు.ఈ పద్దతిలో ఏఐ గంటలో 8 మిలియన్లకు పైగా చిత్రాలను స్కాన్ చేసి, మానవ కంటికి కనిపించని 44 స్పెర్మ్‌లు గుర్తించింది.అలా గుర్తించిన స్పెర్మ్‌లను ఉపయోగించి ఐవీఎఫ్ ద్వారా గర్భధారణ జరిపారు. ఈ స్టార్ పద్ధతిలో గర్భం దాల్చిన ప్రపంచంలో తొలి మహిళగా ఆమె చరిత్రలో నిలవడం గమనార్హం.
ఏఐ ఎలా పనిచేస్తుంది?
వైద్యులు స్పెర్మ్ నమూనాను ఒక ప్రత్యేక చిప్‌పై ఉంచి హై-పవర్డ్ ఇమేజింగ్ ద్వారా స్కాన్ చేస్తారు. ఏఐ అల్గోరిథం స్పెర్మ్ ఆకారాన్ని, కదలికలను గుర్తించి వాటిని వేరు చేస్తుంది. ఇది సూక్ష్మతతో కూడిన, వేగవంతమైన ప్రక్రియ, మానవ నిపుణులు రెండు రోజులు వెతికినా కనిపించని స్పెర్మ్‌లను ఏఐ ఒక గంటలో కనిపెట్టగలిగింది.
వైద్య చరిత్రలో గేమ్ చేంజర్
ఈ స్టార్ టెక్నాలజీని అభివృద్ధి చేసిన డాక్టర్ జెవ్ విలియమ్స్ మాట్లాడుతూ..‘ఇది గేమ్ చేంజర్. అమ్మ తనాన్ని నోచుకోలేక ఇబ్బందులు పడుతున్న ఎంతో మంది తల్లులకు ఈ ఏఐ టెక్నాలజీ ఓ వరం’ అని అన్నారు.కాగా, ప్రస్తుతం ఈ విధానం అమెరికాలో మాత్రమే అందుబాటులో ఉంది, కానీ భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా విస్తరించే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు, వైద్యులు చెబుతున్నారు. ఇలా ఏఐ కేవలం యంత్రాల మేధస్సు కాదు, అది మనిషి ఆశలకు రూపం కూడా కావచ్చనే నానుడిని నిజం చేసింది.