అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణ సమస్యలున్నాయా? | microbiome in gastric cancer and New insights into the role of diet | Sakshi
Sakshi News home page

అసిడిటీ, గ్యాస్‌, అజీర్ణ సమస్యలున్నాయా?

Jul 3 2025 12:44 PM | Updated on Jul 4 2025 4:51 PM

microbiome in gastric cancer and New insights into the role of diet

అబ్బా.. గ్యాస్‌ ఎక్కువైంది. సోడా తాగాలి
తిన్నది అరిగి చావడం లేదు... హాజ్‌మోలా తీసుకు రా
అసిడిటీ ఎక్కువైపోతోంది. రోజుకో ట్యాబ్లెట్‌ వేసుకుంటున్నా’’
ఇలాంటి డైలాగులు మీరు తరచూ వింటూనే ఉంటారు. ఆల్‌ ఈజ్‌ వెల్‌ అనుకుని మందులు, మాత్రలు మింగుతూ కాలం గడిపేస్తూంటారు. 

చిన్నవని తీసిపారేసే ఈ సమస్యలు కాలం గడిచేకొద్దీ ముదిరిపోయి రకరకాల ఆరోగ్య సమస్యలకు దారితీస్తూంటాయి. అప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. బోలెడంత డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది కూడా. ఇలా కాకుండా.. అసలు రోగమే రాకుండా చూసుకోవడమే మేలు కదా? అందుకు ఏం చేయాలంటే..

దేశంలో గ్యాస్‌, అసిడిటీ, అజీర్ణం వంటి సమస్యలు రోజు రోజుకూ పెరిగిపోతున్నాయి. మరీ ముఖ్యంగా నగర ప్రాంతాల్లో. వంద మంది నగరవాసుల్లో కనీసం 70 మంది ఇలాంటి సమస్యలతో బాధపడుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అప్పుడప్పుడు సమస్యలు ఎదుర్కొనేవాళ్లు 59 మందైతే.. వారం రోజుల్లో 12 మంది, రోజూ నలుగురు జీర్ణకోశ సంబంధిత సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మలబద్ధకం సమస్య 22 మందిని పీడిస్తూంటే.. దేశంలో ఇన్‌ఫ్లమేటరీ బోవెల్‌ డిసీజ్‌ సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య 14 లక్షలు!. ఈ సమస్యలన్నింటికీ తినే ఆహారం కారణమని, జీవనశైలి కూడా తోడ్పడుతుందని ఒకప్పుడు అనుకునేవాళ్లం కానీ.. ఇప్పుడు ఈ జాబితాలోకి ఇంకోటి వచ్చి చేరింది. 

గట్‌ మైక్రోబయోమ్‌!
మన జీర్ణకోశంలో బ్యాక్టీరియా, వైరస్‌, ఫంగస్‌ వంటివి కనీసం వెయ్యి రకాలు ఉంటాయి. తాజా పరిశోధనల ప్రకారం.. ఈ సూక్ష్మజీవుల వైవిధ్యత, సంఖ్యల్లో తేడా వస్తే అసిడిటీ మొదలుకొని కేన్సర్‌ వరకూ అనేక రకాల ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు పెరిగిపోతాయి. శాస్త్రీయ పరిశోధనల ప్రకారం... 60 శాతం మంది నగర వాసుల్లో నిశ్శక్తి, యాంగ్జైటీ, మూడ్‌ మారిపోవడం వంటి సమస్యలకు ఈ గట్‌ మైక్రోబయోమ్‌(gut microbiom) కారణం!. అందుకే ఇటీవలి కాలంలో మన జీర్ణకోశంలోని సూక్ష్మజీవులను బ్యాలెన్స్‌ చేసుకునేందుకు, ఉపయోగకరమైన వాటిని పెంచుకునేందుకు రకరకాల పద్ధతులు, అలవాట్లు ప్రచారంలోకి వచ్చాయి. 

తినే తిండిని మార్చితే..
అనేక ఆరోగ్య సమస్యలకు కారణమవుతున్న గట్‌ మైక్రోబయోమ్‌ సమస్యను సరి చేసుకోవడం చాలా సులువు కూడా. తినే ఆహారంలో చిన్న చిన్న మార్పుల ద్వారా కొన్ని నెలల్లోపే పూర్వస్థితికి చేరుకోవచ్చునంటున్నారు నిపుణులు. చేయాల్సిందిలా సింపుల్‌...

  • పీచుపదార్థాలు ఎక్కువగా ఉండే గింజలు,  పప్పు ధాన్యాలు, పండ్లు కాయగూరలు తినడం. వీటివల్ల మన జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా వృద్ధి అవుతుంది.

  • పెరుగు, మజ్జిగ, కెఫిర్‌ (పాలను కెఫీర్‌ గింజలతో కలిపి పులియబెట్టి తయారు చేసుకోవాలి), కిమ్చీ, కంబూచా వంటివి తీసుకోవడం వల్ల ఉపయోగకరమైన బ్యాక్టీరియా పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వీటిని ప్రోబయాటిక్స్‌ అని పిలుస్తారు.

  • వెల్లుల్లి, ఉల్లిపాయ, అరటికాయ, ఓట్స్‌ వంటివి జీర్ణకోశంలోని ఉపయోగకరమైన బ్యాక్టీరియా ఎదిగేందుకు ఉపయోగపడతాయి. ప్రీబయాటిక్స్‌ అన్నమాట.

  • డార్క్‌ చాకొలెట్‌ (కనీసం 70 శాతం కోకో ఉన్నది), గ్రీన్‌ టీ, రకరకాల బెర్రీస్‌ వంటివాటిల్లో ఉండే పాలిఫినాల్స్‌ జీర్ణకోశంలోని సూక్ష్మజీవుల వైవిధ్యత పెరిగేందుకు దోహదపడతాయి. 

జీర్ణకోశం బ్యాలెన్స్‌ చేసుకోవడానికి ఆహారం మాత్రమే సరిపోదు. దీంతోపాటు రోజూ కనీసం ఏడు గంటలపాటు నిద్రపోవడం అవసరం. వీలైనంత వరకూ ఒత్తిడిని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల శరీరంలో మంట/వాపులు తగ్గిపోతాయి. ఫ్యాక్టరీల్లో తయారైన ఆహారం, చక్కెర, కృత్రిమ చక్కెరలు, మితిమీరిన మద్యపానం, ధూమపానాలు జీర్ణకోశం లోపలిపొరలను బలహీనపరుస్తాయి. తద్వారా చెడు బ్యాక్టీరియా పెరిగేందుకు కారణమవుతాయి. శరీరం, ఆరోగ్యం సహకరిస్తే ఇంటర్‌మిటెంట్‌ ఫాస్టింగ్‌ చేయండి. జీర్ణకోశాన్ని కాపాడే మ్యూకస్‌ ఎక్కువ ఉత్పత్తి అయ్యే అవకాశముంది. 

చివరిగా... అన్నింటికంటే ముఖ్యమైన విషయం... అవసరమైతే కానీ యాంటీబయాటిక్స్‌ వాడకూడదు. వీటివల్ల శరీరంలో ఉండే ఉపయోగకరమైన బ్యాక్టీరియా నశించిపోతుంది. 

:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement