కొండను కదిలించడం అంటే ఇదే! | Hundreds Of Robots Move An Entire City Block In China | Sakshi
Sakshi News home page

కొండను కదిలించడం అంటే ఇదే!

Jun 30 2025 2:38 PM | Updated on Jul 4 2025 4:54 PM

Hundreds Of Robots Move An Entire City Block In China

వందేళ్ల పురాతనమైన ఇటుక కట్టడం.. 44 వేల చదరపు అడుగుల నిర్మాణం.. 8270 టన్నుల బరువు.. చిన్నసైజు కొండలా ఉంటుంది. కానీ.. మనిషి సంకల్పం ముందు మాత్రం దూదిపింజె చందంగా తేలికగా మారిపోయింది. ఇటు నుంచి అటుకు.. కొంత సమయం తరువాత అటు నుంచి ఇటుకు వచ్చేసింది. చైనాలో జరిగిందీ అద్భుతం. భూగర్భంలో ఓ షాపింగ్‌ సెంటర్‌ కట్టేందుకు అడ్డుగా ఉందని.. షాంఘైలోని హయాన్లీ షికుమెన్‌ భవనాన్ని చెక్కు చెదరకుండా పక్కకు తరలించారు. మల్టీ లెవల్‌ అండర్‌గ్రౌండ్‌ షాపింగ్‌ మాల్‌ నిర్మాణం పూర్తి కాగానే యథాతథ స్థితికి చేర్చేశారు.

వివరాలు... ఇప్పుడంటే మాయమయ్యాయి కానీ.. ఒకప్పుడు చైనాలో నడవా ఇళ్లు భారీ ఎత్తునే ఉండేవి. నడవ ఇల్లు అంటే అర్థం కాకపోతే.. విశాలమైన సెంట్రల్‌ కోర్టు ఉన్న అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ అనుకోండి. 1920, 30లలో కట్టిన ఓ అపార్ట్‌మెంట్‌ కాంప్లెక్స్‌ ఈ హుయాన్లీ షికుమెన్‌ కాంప్లెక్స్‌. కాలం మారిపోయింది. షాంఘై మహా నగరమైంది. ప్రజల అవసరాలు పెరిగిపోయాయి. ఇందుకు తగ్గట్టుగా ఈ కాంప్లెక్స్‌ ఉన్న చోట ఓ భారీ భూగర్భ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టాలని ప్రభుత్వం తీర్మానించింది. అయితే వందేళ్ల చరిత్ర ఉన్న హుయాన్లీ కాంప్లెక్స్‌ను కూల్చేసేందుకు స్థానిక ప్రభుత్వానికి మనసు రాలేదు. దాన్ని కాపాడుకుంటూనే అండర్‌గ్రౌండ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌ కట్టేద్దామని తీర్మానించారు.

ఈ ప్రాజెక్టు కాంట్రాక్ట్‌ దక్కించుకున్న షాంఘై కన్‌స్ట్రక‌్షన్‌ నెం:2 సంస్థ భవనాన్ని నఖశిఖ పర్యంతం పరిశీలించి.. త్రీడీ స్కానింగ్‌ చేసి... పక్కనే ఉన్న ఖాళీ స్థలంలోకి తరలించాలని, షాపింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం తరువాత మళ్లీ ముందు ఉన్న చోటికి తెచ్చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. అత్యాధునిక కృత్రిమ మేధ సాయంతో పనిచేసే డ్రిల్లింగ్‌ రోబోలు రంగంలోకి దిగాయి. మట్టికి, నిర్మాణానికి మధ్య తేడాను స్పష్టంగా అర్థం చేసుకోగల ఈ రోబోలు భవనం చుట్టూ ఒక పద్ధతి ప్రకారం తవ్వడం మొదలుపెట్టాయి. అడుగుభాగంలోకి చేరి ఒక్కటొక్కటిగా 432 హైడ్రాలిక్‌ వాకింగ్‌ రోబోలను నిలిపాయి.

ఒక్కోటి పది టన్నుల బరువును మోయగల సామర్థ్యం ఉన్నవి. సెన్సర్ల సాయంతో పీడనం, కంపనలు వంటివి గుర్తిస్తూ వాకింగ్‌ రోబోలు అన్నీ సమన్వయంతో నెమ్మదిగా కదలుతూ భవనం మొత్తాన్ని పక్కనున్న ఖాళీస్థలంలో ఏర్పాటు చేసిన ర్యాంప్‌పైకి చేర్చాయి. ఒక రోజుకు కేవలం 33 అడుగుల దూరం మాత్రమే ప్రయాణిస్తూ... భవనం చెక్కు చెదరకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు.  2023లో మొదలైన ఈ తరలింపు కొద్ది రోజుల్లోనే ముగిసింది కానీ.. ఆ తరువాత ఖాళీ స్థలంలో అండర్‌గ్రౌండ్‌ షాపింగ్‌ కాంప్లెక్స్‌తోపాటు ఒక భూగర్భ మెట్రో రైలు స్టేషన్‌, పార్కింగ్‌ ఏర్పాట్లు వంటివన్నీ పూర్తి చేశారు. ఈ ఏడాది మే నెల 19న హుయాన్లీ కాంప్లెక్స్‌ను మళ్లీ యథాతథ స్థితికి తీసుకొచ్చే పని మొదలై 19 రోజుల్లోనే ముగించారు. జూన్‌ ఏడవ తేదీకల్లా భవనం తన సొంత పునాదులపై నిలిచింది.

ఇదే తొలిసారా?
ఊహూ కానేకాదు. భారీ భవంతులను పక్కకు జరిపడం గతంలోనూ చాలాసార్లు జరిగింది. 1985లో టెక్సస్‌లోని సాన్‌ ఆంటోనియలో ఉండే ఫెయిర్‌మౌంట్‌ హోటెల్‌ను కూడా ఆరు బ్లాకుల దూరం కదిలించారు. భారీ క్రేన్‌, డంప్‌ ట్రక్కుల సాయంతో జరిగిందీ తరలింపు. చక్రాలపై కదిలిన అతి భారీ భవంతిగా ఇప్పటికీ గిన్నిస్‌ రికార్డు కొనసాగుతోంది. దీని బరువు 14.5 లక్షల కిలోలు లెండి!

1930లో ఇండియానా బెల్‌ అనే టెలిఫోన్‌ కంపెనీ ఏడు అంతస్తుల తన ప్రధాన కేంద్ర భవనాన్ని ఒక దిక్కు నుంచి ఇంకో దిక్కుకు మళ్లించడం కూడా ఒక రికార్డే. పైగా ఇలా ఈ భవనాన్ని తిప్పేస్తున్నప్పుడు దాంట్లో కార్యకలాపాలు ఏ మాత్రం నిలిపివేయకపోవడం ఇంకో విశేషం! 1962లో చైనా కూడా సుమారు 22 అంతస్తుల భవనం ఒకదాన్ని 90 డిగ్రీల మేరకు పక్కకు తిప్పేయడం కొసమెరుపు!
- గిళియారు గోపాలకృష్ణ మయ్యా!

Advertisement
 
Advertisement
Advertisement