
ఉద్యాన నగరి బెంగళూరు ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు బృహత్ ప్రయత్నం మొదలైంది. కోటి రూపాయలైనా ఖర్చుపెడతా.. ఈ కార్యక్రమంలో చేయి కలపండి అని పిలుపునిచ్చిన ప్రశాంత్ పిట్టి తన కార్యచరణ మొదలుపెట్టాడు. పది రోజుల క్రితం ఒకానొక ట్రాఫిక్ జామ్‌లో గంటకు పైగా చిక్కుకుపోయిన ప్రశాంత్.. ఈ సమస్యకు ఎలాగైనా చెక్ పెట్టాలని తీర్మానించుకోవడం... ఏఐ, ఎంఎల్ ఇంజినీర్లు ముందుకొస్తే టెక్నాలజీ సాయంతో ట్రాఫిక్ చిక్కులు తొలగిద్దామని ‘ఎక్స్’ వేదికగా(కోటి ఖర్చు పెడతా... ట్రాఫిక్ సమస్యను తీర్చేద్దాం!) పిలుపునిచ్చిన విషయం తెలిసిందే.
ఆ తరువాత.. ఈ పది రోజుల్లో ఏం జరిగిందో కూడా ప్రశాంత్ తన తాజా ట్వీట్‌లో వివరించారు. ‘‘ఏడాది కాలంలో బెంగళూరు ట్రాఫిక్ సమస్యను 25-30 శాతం వరకూ తీర్చగలనని నమ్మకంగా ఉన్నా’’ అన్న ప్రశాంత్ దిశగా చేసిన ప్రయత్నాలను ఇలా వివరించారు.
అందరి సహకారం...
బెంగళూరు ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ప్రశాంత్ బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, మున్సిపల్ కార్పొరేషన్ (బీబీఎంపీ) కమిషనర్లతోపాటు ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ (ఐఐఎస్‌సీ) ప్రొఫెసర్లు, రోడ్డు ఇంజినీర్లు, ఊబర్, ఓలా, ర్యాపిడో వంటి ట్రాఫిక్‌తో సంబంధమున్న వ్యాపారస్తులను కలిశారు. కలిసికట్టుగా సమస్య పరిష్కారానికి కృషి చేద్దామన్న ప్రశాంత్ పిలుపునకు సానుకూల స్పందన వ్యక్తమైంది. ట్రాఫిక్ పోలీస్, బీబీఎంపీ కమిషనర్లు ఇప్పటికే తాము చేస్తున్న ప్రయత్నాలను, తమకున్న సామర్థ్యాలను వివరించారు. అటు ప్రభుత్వ అధికారులు.. ఇటు విద్యావేత్తలు.. మరోవైపు సమస్యను ఎదుర్కొంటున్న వారందరూ ఒక్కతాటిపైకి చేరారన్నమాట.
కంప్యూటర్ మోడళ్లతో అధ్యయనం...
బెంగళూరు ట్రాఫిక్ పోలీస్, ఐఐఎస్‌సీల వద్ద ఉన్న కంప్యూటర్ సిములేషన్ మోడళ్లను ట్రాఫిక్ రీమోడలింగ్‌కు ఉపయోగించాలని నిర్ణయించాము. ఏయే మార్గాల్లో ఎంత ట్రాఫిక్ ఉంటే బాగుంటుందో ఈ కంప్యూటర్ మోడళ్ల ద్వారా పరిశీలిస్తారు. దగ్గరి దారిపై దృష్టి పెట్టకుండా.. తక్కువ సమయంలో గమ్యాన్ని చేరేందుకు ఉన్న ప్రత్యామ్నాయ మార్గాలను సూచించడం ఈ మొడళ్ల లక్ష్యం. ‘‘గూగుల్, ఊబర్, ఓలా, ర్యాపిడోల నుంచి కూడా ట్రాఫిక్ సమాచారం కోరాను. కొంతమంది సహకరించేందుకు అంగీకరించారు. ఇతరుల కోసం వెయిట్ చేస్తున్నా. ఈ మోడల్ పనిచేస్తే ఎప్పుడు, ఎక్కడ ట్రాఫిక్ జామ్ అవుతుందో ముందుగానే గుర్తించవచ్చు. నివారించేందుకూ అవకాశం ఏర్పడుతుంది’’ అని ప్రశాంత్ వివరించారు.
రోడ్లపై గుంతల సంగతి తేలుస్తా...
‘‘రహదారిపై ఉండే గుంతలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ఇప్పటికే కొన్ని యాప్‌లు ఉన్నాయి. ఆ యాప్ ఓనర్‌షిప్ నేను తీసుకుంటా. గుంతలతోపాటు అక్రమ పార్కింగ్, సిగ్నల్స్ పనిచేయకపోవడం, రాంగ్‌సైడ్ డ్రైవింగ్, నీరు నిలిచిపోవడం, వాహనాల బ్రేక్‌డౌన్ వంటి అంశాలను ప్రజలే మా దృష్టికి తీసుకొచ్చేలా చేస్తాం. ఎవరి బాధ్యత ఏమిటన్నది స్పష్టంగా నిర్ణయించే ప్రయత్నం జరుగుతుంది. అలాగే మంచి పని చేసిన వారికి గుర్తింపు కూడా. వచ్చిన ఫిర్యాదులు.. తీసుకున్న చర్యలను బహిరంగంగా ప్రదర్శిస్తాం.
‘‘ప్రభుత్వం మౌలికసదుపాయాల వృద్ధి, నిర్వహణల కోసం అప్పుడప్పుడూ రహదారులను బంద్ చేస్తూంటుంది. అయితే వర్షం పడగానే ఈ పనులు నిలిచిపోతాయి. ఫలితంగా ట్రాఫిక్ చిక్కులు ఎక్కువవుతాయి. ఈ సమస్య పరిష్కారం కోసం బెంగళూరు నగరంలోని ఒక్కో ప్రాంతంలో ఎప్పుడు, ఎంత వర్షం పడుతుందో తెలుసుకునేందుకు ‘హైపర్‌లోకల్ రెయిన్ ప్రిడిక్టర్’ ప్రాజెక్టును చేపడతాం. వర్షం పడకముందే డ్రెయినేజీ సమస్యలను సరిచేసేందుకు, కొన్ని ఇతర పనులకు ఇది ఉపయోగపడుతుంది’’
ఒక మార్గంలో ట్రాఫిక్ సిగ్నల్స్ సమన్వయంతో ఒకదాని తరువాత ఒకటి పడేలా చేసేందుకు చర్యలు తీసుకుంటాం. ఫలితంగా వాహనాలు ఒక క్రమ పద్ధతిలో కదులుతాయి. ప్రతి జంక్షన్‌లోనూ నిలవాల్సిన అవసరం ఉండదు. దీనికి సంబంధించి ఇప్పటికే ఒక పైలట్ ప్రోగ్రామ్ నడుస్తోంది. ఫలితాలను విశ్లేషించి అవసరమైతే నగరం మొత్తం విస్తరిస్తాం.’’
విజన్ ఫర్ ఇండియా...
‘‘పది రోజుల క్రితం నేను ట్రాఫిక్ సమస్యపై పోస్ట్ పెట్టినప్పుడు అదంతా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సమస్య అని కొందరు చెప్పారు. వాస్తవం చెప్పినందుకు కంగ్రాట్స్. అయితే ఈ మౌలిక సదుపాయాలు మెరుగయ్యేంత వరకూ వెయిట్ చేస్తే మనం పాశ్చాత్యదేశాలతో పోటీ పడినట్లుగా ఉంటుంది. ఉన్న సదుపాయాలను మరింత మెరుగ్గా వాడుకునేందుకు ఇక్కడ ఎంతో అవకాశం ఉంది. నేను దీనిపై దృష్టి పెడతా. నెపం వ్యవస్థలపై నెట్టేసే సమయం కాదిది. ఆచరణ సాధ్యమైన ఆశావహ దృక్పథం. మంచి ఉద్దేశంతో అన్ని రకాల సమాచారం సేకరించుకుని, అందరి సహకారంతో ఏం చేయలేము అనుకుంటున్న సమస్య విషయంలో ఎంతో కొంత చేయవచ్చునని నా నమ్మకం’’
పాఠకుల నుంచి ఆశిస్తున్నది..
‘‘మీ సహకారాన్ని కొనసాగించండి. ట్వీట్లు షేర్ చేయండి. కామెంట్ చేయండి. ఫలితంగా ఈ సమస్య మరింత ఆంప్లిఫై అవుతుంది. ట్రాఫిక్ జామ్‌లను పరిష్కరించేందుకు సరైన వారు పనిచేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. అందుకు చాలా సమయం పడుతుందని నాకు తెలుసు. అందుకు సిద్ధంగానే ఉన్నా.. మీరు?’’
‘‘వాట్సప్ కమ్యూనిటీలో చేరండి. ఎప్పుడేం చేయబోతున్నది అందులో వివరిస్తూంటాను. అంతేకాదు.. మీలో ప్రతి ఒక్కరి నుంచి మరింత సమాచారం కోరుతున్నా. ట్రాఫిక్ సమస్య ఏ జంక‌్షన్, రోడ్డులో ఎక్కువగా ఉంటుందో చెప్పండి. అధికారుల దృష్టికి తీసుకెళ్లేందుకు సులువుగా ఉంటుంది.’’ ప్రశాంత్ వాట్సప్ కమ్యూనిటీలో చేరేందుకు... https://whatsapp-traffic-community.forpublicgood.ai ఉపయోగించుకోండి.