
సాక్షి, యశవంతపుర: అత్యాచారం కేసులో మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ మనవడు, మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. సాధారణ ఖైదీగా ఉంటున్న ప్రజ్వల్ మెకానికల్ ఇంజినీరింగ్ చదివారు. ఆయనకు అధికారులు జైలులోని గ్రంథాలయ క్లర్కుగా బాధ్యతలు అప్పగించారు.
ఈ క్రమంలో ఖైదీలకు పుస్తకాలు ఇవ్వడం, వాటిని నమోదు చేయడం ప్రజ్వల్ పని. రోజువారీ వేతనంగా రూ.522 లభిస్తుంది. న్యాయవాదులతో చర్చలు జరపడం, కోర్టు వాయిదాల కారణంగా లైబ్రరీకి పూర్తి సమయాన్ని ఆయన కేటాయించడం లేదని జైలు అధికారులు తెలిపారు. జీవిత ఖైదు అనుభవించే వారికి నైపుణ్యం, ఆసక్తి ఆధారంగా పనులను కేటాయిస్తారు. వాటన్నిటినీ పూర్తి చేస్తే రోజుకు రూ.522 లభిస్తాయి. వారానికి మూడు రోజుల వంతున నెలకు కనీసంగా 12 రోజుల పాటైనా వీరు పనిచేయాల్సి ఉంటుంది.