విజయవంతంగా దూసుకెళ్లిన దేశీయ శిక్షణ విమానం
న్యూఢిల్లీ: ఆత్మనిర్భర్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా రక్షణ తయారీ రంగంలో స్వయం సమృద్ధి దిశగా భారత్ మరో అడుగు ముందుకేసింది. బెంగళూరులోని హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్‌ఏఎల్) తయారుచేసిన మొట్టమొదటి దేశీయ శిక్షణ విమానం హిందూస్తాన్ టర్బో ట్రైనర్–40(హెచ్‌టీటీ–40) ఆకాశంలో విజయవంతంగా దూసుకెళ్లింది. ఎలాంటి లోపాలు లేకుండా విమా నం అద్భుతమైన స్థిరత్వాన్ని, పనితీరును కనబర్చినట్లు హెచ్‌ఏఎల్ అధికారులు ధ్రువీకరించారు.
శుక్రవారం బెంగళూరులో ఈ విమానాన్ని పరీక్షించారు. హెచ్‌టీటీ–40 అనేది బేసిక్ ట్రైనర్ ఎయిర్‌క్రాఫ్ట్. భారత వైమానిక దళం(ఐఏఎఫ్) పైలట్లకు ఇందులో శిక్షణ ఇవ్వబోతున్నారు. దీనిద్వారా వేర్వేరు ఆపరేషన్లు నిర్వహించవచ్చు. సైనిక విన్యాసాలు చేపట్టవచ్చు. రాత్రిపూట కూడా పనిచేస్తుంది.
హెచ్‌టీటీ–40ని పూర్తిగా హెచ్‌ఏఎల్ అభివృద్ధి చేసి, ఉత్పత్తి చేసింది. ఇందులో అత్యాధునిక వసతులున్నాయి. ఈ విమానంతో తక్కువ ఖర్చుతోనే పైలట్లకు శిక్షణ ఇవ్వొ చ్చు. దేశీయంగానే రక్షణ ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతోందని హెచ్‌ఏఎల్ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం వైమానిక దళంలో పాత కాలం నాటికి విమానాలతోనే శిక్షణ ఇస్తున్నారు. వీటి స్థానంలో ఇకపై హెచ్‌టీటీ–40 విమానాలను ప్రవేశపెట్టబోతున్నారు.


