
ఇది ఇట్లాగే ఉండాలి.. అది అట్లాగే ఉండాలని అందరూ అనుకుంటే..
మనిషి, సమాజపు ప్రగతి కూడా అక్కడికక్కడే స్తంభిస్తుంది!
అయితే.. ఎవరో ఒకరు.. ఎప్పుడో అపుడు..
యథాతథ స్థితిని ప్రశ్నిస్తారు.. ముందడుగు వేస్తూంటారు.
చరిత్ర తెరచి చూస్తే ఇందుకు బోలెడన్ని ఉదాహరణలు..
వర్తమానంలో కనిపిస్తున్న తాజా ఉదాహరణ ఇది..
మీ క్లాస్ రూమ్‌లో బెంచీలుండేవా? ఉంటే.. అవన్నీ వరుసల్లోనే ఉండి ఉంటాయి. ముందు వరుసలో కూర్చున్న విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పేది శ్రద్ధగా వినే అవకాశం దొరికేది. వెనుక వరుసల వారు తమదైన ఆకతాయి పనులు చేసేందుకు... అప్పుడప్పుడూ టీచర్ల ఆగ్రహానికి గురయ్యే ఇబ్బంది కూడా ఏర్పడేది. టీచర్లు చెప్పేది వినలేక.. అర్థం కాక వెనుక బెంచీల వాళ్లు ఆకతాయిలుగా మారిన సందర్భాలూ ఉండే ఉంటాయి. ఇది యథాతథ స్థితి.
స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి దేశంలోని దాదాపు ప్రతి పాఠశాలలోనూ బెంచీలు ఇలాగే వరుసల్లోనే ఉండి ఉంటాయి. అయితే మళయాళం సినిమా ఒకటి ఈ యథాతథ స్థితిని సవాలు చేసింది. ‘‘బెంచీలన్నీ ఇలా వరుసల్లోనే ఎందుకు ఉండాలి’’ అని ప్రశ్నించింది. బదులుగా చతురస్రపు గదిలో గోడల వెంట ‘సీ’ ఆకారంలో బెంచీలు ఏర్పాటు చేసి తన సినిమాలో చూపింది. విద్యార్థులందరి దృష్టి టీచర్లపై ఉండేందుకు అవకాశం ఏర్పడిందన్నమాట. ఉపాధ్యాయులు కూడా అందరి దృష్టి పాఠాలపైనే ఉండేలా చూసుకునేందుకూ వీలేర్పడింది.
భలే ఉందే ఈ ఐడియా అనుకున్నారు కేరళలోని కొందరు ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు. ఒట్టిగా అనుకోవడం ఎందుకు మనమూ అలా వాడేస్తే పోలా అన్నారు ఇంకొందరు.. ఇది ఒక ట్రెండ్‌కు దారి తీసింది. ప్రస్తుతం కేరళలోని పలు పాఠశాలల్లో ఇప్పుడు కుర్చీల అమరిక ‘సీ’ ఆకారంలోకి మారిపోయాయి. కొసమెరుపు ఏమిటంటే... చాలా ఆడిటోరియమ్స్‌లో, యూనివర్శిటీల్లో.. మరీ ముఖ్యంగా పాశ్చాత్యదేశాల్లో తరగతి గదుల కూర్పు ఇదే విధంగా ఉండటం!.
No more frontbenchers vs backbenchers?
In most classrooms, your seat says it all—frontbenchers shine, backbenchers get sidelined.
But what if a film could help us unlearn the narrative? In Kerala, it just did.
A Malayalam movie scene sparked a real-life shift, replacing rigid… pic.twitter.com/LU7YEogMWG— The Better India (@thebetterindia) July 11, 2025
అందరినీ కలుపుకుపోతూ...
‘‘ఆ.. ఏమంది.. వరుసగా ఉన్న బెంచీలను చుట్టూ పెట్టేశారు. అంతే కదా? దీంతో ఏమవుతుంది?’’ అని చాలామంది అనుకోవచ్చు కానీ.. ఈ డిజైన్ మార్పుతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో మసిలే విధానం, వారి ఏకాగ్రత, నేర్చుకునే సామర్థ్యాలపై ప్రభావం చూపుతాయి. పాఠం చెబుతున్న సమయంలో టీచర్‌ను నేరుగా చూడగలగడం వల్ల విద్యార్థులు వారితో మాట్లాడేందుకు అవకాశం ఎక్కువవుతుంది. ఇది ఏకాగ్రత ఎక్కువవుతుంది. బోధనలో విద్యార్థులూ భాగస్వాములవుతారు. వరుస బెంచీల్లో కూర్చొన్నప్పుడే వెనుక ఉన్న వారితో కలుపుగోలుగా ఉండొచ్చు. క్లాసులో ఏదైనా యాక్టివిటీ చేయాలంటే సులువుగా ఉంటుంది. విద్యార్థులందరినీ కలుపుకుని పాఠం చెప్పేందుకు టీచర్లకు వెసలుబాటు ఏర్పడుతుంది.
-గిళియారు గోపాలకృష్ణ మయ్యా.