
సెల్‌ఫోన్ పోయిందని ఓ యువకుడు నీళ్లలో వెతకడం.. అది దొరక్క చివరకు ఏడుస్తూ కూర్చోవడం.. ఆ వీడియో కాస్త వైరల్ కావడం.. నెట్టింట రకరకాల చర్చలకు దారి తీసింది.
రాజస్తాన్ జైపూర్‌లో స్థానిక సుభాష్ చౌక్‌లో నివాసం ఉంటున్నాడు హల్దార్ అనే యువకుడు. తన స్కూటీ మీద వెళ్తుంటే రామ్ నివాస్ బాఘ్ వద్ద రోడ్డు మీద వానకు నిలిచిపోయిన నీటిలో పడిపోయాడు. దెబ్బలేం తాకలేదు. అయితే ఆ పడడమే అతని జేబులోని సెల్ ఫోన్ ఎగిరి నీళ్లలో పడింది. ‘అయ్యో నా ఫోన్..’ అనుకుంటూ కంగారుగా నీళ్లలోకి దిగాడు. పాపం.. ఆ ఫోన్ కోసం ఆ బురద నీటిలో చాలాసేపు వెతికాడు.
అటుగా వెళ్లేవాళ్లు.. ‘‘ఎవడ్రా.. వీడు’’ అన్నట్లుగా చూస్తూ పోతున్నారే తప్ప, ఆగి ఏం జరిగిందో తెలుసుకునే ప్రయత్నమూ చేయలేదు. ఒక్కడు తప్ప!. చాలాసేపైనా దొరక్కపోవడంతో చివరకు ఆ నీళ్లోనే కూలబడి కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇదంతా ఆ ఒక్కడు తన ఫోన్‌లో బంధిస్తూనే ఉన్నాడు. ఈలోపు.. ఆ వీడియో తీసే వ్యక్తి ఏమైందని అడిగాడు.. రోడ్లు గుంతలు లేకుండా సరిగ్గా ఉంటే.. మున్సిపల్ వాళ్లు సరిగా పని చేసి ఉంటే.. ఈ నీరు ఇలా ఆగేదా?. నా ఫోన్ పోయేదా?.. ఇలాంటి వాళ్ల వల్లే వ్యవస్థలో నాలాంటి వాళ్లు విఫలం అవుతూనే ఉన్నారు అంటూ ఆ యువకుడు భారీ డైలాగులే కొట్టాడు.

ఈలోపు ఈ వీడియో సోషల్ మీడియాకు ఎక్కింది. చాలామంది పోయింది ఫోనే కదా.. అంటూ తామూ ఫోన్‌లను పొగొట్టుకున్న సందర్భాలను ప్రస్తావించారు. మరికొందరు అధికారులను తిట్టిపోశారు. ఇంకొందరు అటుగా వెళ్లేవాళ్లు సాయం చేసి ఉండొచ్చు కదా అంటూ సలహా పడేశారు. ఇంకొందరు బహుశా అదే అతని జీవనాధారం అయి ఉండొచ్చని.. అతని వివరాలు ఇస్తే కొత్త ఫోన్ కొనిస్తామని కామెంట్లు పెడుతున్నారు. ఇలా ఒక్కొక్కరు.. ఒక్కోలా..! ప్చ్.. ఎవరేమనుకున్నా ఆ కన్నీళ్లకు మాత్రం ఓ అర్థం ఉంది.
రేయ్ హల్దార్.. ఎందుకురా ఏడుస్తున్నావ్?. ఫోన్ పోయిందనా?.. ఇంట్లో వాళ్లు తిడతారనా?. కష్టపడి సంపాదించుకున్నావనా?. లేకుంటే సాయం చేయకుండా జనాలు ఎవరిమానాాన వాళ్లు వెళ్లిపోయారనా?. రోడ్లు సవ్యంగా లేవనా? నీళ్లలో పడిపోయావనా? అధికారులు.. సిబ్బంది సవ్యంగా పని చేయలేదనా?.. రేయ్ తమ్ముడూ జీవితం అంటే ఇంతేనా?.. పైకి లేవు!!. సాయానికి జనం ముందుకొస్తున్నారుగా.. చూద్దాం!
A viral video shows a young man breaking down in tears after his mobile phone reportedly slipped into rainwater in Jaipur.#JaipurRains #Rajasthan #Viral #ViralVideo #HeavyRainfall #Trending pic.twitter.com/KwDtwoYaAj
— TIMES NOW (@TimesNow) July 10, 2025