అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..! | Jaipur Couple Found Dead At Their House | Sakshi
Sakshi News home page

అన్యోన్య దాంపత్యం.. అర్ధాంతరంగా ముగిసిపోయింది..!

Jun 29 2025 6:05 PM | Updated on Jun 29 2025 6:20 PM

Jaipur Couple Found Dead At Their House

వారిది కచ్చితంగా అన్యోన్య దాంపత్యమనే చెప్పొచ్చు. కానీ వారి జీవితం అర్థాంతరంగా ముగిసిపోయింది. ఇక్కడ అన్యోన్య దాంపత్యం అని ఎందుకు అనాల్సి వచ్చిందంటే.. అది సీసీ టీవీ ఫుటేజ్‌ చెబుతున్న మాట. మనిషి మాట నమ్మని ఈ రోజుల్లో.. సీసీ టీవీ ఫుటేజ్‌ ‘మాట’ కచ్చితంగా నమ్ముతాం.  

వీరు శవాలుగా మారకముందు గత రెండు రోజుల సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించి  చూస్తే వారు చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఎంతో అన్యోన్యంగా కనిపించారు.  మరి ఈ జంట ఎలా చనిపోయిందనేది ప్రశ్న. ఏమైనా  చిన్నపాటి మనస్పర్థలు తలెత్తి అది ఆత్మహత్య వరకూ వెళ్లిందా? లేక ఎవరైనా హత్య చేశారా? అనేది పోలీసులు దర్యాప్తులో తేలనుంది. ప్రస్తుతం అనుమానాస్పద మృతిగానే ఈ కేసు దర్యాప్తు చేపట్టారు పోలీసులు.

రాజస్థాన్‌ రాష్ట్రంలోనే జైపూర్‌లో జరిగిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా కలకలం రేపుతోంది. ఈ దంపతుల్లో భర్త పేరు ధర్మేంద్ర కాగా, భార్య పేరు సుమన్‌.  వీరికి 11, 8 ఏళ్లు కల్గిన ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.  వారి ఇద్దరు  భరత్‌పూర్‌ గ్రామంలో తమ నానమ్మ, తాతయ్యలు దగ్గర ఉంటున్నారు. సమ్మర్‌ హాలీ డేస్‌కు తాతయ్య ఇంటికి వెళ్లిన ఆ పిల్లలు ఇంకా రాలేదు.

ధర్మేంద్ర- సుమన్‌ జంట ఈ శుక్రవారం(జూన్‌ 27వ తేదీ) తమ ఫ్లాట్‌లో విగతజీవులుగా కనిపించారు. అంతకుముందూ వరకూ ఎంతో ఆనందంగా ఉన్న ఈ జంట.. ఎందుకు ఇలా చేశారు అనేది చర్చగా మారింది. ధర్మేంద్ర బ్యాంక్‌ సేల్స్‌  మేనేజర్‌ గా పని చేస్తున్నాడు. అయితే శుక్రవారం ధర్మేంద్ర బ్యాంక్‌కు వెళ్లకపోవడంతో తోటి ఉద్యోగులు ఫోన్‌ చేస్తే స్పందన రాలేదు. 

దీంతో ఈ విషయాన్ని సదర ఉద్యోగి.. ధర్మేంద్ర బంధువులకు తెలియజేశాడు. దీంతో వారు వెళ్లి తలుపులు పగలగొట్టి చూడగా ఆ జంట విగతజీవులుగా కనిపించారు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా దర్యాప్తు చేపట్టారు. 

ప్రస్తుతం వీరికి ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు లేవని బంధువులు చెబుతున్నారు.  ఇటీవలే రీసెంట్‌గా ఫ్లాట్‌ కొనుగోలు చేసిన వీరి ఆర్థికపరిస్థితి మెరుగ్గానే ఉన్నట్లు వారు అంటున్నారు. 

మూడు సీసీ ఫుటేజ్‌లో ఇలా..
ఒక సీసీ ఫుటేజ్‌లో వారిద్దరూ ఎంతో అన్యోన్యంగా ఉన్నట్లు కనిపించారు. వారు ఫ్లాట్‌లో కారు పార్కు చేసే క్రమంలో భార్య సుమన్‌.. భర్త ధర్మేంద్ర భుజంపై తలపెట్టుకుని అతని చేతుల్ని పట్టుకుని ఉంది.  ఆపై కారు దిగి వెళ్లిపోతున్న వీడియోలో ఆమె భుజంపై భర్త ధర్మేంద్ర చేయి వేసి నడుచుకుంటూ వెళ్లినట్లు ఉంది.  

అయితే వారు చనిపోవడానికి ముంద రోజు గురువారం మాత్రం ఇద్దరికీ చిన్నపాటి వాగ్వాదం జరిగినట్లు కనిపించింది. ఆ తర్వాత  అదే రోజు సాయంత్రం భార్య సుమన్‌.. ఒక క్యారీ బ్యాగ్‌ తీసుకుని వెళుతున్నట్లు కనిపించింది. అదే వారు చివరిసారి సజీవంగా కనిపించడం. ఆ తర్వాత రోజే  ఈ దారుణం చోటు చేసుకుంది. 

సుమన్‌ ఒంటిపై గాయాలు
అయితే భార్య సుమన్‌ ఒంటిపై గాయాలు కనిపించడంతో హత్యా కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.  వీరి కుటుంబంలో ఎటువంటి వైవాహిక విభేదాలు ఉన్నట్లు తమకు కనిపించలేదని పోలీస్‌ అధికారి అజయ్‌ సింగ్‌ తెలిపారు. అయితే ఇద్దరూ సూసైడ్‌ చేసుకుని ఉండటంతో అనుమానాస్పద మృతి కేసుగా దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.  ఏమైనా క్లూ దొరుకుతుందనే కోణంలో వారి మొబైల్స్‌ను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపారు పోలీసులు.
 

Advertisement
 
Advertisement
Advertisement