
శివసేన ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్‌పై కేసు నమోదైంది. పాడైపోయిన పప్పు పెడుతున్నారంటూ ఎమ్మెల్యే క్యాంటీన్ సిబ్బందిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. అదే సమయంలో ఓ జాతీయ మీడియా చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇంకోవైపు తీవ్ర దుమారం రేపుతున్నాయి.
బుల్దానా నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన సంజయ్.. ముంబైలోని తన అధికారిక నివాసంలో పనిచేస్తున్న క్యాంటీన్ కాంట్రాక్టర్‌ను తీవ్రంగా కొట్టారు. పాచిపోయిన ఆహారం ఇచ్చారంటూ పప్పు ఉన్న కటోరాను కాంట్రాక్టర్ ముక్కు వద్ద పెట్టిన గైక్వాడ్.. ఆ వెంటనే అతనిపై ముష్టిఘాతాలు కురిపించారు. సదరు కాంట్రాక్టర్ కింద పడిపోయి.. లేవలేని స్థితిలో ఉన్నా.. తన దాడిని ఆపలేదు. ఈ దాడికి సంబంధించిన వీడియో బుధవారం నెట్టింట వైరల్ అయ్యింది.
అధికార పార్టీ ఎమ్మెల్యే తీరును ప్రతిపక్షాలతో పాటు మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫఢ్నవిస్, శివసేన బాస్.. ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే తీవ్రంగా ఖండించారు. అయినా కూడా గైక్వాడ్ తన నోటి దురుసును ఆపలేదు. తన చర్యను సమర్థించుకుంటూ వచ్చారు. ఈ క్రమంలో రెండు రోజుల తర్వాత.. శుక్రవారం ఆయనపై కేసు నమోదైనట్లు సమాచారం. అయితే ఆయనపై ఎలాంటి అభియోగాలు నమోదు చేశారో స్పష్టత రావాల్సి ఉంది.
గురువారం రాత్రి ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో దక్షిణ భారతీయులపై శివసేన(శిందే వర్గం) ఎమ్మెల్యే సంజయ్ గైక్వాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దక్షిణ భారతీయులు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. మహారాష్ట్ర సంస్కృతిని నాశనం చేస్తున్నారు. శెట్టి అనే దక్షిణాది వ్యక్తికి కాంట్రాక్ట్ ఎలా ఇచ్చారు? మహారాష్ట్ర స్థానికుడికి ఇవ్వాలి కదా? ఏం తినాలో మాకు తెలుసు. దక్షిణాదివారు డ్యాన్స్ బార్లు, లేడీస్ బార్లను నడుపుతూ.. పిల్లల్ని చెడగొడుతుంటారు. అలాంటి వారు మంచి ఆహారం ఎలా అందిస్తారు? అని అన్నారాయన. ఈ వ్యాఖ్యలపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.