
విదేశీ మీడియాకు అజిత్ దోవల్ సవాల్
ఆపరేషన్ సిందూర్‌పై తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపాటు
భారత్‌కు నష్టం జరిగినట్లు నిరూపించగలరా?
కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా?
పాక్‌పై దాడులు చేసి వస్తుండగా గాజు ముక్క కూడా పగిలిపోలేదని స్పష్టీకరణ
చెన్నై: ఆపరేషన్ సిందూర్ విషయంలో విదేశీ మీడియా తప్పుడు ప్రచారం చేస్తోందని జాతీయ భద్రతా సలహాదారు అజిద్ దోవల్ మండిపడ్డారు. ఈ ఆపరేషన్‌లో భారత్‌కు నష్టం వాటిల్లినట్లు కనీసం ఒక్క ఫొటో అయినా చూపించగలరా? కనీసం ఒక గాజు ముక్క అయినా పగిలినట్లు నిరూపించగలరా? అని సవాల్ విసిరారు. పాకిస్తాన్ ఉగ్రవాదుల భరతం పట్టడానికి భారత వైమానిక దళం చేపట్టిన ఆపరేషన్ సిందూర్ భారత్‌కు గర్వించదగ్గ ఘట్టమని అభివర్ణించారు.
ఈ ఆపరేషన్‌లో భారత్ సైతం భారీగా నష్టపోయిందంటూ అంతర్జాతీయ మీడి యాలో వస్తున్న కథనాలను ఆయన తీవ్రంగా ఖండించారు. తమిళనాడు రాజధాని చెన్నైలో శుక్రవారం ఐఐటీ–మద్రాసు 62వ స్నాతకోత్సవంలో విద్యార్థులను ఉద్దేశించి అజిత్ దోవల్ ప్రసంగించారు.
ఆపరేషన్ సిందూర్‌లో భాగంగా పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్(పీఓకే) భూభాగంలో తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను అత్యంత కచ్చితత్వంతో ధ్వంసం చేసినట్లు వెల్లడించారు. ఒక్క టార్గెట్ కూడా గురి తప్పలేదని స్పష్టంచేశారు. ఎవరు(ఉగ్రవాదులు) దాక్కున్నారో తమకు తెలుసని, మే 7వ తేదీన కేవలం 23 నిమిషాల్లో తొమ్మిది శిబిరాలు నేలమట్టం అయిపోయాయని పేర్కొన్నారు. సరిహద్దుకు దూరంగా సరిగ్గా ఉగ్రవాద శిబిరాలపైనే దాడి చేశామని తెలిపారు.
అవన్నీ పాకిస్తాన్ ఫొటోలే..
‘‘పాకిస్తాన్‌లో 13 ఎయిర్‌బేస్‌లు ధ్వంసమైనట్లు న్యూయార్క్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. మే 10వ తేదీకి ముందురోజు, తర్వాతి రోజు ఫొటోలను ప్రచురించింది. అవి పాకిస్తాన్‌లోని సర్గోధా, రహీంయార్‌ఖాన్, చాక్లాలా ప్రాంతాలకు సంబంధించిన చిత్రాలే. వాటిలో భారత్‌కు సంబంధించిన ఫొటో ఒక్కటైనా ఉందా? అలాంటప్పుడు భారత్‌కు నష్టం జరిగిందని ఎలా అంటారు? పాకిస్తాన్ సైన్యం ఇండియాకు వ్యతిరేకంగా అది చేసింది, ఇది చేసింది అంటూ అంతర్జాతీయ మీడియా చెబుతున్నదాంట్లో ఎలాంటి వాస్తవం లేదు.
ఇండియాకు నష్టం జరిగినట్లు ఒక్క సాక్ష్యం ఉన్నా చూపించాలి. పాకిస్తాన్‌పై దాడులు చేసి వెనక్కి వస్తుండగా ఒక్క గాజు ముక్క కూడా పగిలిపోలేదు. పాక్ ప్రయోగించిన క్షిపణులను మన గగనతల రక్షణ వ్యవస్థ మధ్యలోనే కూల్చివేసింది. ఆపరేషన్ సిందూర్‌లో దేశీయ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృత స్థాయిలో ఉపయోగించినందుకు గర్వపడుతున్నాం. అత్యంత కచ్చితత్వంతో కూడిన దాడులు చేయగలమని ఈ ఆపరేషన్ ద్వారా భారత సైన్యం నిరూపించింది. మన సైన్యం శక్తి ఏమిటో ప్రపంచానికి తెలిసొచ్చింది’’ అని అజిత్ దోవల్ వివరించారు.
ఏఐ ఒక గేమ్ చేంజర్
యుద్ధ తంత్రానికి టెక్నాలజీ అనుసంధానించడం చాలా కీలకమని అజిత్ దోవల్ చెప్పారు. మన అవసరాలకు తగ్గట్టుగా దేశీయంగానే టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవాలని అన్నారు. ఆపరేషన్ సిందూర్‌లో బ్రహ్మోస్ క్షిపణులు, ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కంట్రోల్, కమాండ్ సిస్టమ్ ఉపయోగించామని, ఇవి దేశీయంగానే అభివృద్ధి చేసుకున్నవేనని గుర్తుచేశారు. కృత్రిమ మేధ(ఏఐ) ఒక గేమ్‌చేంజర్ అని తెలియజేశారు. దానిని కేంద్ర బిందువుగా చేసుకోవాలన్నారు.