ఖతార్‌ గ్యాస్ కేంద్రంపై దాడి.. | Iran Attacks World's Biggest Gas Hub In Qatar. How It Affects India | Sakshi
Sakshi News home page

ఖతార్‌ గ్యాస్ కేంద్రంపై దాడి..

Mar 19 2026 2:48 PM | Updated on Mar 19 2026 3:17 PM

Iran Attacks World's Biggest Gas Hub In Qatar. How It Affects India

న్యూఢిల్లీ: అంతర్జాతీయ చమురు, గ్యాస్ మార్కెట్లలో ఆందోళన పెరిగింది. ఖతార్‌లోని అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ప్లాంట్ రాస్ లాఫ్ఫాన్‌పై ఇరాన్ క్షిపణి దాడి చేసిన విషయం తెలిసిందే. అమెరికా-ఇజ్రాయెల్ తమపై చేసిన దాడులకు ప్రతిగా ఇరాన్ తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఈ దాడి చేసింది. అలాగే, అమెరికా ఆస్తులను లక్ష్యంగా చేసుకుని ఇరాన్‌ దాడులు కొనసాగిస్తోంది. 

అదే సమయంలో ఇంధన సదుపాయాలపై దాడులు చేస్తుండడంతో భారత్‌ వంటి దేశాలకు కూడా ఆందోళన కలిగిస్తోంది. చమురు, గ్యాస్ వంటి ఇంధన వనరులు ఉన్న దేశాలు ఇరాన్‌ తీరుపై అసంతృప్తితో ఉన్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఎల్‌ఎన్‌జీ ఫ‍్యాక్టరీపై దాడి జరిగిన వెంటనే అక్కడ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోయింది. 

ప్రపంచంలో అత్యధికంగా ఎల్‌ఎన్‌జీ ఉత్పత్తి చేసే దేశాల్లో ఖతార్ ఒకటి. అమెరికా, ఆస్ట్రేలియా, రష్యా కూడా ఈ జాబితాలో ఉన్నాయి. ఖతార్‌పై ఇరాన్‌ దాడి మొదటి సారికాదు. మార్చి మొదటి వారంలో ఖతార్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్‌ క్షిపణి దాడులు చేసింది. దీంతో ఖతార్ ఎనర్జీ ఉత్పత్తిని నిలిపింది. 

ఖతార్ గ్యాస్ క్షేత్రాలు, రాస్ లాఫ్ఫాన్ ఎల్‌ఎన్‌జీ ప్లాంట్‌పై ఇరాన్ చేసిన క్షిపణి దాడులు.. ఇరాన్ సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతిగా జరిగినవని సమాచారం.

ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమైన యుద్ధంలో అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ నాయకత్వంపై వరుస దాడులు చేశాయి. తాజా దాడిలో గూఢచారి విభాగం అధిపతి ఎస్మాయిల్ ఖతిబ్ హతమయ్యాడు. ఇరాన్‌లో వేల సంఖ్యలో మరణాలు జరిగినట్లు సమాచారం. అయినప్పటికీ ఇరాన్‌ క్షిపణి, డ్రోన్ దాడులు కొనసాగిస్తోంది. ప్రపంచ ఇంధన సరఫరాలను తగ్గిస్తోంది.

భారత్‌పై ప్రభావం 
ఈ పరిస్థితులు భారత్ వంటి దేశాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. భారత్ తన సహజ వాయువు అవసరాల్లో సుమారు 50 శాతం అంతర్జాతీయ మార్కెట్ నుంచి దిగుమతి చేసుకుంటుంది. ఇందులో సుమారు 20 శాతం ఖతార్ నుంచే వస్తుంది.

“భారత్ తన సహజ వాయువు అవసరాల్లో 50% విదేశీ మార్కెట్ నుంచి కొనుగోలు చేస్తుంది. అందులో సుమారు 40% ఎల్‌ఎన్‌జీ ఖతార్ నుంచి వస్తుంది. అంటే మొత్తం దిగుమతుల్లో దాదాపు 20 శాతం కతార్ నుంచే. భారత్ గ్యాస్ వినియోగాన్ని తగ్గించాల్సి వస్తుంది. ముఖ్యంగా పరిశ్రమలు, విద్యుత్ రంగంలో వినియోగం తగ్గించాలి” అని ఇంధన ఆర్థిక నిపుణుడు కిరిట్ పారిఖ్ తెలిపారు.

ప్రస్తుతం భారత్ రోజువారీ సహజ వాయువు వినియోగం 189 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు. ఇందులో 97.5 మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్లు దేశీయంగా ఉత్పత్తి అవుతుంది.

గత వారం నాటికి 47.4 మిలియన్ మెట్రిక్ స్టాండర్డ్ క్యూబిక్ మీటర్ల సరఫరా అంతరాయం ఏర్పడింది. ఇది దిగుమతుల్లో భాగం. ఫోర్స్ మజ్యూర్ పరిస్థితుల వల్ల ఈ అంతరాయం జరిగింది. దీంతో ప్రభుత్వ గ్యాస్ సంస్థలు ఇతర సోర్సుల నుంచి ఎల్‌ఎన్‌జీ కోసం ఆర్డర్లు ఇచ్చాయి.

Advertisement
 
Advertisement
Advertisement