భలే రుచి! | - | Sakshi
Sakshi News home page

భలే రుచి!

May 16 2026 12:51 AM | Updated on May 16 2026 12:51 AM

కొండమామిడి తాండ్ర

పుల్లపుల్లగా.. తియ్యతియ్యగా.. నోట్లో వేసుకుంటే ఇట్టే కరిగిపోయే మన్యం మామిడి తాండ్రకు మళ్లీ టైం వచ్చింది. ఎటువంటి రసాయనాలు లేని ప్రకృతి సిద్ధమైన రుచి కావాలంటే.. గిరిజన పల్లెల్లో తయారయ్యే తాండ్రను రుచి తినాల్సిందే. ప్రస్తుతం మన్యంలో ఎటు చూసినా కొండ మామిడి పండ్ల గుజ్జుతో తాండ్రను తయారు చేసే పనుల్లో గిరిజన మహిళలు బిజీబిజీగా గడుపుతున్నారు. ఇక్కడి సంప్రదాయ రుచికి మార్కెట్‌లో డిమాండ్‌ మామూలుగా లేదు.

ముంచంగిపుట్టు: మన్యంలోని కొండ కోనల్లో, అటవీ ప్రాంతాల్లో సహజసిద్ధంగా లభించే మామిడి పండ్లతో తయారు చేసే తాండ్ర రుచి చూడాలే కానీ, మరెక్కడా దొరకదు. మన్యంలోని గిరిజన గ్రామాల్లో ప్రస్తుతం ఎటు చూసినా తాండ్ర తయారీ పనులే కనిపిస్తున్నాయి. ఎటువంటి రసాయనాలు కలపకుండా, కేవలం ఎండను నమ్ముకుని గిరిజన మహిళలు ఈ తాండ్రను తయారు చేస్తున్నారు.

సంతల్లో జోరుగా అమ్మకాలు

గిరిజన మహిళలు సంప్రదాయబద్ధంగా తయారు చేస్తున్న ఈ తాండ్రకు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. స్థానిక వారపు సంతల్లో కిలో రూ.100 నుంచి రూ.120 వరకు ధర పలుకుతున్నా, వినియోగదారులు ఆ రుచికి ఫిదా అయి ఎంత ధరైనా వెచ్చించి కొనుగోలు చేస్తున్నారు. మామిడి పండ్ల సీజన్‌ అయిపోయినప్పటికీ, ఈ తాండ్రను ఎక్కువ కాలం భద్రపరుచుకుని తినే వీలుండటంతో దీనికి డిమాండ్‌ ఏ మాత్రం తగ్గడం లేదు.

తయారీ విధానం..

మన్యం తాండ్ర తయారీలో గిరిజన కుటుంబాలు పడే శ్రమ ఎంతో ఉంటుంది. కొండ ప్రాంతాల్లోని అడవి మామిడి చెట్ల నుంచి రాలిపడిన పండ్లను ఇంటిల్లపాది ఉదయం, సాయంత్రం వేళల్లో వెళ్లి సేకరిస్తారు.వీటిని శుభ్రపరిచి పెద్ద డబ్బాలు లేదా బిందెల్లో వేస్తారు. రోకలితో దంచి మామిడి రసాన్ని వేరు చేస్తారు. తీసిన రసాన్ని చాపలు, చేటలు లేదా స్టీలు ప్లేట్లలో పలుచని పొరలుగా పోస్తారు.ఒక పొర ఆరిన తర్వాత మళ్లీ దానిపై మరో పొర వేస్తూ, ఇలా వారం నుంచి పది రోజుల పాటు ఎండలో ఆరబెడతారు. ఏ రకమైన రసాయనాలు లేదా కృత్రిమ రంగులు కలపకపోవడమే ఈ తాండ్ర విశిష్టత. పది పొరలు ఆరిన తరువాత వచ్చే తాండ్ర తింటే పుల్లపుల్లగా, తియ్యతియ్యగా ఉండి జిహ్వకు అమృతప్రాయంగా అనిపిస్తుంది. కొనుగోలుదారుల ఆసక్తిని గమనించిన గిరిజన మహిళలు, తమ ఆదాయాన్ని పెంచుకోవడానికి తాండ్ర ఉత్పత్తిని మరింత వేగవంతం చేస్తున్నారు.

ప్రకృతి సిద్ధమైన ఆహారం

జిహ్వకు అమృతప్రాయం

మార్కెట్లో మంచి డిమాండ్‌

గిరిజన పల్లెల్లో సందడి

Advertisement
 
Advertisement
Advertisement