పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పరిసరాల పరిశుభ్రత అందరి బాధ్యత

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

చింతపల్లి: గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకున్నప్పుడే ప్రజలంతా ఆరోగ్యంగా ఉండగలరని ఎంపీడీవో సీతామహాలక్ష్మి అన్నారు. శనివారం మండలంలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన లంబసింగి పంచాయతీ కేంద్రంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా గ్రామంలోని పురవీధుల్లో పరిసరాల పరిశుభ్రతపై విస్తృత అవగాహన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. గ్రామంలోని ప్రతి ఒక్కరూ తమ ఇళ్లతో పాటు పరిసరాలను కూడా శుభ్రంగా ఉంచుకోవాలని కోరారు. పర్యావరణానికి, ఆరోగ్యానికి తీవ్ర నష్టం చేకూరుస్తున్న ప్లాస్టిక్‌ వాడకాన్ని పూర్తిగా నిషేధించే విధంగా ప్రజలంతా అవగాహన కలిగి ఉండాలన్నారు. పంచాయతీ కార్యదర్శి ఉమాదేవి, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

జి.మాడుగుల: మండలంలోని అన్ని గ్రామాల్లో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇళ్లలో ఉద్భవించే తడి, పొడి చెత్తను విడివిడిగా వేరు చేసి పంచాయతీ వాహనాలకు అందించాలని ఎంపీడీవో డేవిడ్‌రాజ్‌ పిలుపునిచ్చారు. సోమవారం మండలంలోని అన్ని పంచాయతీ కేంద్రాల్లో పంచాయతీ అభివృద్ధి అధికారుల ఆధ్వర్యంలో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా జి.మాడుగుల కేంద్రంలో ఎంపీడీవో, పంచాయతీ కార్యదర్శి నేతృత్వంలో పురవీధుల్లో భారీ అవగాహన ర్యాలీ చేపట్టారు. అనంతరం స్థానిక ప్రధాన కూడలిలో (సెంటర్‌లో) భారీ మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని కోరారు. ఇళ్ల నుంచి వచ్చే వ్యర్థాలను రోడ్లపై వేయకుండా, పంచాయతీ స్వచ్ఛరథం వాహనాలకు మాత్రమే అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో, పీఆర్‌ ఏఈ మాణిక్యాలరావు, ఏపీఎం రుద్రరావు, ఏపీవో కొండబాబు, వెలుగు స్వయం సహాయక సంఘాల మహిళలు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

ప్లాస్టిక్‌ రహిత సమాజమే లక్ష్యం

కొయ్యూరు: రాష్ట్రాన్ని ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ముందుకు రావాలని మర్రిపాలెం మహిళా కళాశాల ప్రిన్సిపాల్‌ కె.సుధా పిలుపునిచ్చారు. శనివారం కళాశాల ఆవరణలో ’స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సమాజాన్ని ప్లాస్టిక్‌ రహితంగా నిర్మించడంలో భాగంగా మన పరిసరాల్లో ప్లాస్టిక్‌ వ్యర్థాలు లేకుండా చూసుకోవాలన్నారు. దీనివల్ల పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుందని, ప్రజలంతా పర్యావరణ హితమైన అలవాట్లను అలవర్చుకోవాలని సూచించారు. కళాశాల వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ వీకేటీ మహాలక్ష్మి మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ మహమ్మారి ప్రకృతి సమతుల్యతను తీవ్రంగా దెబ్బతీస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఒక్కసారి మాత్రమే వాడి పారేసే (సింగిల్‌ యూజ్‌) ప్లాస్టిక్‌ను పూర్తిగా నిలిపివేయడం ఎంతో మంచిదన్నారు. కళాశాల ఎన్‌ఎస్‌ఎస్‌ కో–ఆర్డినేటర్‌ డాక్టర్‌ రాజుబాబు మాట్లాడుతూ.. ప్లాస్టిక్‌ వల్ల నేల, నీరు, వాతావరణం పూర్తిగా కలుషితమవుతున్నాయని పేర్కొన్నారు. ప్లాస్టిక్‌ను వాడబోమంటూ కళాశాల అధ్యాపకులు, సిబ్బంది ప్రతిజ్ఞ చేశారు.

డుంబ్రిగుడ: మండల కేంద్రాన్ని ప్లాస్టిక్‌ రహితంగా తీర్చిదిద్దేందుకు వ్యాపారులు, ప్రజలు అటవీశాఖ, పంచాయతీ సిబ్బందికి పూర్తి స్థాయిలో సహకరించాలని ఎంపీడీవో విశ్వనాథ్‌ కోరారు. మండల కేంద్రంలో మూడో శనివారం నిర్వహించే స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్రకార్యక్రమంలో భాగంగా.. స్థానిక కిరాణా దుకాణాలు, హోటళ్లు, వ్యాపార సముదాయాల వద్ద ప్లాస్టిక్‌ నిషేధంపై శనివారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ.. ప్రస్తుతం కిరాణా దుకాణాలు, హోటళ్లు, చికెన్‌ సెంటర్ల వద్ద ప్లాస్టిక్‌ కవర్ల వినియోగం విపరీతంగా పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్లపై పారేసే ప్లాస్టిక్‌ కవర్లను ఆహారంగా భావించి తింటున్న మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్లాస్టిక్‌ మహమ్మారిని నివారించడమే ముఖ్య ఉద్దేశమని ఆయన పేర్కొన్నారు. వ్యాపారులు సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ కవర్లను వాడకూడదని, ప్రజలు కూడా ఇళ్ల నుంచి వచ్చేటప్పుడే గుడ్డ సంచులను తెచ్చుకోవాలని సూచించారు. పంచాయతీ కార్యదర్శులు విజయ్‌, గౌతమి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement