చింతపల్లి: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నాలుగు కార్మిక కోడ్‌లను వెంటనే రద్దు చేయాలంటూ సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు బోనంగి చిన్నయ్యపడాల్ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన జీవో ప్రతులను పారిశుధ్య కార్మికులతో కలిసి ఆస్పత్రి ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం కార్మికులపై కక్ష కట్టి నాలుగు కోడ్‌లను అమలు చేసేందుకు చూస్తుందన్నారు. ఆ కోడ్లు అమలు జరిగితే బ్రిటీష్ కాలంలో పోరాటం చేసి సాధించుకున్న 29 రకాల కార్మిక చట్టాలు రద్దవుతాయన్నారు. చట్టాలను రద్దు చేయాలని దేశ వ్యాప్తంగా 30 కోట్ల మంది రోడ్డెక్కి ఆందోళన చేసినా ఫలితం లేకపోయిందన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటాలకు కేంద్రం సరైన గౌరవం ఇవ్వడం లేదన్నారు. కోడ్లు అమలైతే ఎనిమిది గంటల పనిని 12 గంటలకు పొడిగిస్తారన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ పాలన చూస్తుంటే బ్రిటీష్ కాలంలో ఉన్నామన్న పరిస్థితి నెలకొందన్నారు. దీనిలో ఆస్పత్రి పారిశుధ్య కార్మికుల సంఘ అధ్యక్షుడు రామారావు, లక్ష్మి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


