అడవినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు అడ్డాకుల సేకరణ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడం లేదు. ప్రభుత్వం, జీసీసీ అడ్డాకులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో దళారీ వ్యాపారులదే రాజ్యమవుతోంది. ప్లాస్టిక్‌ నిషేధం నేపథ్యంలో అడ్డాకులకు మైదాన | - | Sakshi
Sakshi News home page

అడవినే నమ్ముకుని జీవిస్తున్న గిరిజనులకు అడ్డాకుల సేకరణ కష్టానికి తగ్గ ఫలితం ఇవ్వడం లేదు. ప్రభుత్వం, జీసీసీ అడ్డాకులకు కనీస మద్దతు ధర ప్రకటించకపోవడం, కొనుగోళ్లకు దూరంగా ఉండడంతో దళారీ వ్యాపారులదే రాజ్యమవుతోంది. ప్లాస్టిక్‌ నిషేధం నేపథ్యంలో అడ్డాకులకు మైదాన

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

సాక్షి, పాడేరు: తెలుగు రాష్ట్రాలతో పాటు పశ్చిమబెంగాల్‌, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలల్లో అడ్డాకులకు ఆదరణ బాగుంది. దీంతో అడ్డాకుల వ్యాపారం మన్యం సంతల్లో భారీగా జరుగుతోంది. అయితే గిరిజనులకు మాత్రం గిట్టుబాటు ధర లభించడం లేదు. అడవుల్లో ప్రాణాలకు తెగించి అడ్డాకులను సేకరిస్తున్న గిరిజనులు వాటిని బాగా ఆరబెట్టి, ఎండిన తరువాత కావిడలుగా కట్టి సంతలకు మోసుకెళ్లి అమ్మకాలు జరుపుతుంటారు. అడవుల్లో జంతువుల బెడదను కూడా తప్పించుకుని కష్టపడి అడ్డాకులను సేకరిస్తే ధరల విషయంలో మాత్రం అన్యాయం జరుగుతుంది.

వారపు సంతల్లో వ్యాపారుల దోపిడీ

ఏజెన్సీలోని వారపు సంతల్లో రెండు వారాలుగా అడ్డాకుల వ్యాపారం జరుగుతుంది. వంట్లమామిడి, హుకుంపేట, అరకు, సుంకరమెట్ట, డముకు, గుత్తులపుట్టు, జి.మాడుగుల, అన్నవరం, లోతుగెడ్డ, చింతపల్లి, దారకొండ వారపు సంతల్లో ప్రతి వారం రూ.లక్షల్లో అడ్డాకుల వ్యాపారం సాగుతుంది. గిరిజనులంతా మారుమూల గ్రామాల నుంచి అడ్డాకులను కాలినడకన సంతలకు తీసుకొచ్చి అమ్మకాలు జరుపుతున్నారు. కావిడ అడ్డాకుల(రెండు దిండ్లు)కు మైదాన ప్రాంతాలలో రూ.6 వేలు నుంచి రూ.8 వేల వరకు ధర ఉంది. అయితే ఎస్‌.కోట, గాజువాక, కొత్తకోట, నర్సీపట్నం వ్యాపారులు కేవలం రూ.3 వేల ధరకు మించి కొనుగోలు చేయకపోవడంతో గిరిజన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. కష్టానికి తగ్గ ఫలితం లేకపోవడంతో అడ్డాకులను అమ్మే గిరిజన రైతులంతా ఉసూరుమంటున్నారు. తక్కువ ధరకు భారీగానే కొనుగోలు చేస్తున్న వ్యాపారులు లారీలు, వ్యాన్లలో మైదాన ప్రాంతాలకు తరలించి మంచి లాభాలు పొందుతున్నారు.

కొనుగోలుకు జీసీసీ దూరం

గిరిజనుల అడవుల్లో సేకరించే అటవీ ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు కల్పించి కొనుగోలు చేయాల్సిన జీసీసీ.. 15 ఏళ్ల నుంచి దూరంగానే ఉంది. అడ్డాకులను జీసీసీ కొనుగోలు చేయకపోవడంతో సంతల్లో దళారీ వ్యాపారులదే రాజ్యంగా మారింది. ప్లాస్టిక్‌ నిషేధంతో అడ్డాకులకు మైదాన ప్రాంతాల్లో గిరాకీ పెరిగింది. హోటళ్లలో అడ్డాకులను అధికంగా వినియోగిస్తున్నారు. నగర ప్రాంతాల్లో హోటళ్ల యాజమానులు అడ్డాకులను వ్యాపారుల నుంచి అధిక ధరకే కొనుగోలు చేస్తున్నారు. ఆ మేరకు గిరిజనులకు ఆ ధర దక్కడం లేదు.

వంట్లమామిడి ఘాట్‌ రోడ్డులో అడ్డాకులను విక్రయిస్తున్న గిరిజనులు

ఏజెన్సీ సంతల్లో దళారుల దోపిడీ

మైదాన ప్రాంతాల్లో అడ్డాకులకు డిమాండ్‌

మన్యంలో గిట్టుబాటు ధర కరువు

కష్టానికి తగ్గ ఫలితమివ్వని అడ్డాకుల సేకరణ

ఉసూరుమంటున్న గిరిజనులు

జీసీసీ కొనుగోలు చేయాలి

అడ్డాకులకు సంతల్లో దళారీల బెడద ఉంది. పూర్వం వలే జీసీసీ అడ్డాకులను కొనుగోలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలి. మైదాన ప్రాంతాల్లో డిమాండ్‌ ఉన్న అడ్డాకులను తక్కువ ధరకు కొని మైదాన ప్రాంత వ్యాపారులు అధిక లాభాలు పొందుతున్నారు. గిరిజనులను మోసం చేయడం దారుణం.

– పాంగి లక్కు, గిరిజన రైతు సంఘం నేత, గుర్రగరువు, పాడేరు మండలం

గిట్టుబాటు ధర కల్పించాలి

ఏజెన్సీలోని సంతల్లో అడ్డాకులకు గిట్టుబాటు ధర కరువైంది. కావిడ అడ్డాకుల దిండును రూ.3 వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నాం. వ్యాపారులు సిండికేట్‌గా ఏర్పడి మోసం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి గిట్టుబాటు ధర కల్పించాలి.

– గొల్లోరి హిరమ్మ, సంతవలస గ్రామం,

డుంబ్రిగుడ మండలం

Advertisement
 
Advertisement
Advertisement