ఆర్గానిక్‌ జిల్లాగా తీర్చిదిద్దుతాం | - | Sakshi
Sakshi News home page

ఆర్గానిక్‌ జిల్లాగా తీర్చిదిద్దుతాం

May 17 2026 12:42 AM | Updated on May 17 2026 12:42 AM

కలెక్టర్‌ నిశాంతి

కిండంగిలో సంపద సృష్టి కేంద్రం

పరిశీలన

పారిశుధ్య కార్మికులు, క్లాప్‌ మిత్రలకు శానిటేషన్‌ పరికరాల పంపిణీ

పాడేరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణే ధ్యేయంగా ‘గ్రీన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఆఫ్‌ ఆంధ్ర’ విభాగాలను మరింత బలోపేతం చేయనున్నట్లు కలెక్టర్‌ నిశాంతి తెలిపారు. పాడేరు మండలంలోని కిండంగి పంచాయతీ కేంద్రంలో ఉన్న తడి, పొడి చెత్త ద్వారా సంపద సృష్టి కేంద్రాన్ని శనివారం ఆమె క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అనంతరం స్థానిక వీఆర్‌ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అధికారిక కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌తో కలిసి పాల్గొన్నారు.

పునరుత్పాదక ఇంధన పరిశ్రమలకు ప్రాధాన్యం

ఈ సందర్భంగా కలెక్టర్‌ నిశాంతి మాట్లాడుతూ.. పరిశుభ్రమైన, హరితాంధ్రప్రదేశ్‌ నిర్మాణంలో జిల్లాలోని ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. జిల్లాను వంద శాతం ఆర్గానిక్‌ (సేంద్రియ) జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం ఎంతో అవసరమన్నారు. పర్యావరణానికి ఎలాంటి హాని చేయని పునరుత్పాదక ఇంధన వనరుల వాడకానికి, అలాగే వ్యర్థాలను పునర్వినియోగం చేసే గ్రీన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ పరిశ్రమలకు జిల్లాలో ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. స్వచ్ఛతపై నిరంతర నిఘా ఉంచుతూ.. ప్లాస్టిక్‌ రహిత సమాజ స్థాపన, వ్యర్థాల నిర్మూలనకు నిర్దిష్ట కార్యాచరణతో ముందుకు వెళ్తున్నామని వివరించారు.

పారిశుధ్య కార్మికులకు రక్షణ పరికరాలు

జిల్లాను ప్లాస్టిక్‌ రహితంగా మార్చేందుకు ప్రజలంతా స్వచ్ఛందంగా సహకరించాలని కలెక్టర్‌ కోరారు. అనంతరం జిల్లాలో సేవలు అందిస్తున్న పారిశుధ్య కార్మికులకు, క్లాప్‌ మిత్రలకు వారి రక్షణ కొరకు చేతి తొడుగులు, గం బూట్లు, యూనిఫాం, శానిటేషన్‌ పరికరాలు, టోపీలు, మాస్క్‌లను కలెక్టర్‌ చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ, సీపీఆర్‌ కమిషన్‌ సీఈవో వెంకటేశ్వరరావు, డీపీవో చంద్రశేఖర్‌, స్థానిక అధికారులు, గ్రామసచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement