చోడవరం: పట్టణ శివారు అన్నవరం ప్రాంతంలో మంగళవారం అర్ధరాత్రి ప్రధాన విద్యుత్ వైర్లపై చెట్లకొమ్మలు పడి షార్ట్ సర్క్యూట్ జరగడంతో పలు ఇళ్లలో గృహోపకరణాలు దగ్ధమై సుమారు రూ.10 లక్షల నష్టం జరిగింది. 40 ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు కాలిపోవడంతో పాటు, ఈ ప్రాంతంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం విద్యుత్ శాఖ ఏఈ రాజుతోపాటు సిబ్బంది పరిశీలించారు. ఈ సందర్భంగా స్థానికులు ఏఈని చుట్టుముట్టి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధాన విద్యుత్‌లైన్లపై పలుచోట్ల చెట్ల కొమ్మలు తాకుతున్నాయని, దీనివల్ల సరఫరాలో తరుచూ అంతరాయం ఏర్పడుతోందని పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని, ఇప్పుడు ఏకంగా వైర్లపై కొమ్మలు పడి షార్ట్‌సర్క్యూట్‌తో తమ ఇళ్లలో ఫ్యాన్లు, ఫ్రిజ్‌లు, ఇతర గృహోపకరణాలు కాలిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. మొక్కుబడిగా విద్యుత్ శాఖ సిబ్బంది వచ్చి చూసి పోవడమే తప్ప ఏ పనీ సక్రమంగా చేయడంలేదని ఆరోపించారు. ఏపీఈపీడీసీఎల్ సీఎండీకి ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.
ఏఈ నిర్లక్ష్యం వల్లే...
అన్నవరం సబ్‌స్టేషన్ పరిధిలో నిత్యం ఏదో ఒక సమస్య ఉత్పన్నమై తరుచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్‌శాఖ ఏఈ నిర్లక్ష్యమే దీనికి ప్రధాన కారణంగా గతంలో అనేక ఫిర్యాదులు కూడా వెళ్లాయి. మండల సమావేశాల్లో సైతం ఎంపీటీసీలు, వార్డుమెంబర్లు ఇక్కడ ఏఈపై ధ్వజమెత్తినా మార్పురాకపోవడంపై ప్రజలు, ప్రజాప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా విద్యుత్ శాఖ ఉన్నతాధికారులు చర్యలుతీసుకుని విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూడాలని చోడవరం పట్టణ ప్రజలు కోరుతున్నారు.


