క్రీడా శిక్ష ణ కేంద్రాలకు విశేష స్పందన | - | Sakshi
Sakshi News home page

క్రీడా శిక్ష ణ కేంద్రాలకు విశేష స్పందన

May 11 2026 8:02 AM | Updated on May 11 2026 8:02 AM

ఆరోగ్యం, ఆత్మరక్షణ కల్పించేందుకు

యోగా, తైక్వాండోలో శిక్షణ

చోడవరం: వేసవి సెలవులు రావడంతో వివిధ క్రీడల్లో ప్రారంభమైన వేసవి శిక్షణ కేంద్రాలకు విద్యార్థుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఆయా విభాగాల స్పోర్ట్స్‌ యూనిట్లు ఇప్పటికే అన్ని కేంద్రాల్లో శిక్షణ ప్రారంభించాయి. ఆత్మరక్షణ, ఆరోగ్య రక్షణలకు కీలకంగా మారిన తైక్వాండో, యోగాలో జిల్లా వ్యాప్తంగా పలు కేంద్రాల్లో శిక్షణ ఇస్తున్నారు. 30రోజుల పాటు ఈ కేంద్రాలు నిర్వహించనున్నారు. తైక్వాండో అసోషియేషన్‌, చోడవరం పతంజలి యోగా కేంద్రాల ఆధ్వర్యంలో ఈ శిబిరాలు ప్రారంభమయ్యాయి.

తైక్వాండోలో...

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికీ ఆత్మరక్షణ చాలా అవసరం. అందులో బాలికల ఆత్మరక్షణ విషయంలో అప్రమత్తత అవసరమని భావించి స్పోర్ట్స్‌ అథారిటీ ఈ వేసవి శిక్షణ తరగతుల్లో తైక్వాండో క్రీడలకు ప్రాధాన్యం ఇచ్చింది. బాలబాలికలు కలిపి 30రోజుల పాటు శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ తైక్వాండో అసోసియేషన్‌ ఆధ్వర్వంలో జిల్లా తైక్వాండో అసోసియేషన్‌ జిల్లాలో ఐదు కేంద్రాల్లో తైక్వాండో జూడో క్రీడలపై శిక్షణ ఇచ్చేందుకు చర్యలు చేపట్టినట్టు అసోసియేషన్‌ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లం మురళి తెలిపారు. చోడవరం, అనకాపల్లిపట్టణం, అనకాపల్లిలో గాంధీనగరం, పరవాడ, బుచ్చెయ్యపేట(వడ్డాది) ప్రాంతాల్లో వేసవి ఉచిత శిక్షణ కేంద్రాలు ప్రారంభించారు. 5నుంచి 16సంవత్సరాల వయస్సు కలిగిన బాలబాలికలు ఈ శిక్షణ ఇస్తున్నారు. ఈనెల 1 నుంచి నెలాఖరు వరకూ నిర్వహించే శిక్షణ తరగతులకు విద్యార్థులు ఎంతో ఉత్సాహంతో హాజరవుతున్నట్టు మురళి తెలిపారు.

యోగాలో ..

అందరికీ ఆరోగ్యాన్ని అందించే యోగాలో శిక్షణ ఇచ్చేందుకు చోడవరం పతంజలి యోగా శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో ప్రత్యేక శిబిరం ప్రారంభించారు. ఇక్కడి ఉషోదయ విద్యాసంస్థల ప్రాంగణంలో ఉన్న యోగా కేంద్రంలో ఉచితంగా విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామని యోగా గురువు పుల్లేటి సతీష్‌ తెలిపారు. యోగా వల్ల విద్యార్థులకు సంపూర్ణ ఆరోగ్యం, శరీర సౌష్టవంతోపాటు ఏకాగ్రత లభిస్తుందన్నారు. ఈ కేంద్రాన్ని ఈనెల 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నామని ఆయన చెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement