శనివారం శ్రీ 9 శ్రీ మే శ్రీ 2026
సర్వం సిద్ధం!
ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు
సాక్షి, పాడేరు: ఉత్తరాంధ్ర గిరిజనుల ఆరాధ్య దైవం, పాడేరు మోదకొండమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలను మినీ జాతరను తలపించేలా ఘనంగా నిర్వహించేందుకు సర్వం సిద్ధమైంది. ఈ నెల 12న అమ్మవారి జన్మదినం సందర్భంగా, పాత సంప్రదాయాల ప్రకారం మే 10వ తేదీ ఆదివారం నుంచే ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఆలయ కమిటీ చైర్మన్, పాడేరు ఎమ్మెల్యే మత్స్యరాస విశ్వేశ్వరరాజు ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు ఈ వేడుకలు అత్యంత వైభవంగా జరగనున్నాయి.
తేదీల మార్పుపై కూటమి కుట్ర!
మోదకొండమ్మ ఉత్సవాలను మే 10, 11, 12 తేదీల్లో నిర్వహించాలని రెండు నెలల క్రితమే ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు అధ్యక్షతన కమిటీ నిర్ణయించింది. ఇందుకోసం సుమారు రూ.42 లక్షల వ్యయంతో కోల్‌కతా నుంచి ప్రత్యేక లైటింగ్, సాంస్కృతిక ప్రదర్శనలకు ఎమ్మెల్యే తన సొంత నిధులతో అడ్వాన్సులు కూడా చెల్లించారు. అయితే, వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా జరిగితే తమకు మైలేజీ రాదని భావించిన కూటమి ప్రభుత్వం, రాజకీయ కుట్రకు తెరలేపింది. భక్తుల మనోభావాలను పట్టించుకోకుండా, జిల్లా ఇన్‌చార్జి మంత్రి సంధ్యారాణి ఒత్తిడితో కలెక్టర్ ద్వారా ఉత్సవాల తేదీలను మే 17, 18, 19కి మారుస్తూ ప్రకటన చేయించారు. దీనిపై ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వ పెద్దలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా, అమ్మవారి పుట్టినరోజు వేడుకలను మాత్రం పాత తేదీల ప్రకారమే నిర్వహించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు.
ముస్తాబవుతున్న మోదమ్మ ఆలయం
వేడుకల నేపథ్యంలో మోదకొండమ్మ ఆలయం నూతన శోభను సంతరించుకుంది. అమ్మవారి మూలవిరాట్‌కు ప్రత్యేక రంగులు వేస్తున్నారు. ఆలయ ప్రాంగణాన్ని విద్యుత్ వెలుగులతో తీర్చిదిద్దనున్నారు. ఈనెల 10న ఆదివారం తెల్లవారుజామున 4 గంటలకే డప్పు వాయిద్యాల నడుమ ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, భక్తులు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు ప్రారంభిస్తారు. 11వ తేదీ సోమవారం లోక కల్యాణార్థం అమ్మవారికి ప్రత్యేక కుంకుమ పూజలు నిర్వహిస్తారు. 12వ తేదీ మంగళవారం ఉదయం 101 డప్పుల హోరుతో పాడేరు పట్టణంలో ఘటాల ఊరేగింపు ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటలకు భారీ అన్నసమారాధన, మధ్యాహ్నం 2 గంటల నుంచి అమ్మవారి ఉత్సవ విగ్రహం, పాదాల ప్రతిమలతో గ్రామ ప్రదక్షిణ జరుగుతుంది.
● రాత్రి వేళ పాత బస్టాండ్, ఆలయ ఆడిటోరియంలో భారీ సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారిక ఉత్సవాలను వాయిదా వేసినప్పటికీ, ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు తన సొంత ఖర్చుతో ఈ వేడుకలను నిర్వహిస్తుండటంపై భక్తుల నుంచి హర్షం వ్యక్తమవుతోంది.
పాత తేదీల ప్రకారమే
ఈనెల 10 నుంచి 12 వరకు నిర్వహణ
కూటమి సర్కారు తేదీల
మార్పుపై భక్తుల ఆగ్రహం
మూడు రోజుల పాటు ఆధ్యాత్మిక,
సాంస్కృతిక కార్యక్రమాలు
భక్తుల మనోభావాలు తగ్గట్టుగా చర్యలు


