సాక్షి, విశాఖపట్నం: దశాబ్దాల పోరాటం తర్వాత విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటవుతుందన్న సంతోషం నిరుద్యోగ యువతలో కనిపించడం లేదు. 2019లో జోన్ ఏర్పాటుపై ప్రకటన వెలువడినప్పటి నుంచి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు(ఆర్‌ఆర్‌బీ) ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం మౌనం వహిస్తూనే ఉంది. దీనిపై మొదటి నుంచి వైఎస్సార్ సీపీ ఆందోళన చేస్తున్నా.. టీడీపీ, జనసేన నుంచి ఆశించిన మద్దతు లభించలేదు. దీంతో కేంద్రం ఇక్కడ బోర్డు ఏర్పాటుపై కాలయాపన చేస్తోంది. జోన్ గెజిట్ నోటిఫికేషన్ విడుదలైనప్పటికీ, అందులో ఆర్‌ఆర్‌బీపై స్పష్టత ఇవ్వకపోవడం ఉత్తరాంధ్ర నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లినట్లయింది. దేశవ్యాప్తంగా 19 జోన్లలో 21 ఆర్‌ఆర్‌బీలు ఉండగా, విశాఖ విషయంలో మాత్రం సాంకేతిక కారణాల సాకుతో జాప్యం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తుండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
స్వయంప్రతిపత్తి లేని ‘పేపర్ జోన్’?
సాధారణంగా భారతీయ రైల్వేలో ఏ జోన్ ఏర్పడినా, ఆ పరిధిలో ఉద్యోగ నియామకాల కోసం ప్రత్యేకంగా ఒక ఆర్‌ఆర్‌బీ ఉంటుంది. కానీ కొత్తగా ఏర్పాటు చేసిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ విషయంలో కేంద్రం భిన్నమైన వైఖరిని అవలంబిస్తోంది. సికింద్రాబాద్, భువనేశ్వర్‌లలో ఇప్పటికే బోర్డులు ఉన్నాయని, వాటి ద్వారానే ఇక్కడి నియామకాలు చేపట్టవచ్చనేది అధికారుల వాదనగా కనిపిస్తోంది. అయితే, ఒక భారీ జోన్‌ను నిర్వహించేటప్పుడు దానికి స్వయంప్రతిపత్తి కలిగిన నియామక మండలి లేకపోతే, అది కేవలం ఒక ‘పేపర్ జోన్’గా మిగిలిపోయే ప్రమాదం ఉంది.
ఆర్‌ఆర్‌బీ ఇవ్వరెందుకు?
ప్రస్తుతం దేశవ్యాప్తంగా 19 ప్రధాన కార్యనిర్వాహక జోన్లు ఉండగా, ఆర్‌ఆర్‌బీలు మాత్రం 21 ఉన్నాయి. కొన్ని పెద్ద జోన్ల పరిధిలో ఒకటి కంటే ఎక్కువ బోర్డులు ఉండగా, మరికొన్ని బోర్డులు రెండు, మూడు జోన్ల అవసరాలను తీరుస్తున్నాయి. గతంలో వాల్తేరు డివిజన్ భువనేశ్వర్ బోర్డు పరిధిలో ఉండేది. కానీ ఇప్పుడు కొత్త జోన్ కేంద్రంగా విశాఖ అవతరించిన తర్వాత కూడా పాత బోర్డులపైనే ఆధారపడటం ఈ ప్రాంత అభ్యర్థుల ఉపాధి హక్కులను కాలరాయడమే అవుతుందనే వాదన వినిపిస్తోంది.
ఉత్తరాంధ్ర యువత ఉపాధికి ముప్పు
ఆర్‌ఆర్‌బీ విశాఖకు కేటాయించకపోతే నియామక ప్రక్రియ మొత్తం ఒడిశా లేదా తెలంగాణలోని బోర్డుల నియంత్రణలోకి వెళ్తుంది. దీని వల్ల నోటిఫికేషన్లు వెలువడినప్పుడు స్థానిక అవసరాల కంటే ఆయా బోర్డుల పరిధిలోని ఇతర ప్రాంతాలకే ప్రాధాన్యత లభించే అవకాశం ఉంది. ఉత్తరాంధ్ర అభ్యర్థులు తమ సొంత ప్రాంతంలోని రైల్వే లైన్లలో పని చేయాలన్నా.. ఇతర రాష్ట్రాల్లోని ఆర్‌ఆర్‌బీల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడనుంది. పరీక్షలు, దరఖాస్తుల పరిశీలన, వైద్య పరీక్షల కోసం అభ్యర్థులు వందల కిలోమీటర్ల దూరంలోని భువనేశ్వర్ లేదా సికింద్రాబాద్ వెళ్లడం భారంగా మారుతుంది. రైల్వే గ్రూప్–డి వంటి పోస్టులకు స్థానిక భాషా పరిజ్ఞానం కీలకం. ఇతర రాష్ట్రాల బోర్డులు నియామకాలు చేపట్టినప్పుడు, తెలుగు అభ్యర్థులకు సమాచారం చేరవేయడంలోనూ, ప్రశ్నపత్రాల రూపకల్పనలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీని వల్ల తెలుగు విద్యార్థులు సాంకేతికపరంగా వెనుకబడే ప్రమాదం ఉంది. రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు ఏర్పాటు అనేది కేవలం పరిపాలనాపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అది ఉత్తరాంధ్ర ఆత్మగౌరవంతో ముడిపడి ఉంది. కేవలం భవనాలు, ప్లాట్‌ఫాంలు పెంచితే అది అభివృద్ధి అనిపించుకోదు. స్థానిక యువతకు ఉపాధి దొరికినప్పుడే రైల్వే జోన్ కల సాకారమవుతుంది. తక్షణమే కేంద్రం స్పందించి విశాఖకు ప్రత్యేక ఆర్‌ఆర్‌బీ మంజూరు చేయాలని మేధావులు డిమాండ్ చేస్తున్నారు.
జోన్ ఇచ్చి.. బోర్డును విస్మరిస్తే ఎలా?
నేను గత మూడేళ్లుగా రైల్వే గ్రూప్–డీ, ఇతర పోటీ పరీక్షల కోసం శ్రమిస్తున్నాను. ఉత్తరాంధ్ర నిరుద్యోగుల కలలు నిజం కావాలంటే విశాఖలో ఆర్‌ఆర్‌బీ ఏర్పాటు చేయడం అత్యవసరం. స్థానికంగా బోర్డు అందుబాటులో లేకపోతే, ఉద్యోగ నోటిఫికేషన్లలో దొర్లే తప్పులను గానీ, ఫలితాల జాప్యాన్ని గానీ ప్రశ్నించే హక్కు అభ్యర్థులకు లేకుండా పోతుంది. ఏదైనా చిన్న సమస్య తలెత్తినా, ఫిర్యాదు చేయడానికి పొరుగు రాష్ట్రాల్లోని కార్యాలయాలకు వెళ్లడం మాలాంటి వారికి ఆర్థికంగా, మానసికంగా పెనుభారం. విశాఖను రైల్వే జోన్ కేంద్రంగా ప్రకటించి, ఆర్‌ఆర్‌బీని మాత్రం కేటాయించకపోవడం అంటే.. నియామకాల కోసం మమ్మల్ని మళ్లీ ఇతర రాష్ట్రాలపై ఆధారపడేలా చేయడమే.
– కె.అప్పారావు, రైల్వే ఉద్యోగ అభ్యర్థి
స్థానికతకు ప్రాధాన్యం పెరుగుతుంది
విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ వస్తుందని ప్రకటించినప్పుడు ఉత్తరాంధ్ర యువతలో ఎన్నో ఆశలు చిగురించాయి. కానీ ఇప్పుడు ఆర్‌ఆర్‌బీ ఏర్పాటుపై స్పష్టత లేకపోవడం తీవ్ర నిరాశకు గురిచేస్తోంది. ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు ప్రాధాన్యం దక్కాలంటే విశాఖలోనే సొంత బోర్డు ఏర్పాటు చేయాలి. ఒకవేళ భువనేశ్వర్ బోర్డు ద్వారానే రిక్రూట్‌మెంట్ ప్రక్రియ కొనసాగితే, వారు పరీక్ష కేంద్రాలను కూడా అక్కడే కేటాయించే అవకాశం ఉంది. దీని వల్ల స్థానిక అభ్యర్థుల కంటే ఇతర ప్రాంతాల వారికే ఎక్కువ వెసులుబాటు కలుగుతుంది. ఒక స్వతంత్ర జోన్‌కు స్వయంప్రతిపత్తి కలిగిన నియామక బోర్డు లేకపోతే, అది అధికారాలు లేని కేవలం ఒక నామమాత్రపు కార్యాలయంగానే మిగిలిపోతుంది.
– ఎం.మన్మధరావు, ఉద్యోగార్థి


