కాఫీ రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

కాఫీ రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యం

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

గిరిజనుల జీవితాల్లో గణనీయమైన మార్పు

కీలకపాత్ర పోషించిన ఆర్‌వీ నగర్‌

ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం

50 వేల మెట్రిక్‌ టన్నులకు ఉత్పత్తికి పెంచుతాం

సాగు విస్తీర్ణం 4 లక్షల ఎకరాలకు పెంచేలా ప్రణాళికాపరంగా చర్యలు

కాఫీ బోర్డు రాష్ట్ర కార్యదర్శి కూర్మారావు

అరకులో ఘనంగా స్వర్ణోత్సవ వేడుకలు

లోగోను ఆవిష్కరించిన అతిథులు

1అరకులోయ టౌన్‌: గిరిజనుల జీవితాల్లో ఆర్‌వీ నగర్‌ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం గొప్ప మార్పును తీసుకువచ్చిందని కాఫీ బోర్డు రాష్ట్ర కార్యదర్శి కూర్మరావు అన్నారు. గురువారం కేంద్ర కాఫీ బోర్డు ఆధ్వర్యంలో స్థానిక పున్నమి హరిత వ్యాలీ రిసార్ట్స్‌లోని గోష్టి సమావేశ మందిరంలో ఆర్‌వీ నగర్‌ ప్రాంతీయ కాఫీ పరిశోధన కేంద్రం స్వర్ణోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ప్రస్తుతం జిల్లాలో 15 వేల మెట్రిక్‌ టన్నులుగా ఉన్న కాఫీ ఉత్పత్తిని 50 వేల మెట్రిక్‌ టన్నులకు పెంచడమే లక్ష్యమని తెలిపారు. ఇందుకోసం ప్రస్తుతం ఉన్న 2.15 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణాన్ని 4 లక్షల ఎకరాలకు పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. అధునాతన సాంకేతికతను ఉపయోగించి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు పేర్కొన్నారు.

సేంద్రియ జిల్లాగా తీర్చిదిద్దుతాం: కలెక్టర్‌ నిశాంతి

కాఫీతో పాటు హార్టికల్చర్‌ సాగును కూడా ప్రోత్సహిస్తామని, జిల్లాను పూర్తిస్థాయి సేంద్రియ వ్యవసాయ జిల్లాగా తీర్చిదిద్దుతామని కలెక్టర్‌ టి.నిశాంతి ప్రకటించారు. అరకు కాఫీకి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చేందుకు కృషి చేస్తామని, ఇక్కడి నమూనాను స్ఫూర్తిగా తీసుకుని ఒడిశాలోని మరో 8 జిల్లాల్లో కాఫీ సాగుకు అక్కడి అధికారులు ఆసక్తి చూపుతున్నారని ఆమె తెలిపారు.

మొదటి స్థానమే లక్ష్యం: కాఫీ బోర్డు డైరెక్టర్‌ భార్గవి

వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం కారణంగా అరకు కాఫీ ఆశించిన స్థాయిలో గుర్తింపు పొందలేక వెనుకబడిందని కాఫీ బోర్డు డైరెక్టర్‌ భార్గవి అభిప్రాయపడ్డారు. దేశంలో కాఫీ ఉత్పత్తిలో కర్ణాటక మొదటి స్థానంలో ఉండగా, ఆంధ్రప్రదేశ్‌ రెండో స్థానంలో ఉందని.. భవిష్యత్తులో మన రాష్ట్రం ప్రథమ స్థానానికి చేరుకోవాలంటే అన్ని శాఖలు కలిసి పనిచేయాలని సూచించారు.

లోగో ఆవిష్కరణ

ఈ సందర్భంగా స్వర్ణోత్సవ వేడుకల లోగో, థీమ్‌ను అతిథులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో కాఫీ బోర్డు డైరెక్టర్‌ చందుల్‌ కుమార్‌, బెంగళూరు ఐహెచ్‌ఆర్‌ డైరెక్టర్‌ తుషార్‌ కాంతి బెహరా, కాఫీ బోర్డు చైర్మన్‌ ఎంజే దినేష్‌, జీసీసీ ఎండీ శేఖర్‌ బాబు, ఆంధ్రా, ఒడిశా రాష్ట్రాలకు చెందిన అధిక సంఖ్యలో కాఫీ రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement