13వ తేదీలోగా గిరిజన హోంస్టే క్లస్టర్ల గుర్తింపు | - | Sakshi
Sakshi News home page

13వ తేదీలోగా గిరిజన హోంస్టే క్లస్టర్ల గుర్తింపు

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

జేసీ తిరుమణి శ్రీపూజ

అధికారులతో సమీక్ష సమావేశం

సాక్షి, పాడేరు: పీఎం దాజుగౌ పథకంలో భాగంగా జిల్లాలో హోంస్టే క్లస్టర్లను ఈ నెల 13వ తేదీలోగా గుర్తించాలని జాయింట్‌ కలెక్టర్‌ తిరుమణి శ్రీపూజ అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌లో తహసీల్దార్లు, ఎంపీడీవోలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజన సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేస్తూ స్థానిక మహిళలు, యువతకు ఆర్థిక స్వావలంబన కల్పించడమే ఈ పథకం ముఖ్య ఉద్దేశమన్నారు. చింతపల్లి మండలం లంబసింగి, అరకులోయ, డుంబ్రిగుడ కేంద్రాలుగా మూడు హోంస్టే క్లస్టర్లను గుర్తించి, సమగ్ర వివరాలు సేకరించాలన్నారు. తహసీల్దార్లు, ఎంపీడీవోలంతా గిరిజన గ్రామాలను సందర్శించి, పర్యాటకానికి అనువైన క్లస్టర్లను గుర్తించాలన్నారు. గిరిజన గ్రామాల్లో మౌలిక సదుపాయాలు, భద్రత, పర్యాటకుల ఆకర్షణ వంటి ఆంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. అరకు, డుంబ్రిగుడ, అనంతగిరి, చింతపల్లి మండలాల్లో పైలట్‌ ప్రాజెక్ట్‌గా హోంస్టేలను చేపడుతున్నామన్నారు. 100 శాతం నిధులను కేంద్ర ప్రభుత్వమే అందిస్తుందన్నారు. కొత్త గదుల నిర్మాణాలకు రూ.5 లక్షలు, ఇళ్లు ఉండి మరమ్మతులకు రూ.3 లక్షలు, పర్యాటకుల వసతుల అభివృద్ధి పనులకు రూ.5 లక్షలు మంజూరు చేస్తామని ఆమె తెలిపారు. ఈ సమావేశంలో ఐటీడీఏ పీవో ఆదిత్యవర్మ, జిల్లా టూరిజం అధికారి దాసు, తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో సరిపడా

గ్యాస్‌ నిల్వలు

జిల్లాలోని అన్ని గ్యాస్‌ ఏజెన్సీలలో సరిపడా గ్యాస్‌ నిల్వలు ఉన్నాయని, వినియోగదారులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జేసీ తిరుమణి శ్రీపూజ తెలిపారు. గ్యాస్‌ బుకింగ్‌ ప్రక్రియ అనంతరం ఓటీపీ వచ్చిన వారంతా గ్యాస్‌ పొందాలన్నారు. గ్యాస్‌ సిలెండర్ల పంపిణీలో ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆమె కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement