ఓ(ఆ)న్‌ డ్యూటీ! | - | Sakshi
Sakshi News home page

ఓ(ఆ)న్‌ డ్యూటీ!

May 10 2026 8:16 AM | Updated on May 10 2026 8:16 AM

ఐఐఎం మేధావుల సేవలు అధికారుల వ్యక్తిగత పనులకే పరిమితం

పోర్టు ట్రాఫిక్‌ విభాగం ఆధీనంలో మార్కెటింగ్‌ వ్యవస్థ నిర్వీర్యం

వ్యాపార విస్తరణ పక్కనపెట్టి ‘సొంత’ సేవలకే వినియోగం

సామర్థ్యం పెరిగినా సరకు రవాణాలో ఆశించిన వృద్ధి శూన్యం

సాక్షి, విశాఖపట్నం: దేశంలోని ప్రధాన పోర్టులతో పోటీపడుతూ సముద్ర వాణిజ్య రంగంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విశాఖపట్నం పోర్టు.. ప్రస్తుతం కొందరు అధికారుల ‘సొంత’ ప్రయోజనాలకు వేదికగా మారుతోంది. పోర్టు ప్రగతిని పరుగులు పెట్టించాల్సిన యంత్రాంగం, దిశానిర్దేశం లేక చతికిలపడుతోంది. ముఖ్యంగా మార్కెటింగ్‌ విభాగం పరిస్థితి ‘అడకత్తెరలో పోకచెక్క’లా తయారైంది. ఏటా ప్రతిష్టాత్మక ఐఐఎంల నుంచి మేధావులను నియమించుకుంటున్నా, వారి మేధస్సు పోర్టు అభ్యున్నతికి కాకుండా.. ట్రాఫిక్‌ విభాగాధికారుల వ్యక్తిగత పనులకు పరిమితమవ్వడం విస్మయానికి గురిచేస్తోంది. విధి నిర్వహణలో ఉండాల్సిన సిబ్బందిని అధికారుల సొంత పనులకు వినియోగించుకుంటూ ‘ఆన్‌ డ్యూటీ’ని కాస్తా ‘ఓన్‌ డ్యూటీ’గా మార్చేయడం పోర్టు భవిష్యత్తును అంధకారంలోకి నెడుతోంది.

ప్రచారమెక్కడ? ప్రగతి ఏది?

ఒక సంస్థ అభివృద్ధి చెందాలంటే కేవలం మౌలిక సదుపాయాలు ఉంటే సరిపోదు.. ఆ వసతులను ప్రపంచానికి చాటిచెప్పే బలమైన ప్రచార యంత్రాంగం ఉండాలి. విశాఖ పోర్టులో కంటైనర్‌ టెర్మినల్‌ సహా తొమ్మిది సంస్థలు కార్గో నిర్వహణలో పాలుపంచుకుంటున్నాయి. నిజానికి ఈ సంస్థల నుంచి కార్గో ఉత్పత్తి పెరగాలంటే పోర్టు యాజమాన్యం చొరవ చూపాలి. ఎప్పటికప్పుడు వాణిజ్య వర్గాలతో సమావేశమై, ‘ట్రేడ్‌ మీట్స్‌’ నిర్వహిస్తూ ఎగుమతి, దిగుమతిదారులకు అవసరమైన సౌకర్యాలపై చర్చించాలి. కానీ, ఇక్కడ పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. పోర్టు ఆదాయంలో 90 శాతం కేవలం భూములు, భవనాల లీజుల ద్వారానే వస్తోంది తప్ప, సరకు రవాణా నిర్వహణ ద్వారా వచ్చే ఆదాయ వృద్ధి శూన్యం. కార్గో నిర్వహణ చేసే ప్రైవేటు సంస్థలు వృద్ధి సాధిస్తున్నా, దానివల్ల పోర్టుకు రావాల్సిన రాబడి పెరగకపోవడం అధికారుల ఉదాసీనతకు నిలువెత్తు నిదర్శనం.

ఐఐఎం మేధస్సు.. ఫైళ్లకే పరిమితం

పోర్టు కార్యకలాపాలను విస్తరించాలని, అంతర్జాతీయ స్థాయి విక్రయ వ్యూహాలను రచించాలని ప్రతి రెండేళ్లకోసారి ఐఐఎం నిపుణులను నియమించుకుంటున్నారు. వీరిని మార్కెటింగ్‌ ప్రమోషన్‌ కోసం వినియోగించాల్సి ఉండగా, ట్రాఫిక్‌ విభాగాధికారులు వీరిని తమ వ్యక్తిగత వ్యవహారాలు చూసుకునే ‘అసిస్టెంట్లు’గా మార్చేసుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్యాలయ ఫైళ్లను సిద్ధం చేయడం, అధికారుల ఇంటి పనులు, వ్యక్తిగత పనులు చక్కబెట్టడానికే వీరి సమయం సరిపోతోందని సమాచారం. పోర్టు మార్కెటింగ్‌కు ఊపిరి పోయాల్సిన నిపుణులను ఇలా వినియోగించుకోవడం వల్ల కొత్త వ్యాపార అవకాశాలన్నీ పక్కదారి పడుతున్నాయి.

సామర్థ్యం ఉన్నా.. సాఫల్యమెక్కడ?

కాగితాల్లో పోర్టు సామర్థ్యం అద్భుతంగా పెరుగుతోంది. 2008–09లో 80 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులుగా ఉన్న సామర్థ్యం ఇప్పుడు 120 మిలియన్‌ టన్నులకు చేరింది. కానీ, ఆ సామర్థ్యానికి తగ్గట్టుగా కార్గో నిర్వహణ జరుగుతుందా అంటే సమాధానం ‘లేదు’ అనే వస్తోంది. ఉదాహరణకు కంటైనర్‌ టెర్మినల్‌ సామర్థ్యం 1.3 మిలియన్‌ టీయూవీలు కాగా, ప్రస్తుతం అందులో సగం కూడా వాడకం జరగడం లేదు. ఇతర ప్రాంతాలకు మళ్లుతున్న కార్గోను ఆకర్షించేలా దూకుడుగా వ్యవహరించాల్సిన పోర్టు ట్రాఫిక్‌ విభాగం.. నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న సరకు రవాణా వృద్ధి కూడా అక్కడ ఉన్న ప్రైవేటు సంస్థల సొంత ప్రయత్నాలే తప్ప, పోర్టు అధికారుల చొరవ ఏమాత్రం లేదన్నది బహిరంగ రహస్యం.

నిర్లక్ష్యం నీడలో ‘సాగర’ వాణిజ్యం

పోర్టుకు వచ్చే నౌకలు బెర్తుల కోసం రోజుల తరబడి బయటే వేచి చూడాల్సిన దైన్యం నెలకొంది. ట్రాఫిక్‌ విభాగంపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో, అక్కడ అధికారులదే రాజ్యంగా మారింది. సంస్థ ప్రయోజనాల కంటే వ్యక్తిగత లాభాలకే పెద్దపీట వేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ట్రేడ్‌ మీట్‌లు నిర్వహించి పోర్టు సౌకర్యాలను వివరించాల్సిన బాధ్యతను గాలికొదిలేశారు. ఎక్కడో ఒకచోట ఏడాదికో, రెండేళ్లకోసారి తూతూమంత్రంగా సమావేశాలు పెట్టి చేతులు దులిపేసుకుంటున్నారు. మార్కెటింగ్‌ విభాగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసి, ట్రాఫిక్‌ మేనేజ్‌మెంట్‌ విభాగమే సర్వస్వంగా వ్యవహరిస్తోంది. అధికారుల ఈ ‘సొంత’ పోకడల వల్ల విశాఖ పోర్టు అపారమైన నష్టాన్ని చవిచూస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, మార్కెటింగ్‌ విభాగానికి పూర్తి స్వేచ్ఛనిచ్చి, పోర్టు ప్రగతికి బాటలు వేయకపోతే.. విశాఖ పోర్టు తన పూర్వ వైభవాన్ని కోల్పోయే ప్రమాదం ఉందని పోర్టు వర్గాలే ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

Advertisement
 
Advertisement
Advertisement