రైతులంటే ఇంత చులకనా...? | - | Sakshi
Sakshi News home page

రైతులంటే ఇంత చులకనా...?

May 12 2026 12:50 AM | Updated on May 12 2026 12:50 AM

గోవాడ రైతుల సమస్యలపై ప్రభుత్వ స్పందనేదీ..

బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు..

వచ్చే సీజన్‌కు చెరకు వేయాలా..వద్దా..

మరో ఉద్యమానికి సిద్ధం కావాల్సిందే..

చోడవరంలో రైతుల అత్యవసర సమావేశం

చోడవరం : గోవాడ చెరకు రైతులు ఉద్యమానికి మరోసారి సిద్ధమౌతున్నారు. రైతు సంఘాల నాయకులు, పలు రైతు ఉద్యమకారులు కలిసి చోడవరంలో బుధవారం సమావేశమయ్యారు. భారతీయ జనతాపార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు, రైతు ఉద్యమకారుడు ఎ.ఆర్‌.జి శర్మ ఇంటి వద్ద రైతు సంఘాల నాయకులంతా హాజరయ్యారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని వారంతా తప్పుబడ్డారు. రైతులంటే ప్రభుత్వానికి చాలా చులకనగా ఉందని, మరోసారి ఉద్యమానికి చెరకు రైతులు, గోవాడ సుగర్‌ ఫ్యాక్టరీ కార్మికులంతా సిద్ధం కావాలంటూ ఈ సమావేశం నిర్ణయించింది. అవసరమైతే రైతుల తరపున న్యాయపోరాటానికై నా వెళదామని ఏ.ఆర్‌.జి శర్మ ఈ సందర్భంగా రైతు సంఘాల నాయకులకు తెలిపారు. పార్టీలు, రాజకీయాలు ముఖ్యం కాదని, 24 వేల మంది చెరకు రైతులు, కార్మికుల జీవన్మరణ సమస్యగా మారిన గోవాడ ఫ్యాక్టరీని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికే మొదటి దశ ఉద్యమం చేసినప్పటికీ స్థానిక ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీ మేరకు ఉద్యమాన్ని తాత్కాలికంగా ఆపడం జరిగిందని, వారి హామీ మేరకు ఏమీ జరగకపోవడంతో మరోసారి ఉద్యమానికి అంతా సిద్ధమవ్వాలని నిర్ణయించారు. చెరకు రైతుల బకాయిలు, కార్మికుల జీత బకాయిలు రూ. 30 కోట్లు వరకూ ఫ్యాక్టరీ చెల్లించాల్సి ఉందని, అవి ఇప్పటి వరకూ చెల్లించలేదని, అంతేకాకుండా వచ్చే సీజన్‌ గానుగాట ఆడిందీ లేనిదీ ఏమీ చెప్పకపోవడంతో రైతులు చెరకు పంట వేయాలా వద్దా అనే మీమాంశలో ఉన్నారని, అదీ ప్రభుత్వం తేల్చలేదని సమావేశంలో రైతు సంఘాల నాయకులు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ఇప్పటికై నా వీటిపై ప్రభుత్వం ఒక ప్రకటన చేయకపోతే త్వరలోనే రెండో దశ ఉద్యమం చేయడానికి అంతా సిద్ధంగా ఉండాలని సమావేశం నిర్ణయించింది. సమావేశంలో రైతు సంఘం జిల్లా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డిపల్లి అప్పలరాజు, జనసేన నియోజకవర్గ నాయకుడు జెర్రిపోతుల నానాజీ, రైతు సంఘాల ప్రతినిధులు మహాలక్ష్మినాయుడు, దాడి అమర్‌, పెదబాబు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement