● జీసీసీ చైర్మన్ శ్రవణ్‌కుమార్ వివాహ వేడుకకు హాజరైన మంత్రి లోకేష్
● వెలవెలబోయిన పర్యటన
● బెడిసికొట్టిన పచ్చనేతల ప్రయత్నాలు
పాడేరు: రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పాడేరు పర్యటన ఆశించిన స్థాయిలో సాగలేదు. జీసీసీ చైర్మన్ కిడారి శ్రవణ్‌కుమార్ వివాహ వేడుకకు బుధవారం హాజరైన మంత్రికి స్వాగతం పలికేందుకు జనం కరువయ్యారు. మంత్రి మెప్పు పొందేందుకు స్థానిక టీడీపీ నేతలు చేసిన జనసమీకరణ ప్రయత్నాలు బెడిసికొట్టాయి.
బస్సులు ఉన్నా.. జనం లేరు!
పట్టణ శివారులోని తుమ్మరమెట్ట వద్ద జరిగిన ఈ వివాహ వేడుకకు లోకేశ్ వస్తున్నారని తెలియడంతో, ఎలాగైనా భారీ జనసమీకరణ చూపాలని పచ్చనేతలు భావించారు. హెలీప్యాడ్ నుంచి వేదిక వరకు జనం లేకపోతే అబాసుపాలవుతామని భయపడి, మైదాన ప్రాంతాలతో పాటు పాడేరు డిపో నుంచి ఏకంగా 64 ఆర్టీసీ బస్సులను సమకూర్చుకున్నారు. సాధారణంగా వివాహ వేడుకలకు అభిమానంతో జనం రావాలి.. కానీ ఇక్కడ పరిస్థితి భిన్నంగా ఉంది. పాడేరు, హుకుంపేట మండలాల్లో తిప్పిన ఈ బస్సుల్లో జనం రాక సీట్లన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. లోకేష్ అసంతృప్తి చెందుతారనే భయంతో అక్కడక్కడ ఉన్న కొద్దిమందిని హెలీప్యాడ్ వద్ద అటు ఇటుగా నిలబెట్టి హడావుడి చేశారు. మంత్రి పర్యటన కోసం బస్సుల్లో వచ్చిన కొద్దిమందికి, వివాహానికి వచ్చిన అతిథులకు సరైన భోజన సదుపాయాలు కల్పించడంలో నిర్వాహకులు విఫలమయ్యారు. దీంతో అసంతృప్తితో వెనుదిరిగారు. మరోవైపు, వర్తనాపల్లి గ్రామంలో కొంతమంది యువకులు మంత్రి లోకేష్‌ను కలిసి జీవో నంబరు3ను పునరుద్ధరించాలని వినతిపత్రం అందజేశారు.
స్తంభించిన ట్రాఫిక్..
లోకేష్ పర్యటన నేపథ్యంలో పోలీసులు భారీగా మోహరించినప్పటికీ, ట్రాఫిక్ నియంత్రణను గాలికి వదిలేశారు. వాహనాల రద్దీ పెరగడంతో గంటల తరబడి ట్రాఫిక్ జామ్ ఏర్పడి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అట్టహాసంగా ప్రచారం చేసుకున్న లోకేష్ పర్యటన, జన సమీకరణ వైఫల్యంతో చప్పగా ముగిసింది.


