పిడుగుపాటుకు మూడు ఆవుల మృతి | - | Sakshi
Sakshi News home page

పిడుగుపాటుకు మూడు ఆవుల మృతి

May 15 2026 10:20 AM | Updated on May 15 2026 10:20 AM

● విలువ రూ.2 లక్షలు ● కన్నీరుమున్నీరవుతున్న బాధితులు ● ప్రభుత్వం ఆదుకోవాలని వినతి

జి.మాడుగుల: మండలంలోని సింగర్భ పంచాయతీ కంబాలుబయలు గ్రామంలో గురువారం సాయంత్రం ప్రకృతి ప్రకోపం చోటుచేసుకుంది. ఉరుములు, మెరుపులు, భీకర శబ్దాలతో కూడిన పిడుగుపాటుకు ఇద్దరు గిరిజన రైతులకు చెందిన మూడు ఆవులు మృతి చెందాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కంబాలుబయలు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతానికి పశువులను మేత కోసం తోలుకెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి భారీ శబ్దాలతో పిడుగులు పడ్డాయి. ఈ ప్రమాదంలో మేత మేస్తున్న పశువులపై పిడుగు పడటంతో కిముడు బొజ్జాచారికి చెందిన రెండు ఆవులు, కొమ్మంగి మత్స్యలింగంకు చెందిన ఒక ఆవు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. మృతి చెందిన ఆవుల విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. పశువులే తమకు జీవనాధారమని, పిడుగుపాటుతో తాము తీవ్రంగా నష్టపోయామని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి, తమకు తగిన నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బాధిత గిరిజన రైతులు వేడుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement