విశాఖ నగరంలో అంతర్రాష్ట్ర దొంగల పంజా
పట్టపగలే స్నాచింగ్‌ల జోరు
4 గంటల వ్యవధిలో
4 చోట్ల చైన్ స్నాచింగ్ కేసులు
నిద్ర పోయిన నిఘా నేత్రాలు
సిటీ చుట్టూ 13,485 సీసీ కెమెరాలు
దాదాపు 5 వేలకు పైగా కెమెరాలు కునుకు
ఇదే అదనుగా రెచ్చిపోతున్న
‘బంగారు’దొంగలు
● ఉదయం 7.45 గంటలు.. జ్యోతి నగర్.. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లి మొదటి సవాల్ విసిరారు.
● ఉదయం 8.05 గంటలు.. పంజాబ్ హోటల్ జంక్షన్‌లో మహిళ మెడలోంచి చైన్ తెంచేసి పారిపోయి హడలెత్తించారు.
● ఉదయం 8.15 గంటలు కంచరపాలెం జయభారత్‌నగర్‌లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళే లక్ష్యంగా చైన్ అపహరించిన దొంగలు రెప్పపాటులో మాయమయ్యారు.
● ఉదయం 11.30 గంటలు... విమాన్‌నగర్ బస్టాప్ వద్ద బస్ కోసం ఎదురు చూస్తున్న మహిళ మెడలో గొలుసు లాక్కుని పరారైపోయారు.
నగరంలో
చైన్ స్నాచింగ్
కేసులు
మార్చిలో 7
ఏప్రిల్‌లో 5
మే 13 వరకూ 4
సాక్షి, విశాఖపట్నం: మహానగరంలో ‘గోల్డ్’వేట మొదలైంది. గన్ పట్టుకున్న వేటగాడు అడవిలో పొంచి ఉన్నట్టు.. బైక్ ఎక్కిన దొంగలు.. జనం మధ్యే ‘స్నాచింగ్’పంజా విసిరారు. నాలుగు గంటల వ్యవధిలో 13 తులాల బంగారాన్ని కొట్టేశారు. నిన్న మొన్నటి వరకు ప్రశాంతంగా ఉన్న విశాఖ వీధులు ఇప్పుడు ‘గోల్డ్ హంటర్స్’దూకుడుతో ఉలిక్కిపడుతున్నాయి. కేవలం నాలుగు గంటల వ్యవధిలో, నాలుగు వేర్వేరు ప్రాంతాల్లో హంటర్స్ చేసిన హడావుడి చూస్తుంటే.. పోలీసుల నిఘా వ్యవస్థకు గట్టి సవాల్ విసిరినట్టే కనిపిస్తోంది.
టైమ్ ఫిక్స్.. టార్గెట్ గోల్డ్.!
బుధవారం ఉదయం నుంచి జరిగిన చైన్‌స్నాచింగ్ కేసుల్లో దొంగల రూట్ మ్యాప్ చూస్తే ఎవరికై నా ఆందోళన కలగాల్సిందే. వచ్చింది ద్విచక్ర వాహనంపై.. పోయింది సుమారు 13 తులాల పసిడి. బాధితులు లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్‌కు పరుగులు పెట్టారు. అయితే.. నాలుగు చోట్లా చేసింది ఒక్కరేనా.. లేదా అంతర్రాష్ట్ర ముఠా పనా అనే సందేహం అందరిలోనూ కలుగుతోంది.
‘నిఘా’నేత్రాలు నిద్రపోతున్నాయా.?
నగర రక్షణ కోసం సిటీలో ఏర్పాటు చేసిన ‘మూడో కన్ను(సీసీ కెమెరాలు)’అనేక చోట్ల రెప్పవాల్చిన విషయం చైన్ స్నాచింగ్ ముఠా పసిగట్టినట్లుందనే వదంతులు వినిపిస్తున్నాయి. సేఫ్ సిటీగా ఉన్న విశాఖ నగరం.. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో గోల్డ్ హంటర్స్ సిటీగా మారిపోయిందనడంలో ఎలాంటి సందేహం లేదు. విశాఖ సిటీ పోలీస్ అధికారిక గణాంకాల ప్రకారం... నగర వ్యాప్తంగా 13,485 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అధికారిక రికార్డులు, కమాండ్ కంట్రోల్ సెంటర్ డేటా, ఇటీవల పోలీస్ శాఖ నిర్వహించిన అంతర్గత ఆడిట్ నివేదికల ప్రకారం.. వీటిలో పోలీస్ శాఖవే కాకుండా ‘నేను సైతం’ప్రోగ్రామ్ కింద ప్రజలు, షాపుల యజమానులు పెట్టినవి కూడా ఉన్నాయి. వీటిలో ఎన్ని కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు సిగ్నల్ పంపుతున్నాయనే లైవ్ స్టేటస్ ద్వారా దాదాపు 40 శాతం అంటే 5,394 సీసీ కెమెరాలు మాత్రమే వర్కింగ్ కండిషన్‌లో ఉన్నాయని గుర్తించారు. ఇదే.. దొంగలకు అనువుగా మారిందనే అనుమానాలు బలపడుతున్నాయి.
పోలీసుల యాక్షన్ ప్లాన్ షురూ..!
వరుస ఘటనలతో అప్రమత్తమైన నగర పోలీసులు నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాల్ని రంగంలోకి దించారు. గతంలో జరిగిన చైన్ స్నాచింగ్ కేసుల్లో అంతర్రాష్ట్ర ముఠా సభ్యులే నిందితులు కావడంతో.. బుధవారం జరిగిన చోరీలు కూడా వారి పనేనని ప్రాథమికంగా నిర్ధారించారు. సరిహద్దుల్లో తనిఖీలు చేపట్టడంతో పాటు, పనిచేస్తున్న కొన్ని కెమెరాల ఫుటేజీ ఆధారంగా నిందితుల వేటలో నిమగ్నమయ్యారని పోలీస్ వర్గాలు చెబుతున్నాయి. బంగారం ధరలు పెరిగినప్పటి నుంచి చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా జరుగుతుండటం పోలీసులకు తలనొప్పిగా మారింది. వీలైనంత త్వరగా గోల్డ్ హంటర్స్‌ని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కమిషనరేట్ వర్గాలు తెలిపాయి.


