జిల్లా కేంద్రం..
పాడేరు రూరల్: జిల్లా కేంద్రమైన పాడేరు పట్టణంలో పంచాయతీ పాలన పూర్తిగా పడకేసింది. పురవీధులన్నీ చెత్తాచెదారంతో నిండిపోవడమే కాకుండా, కల్వర్టులు, డ్రైనేజీలు పూడికతీతకు నోచుకోక అస్తవ్యస్తంగా మారాయి.
● ముఖ్యంగా ప్రభుత్వ పాత ఆసుపత్రి, కోర్టు భవనాల సమీపంలో, ఐటీడీఏ కార్యాలయం వెనుక వైపు, జీసీసీ చైర్మన్ క్యాంపు కార్యాలయం ఎదురుగా, అలాగే కింద బజార్‌లోని మాంసం దుకాణాల సెంటర్ వద్ద పారిశుధ్యం పూర్తిగా క్షీణించింది. డ్రైనేజీల్లో చెత్త పేరుకుపోవడంతో మురుగునీరు నిల్వ ఉండి, ఈగలు, దోమల బెడద తీవ్రమైంది.
● పలు వీధుల్లో మురుగు కాలువలు మురిగిపోయి విపరీతమైన దుర్వాసన వెదజల్లుతున్నాయి. దీంతో వీధుల్లో పిల్లలను ఆటలాడించాలన్నా ఎక్కడ వ్యాధులు ప్రబలుతాయోనని తల్లిదండ్రులు, స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
అపరిశుభ్రతకు కేరాఫ్..
పాడేరు పట్టణం పేరుకే జిల్లా కేంద్రంగా చలామణి అవుతోంది కానీ, క్షేత్రస్థాయిలో అపరిశుభ్రతకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచింది. పట్టణంలోని ప్రధాన కూడళ్లతో పాటు పలు వీధుల్లో ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా పరిస్థితి తయారైంది. డ్రైనేజీ వ్యవస్థ నిర్వీర్యం కావడంతో మురుగునీరు రోడ్లపైకి చేరుతోంది. ఫలితంగా సీజనల్ వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని పురవీధుల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
● గత కొన్నాళ్లుగా ప్రత్యేక అధికారుల పాలన సాగుతుండటంతో పారిశుధ్య నిర్వహణ మరింత అధ్వాన్నంగా తయారైందని, ఈ సమస్యపై ఎవరికి చెప్పుకోవాలో తెలియక తలలు పట్టుకుంటున్నామని స్థానికులు వాపోతున్నారు. జిల్లా స్థాయి అధికారులు సైతం ఇటువైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని ప్రజలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు.
పండగ వేళల్లోనూ పట్టించుకోరా?
ఈ నెలలో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మోదకొండమ్మ తల్లి రాష్ట్ర జాతర వేడుకలు జరగనున్నాయి. ఇంతటి పెద్ద పండగ వస్తున్నప్పటికీ, సంబంధిత అధికారులు పారిశుధ్యంపై దృష్టి పెట్టకపోవడం ఏమిటని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ప్రజాపాలనను గాడికి వదిలేసి, కాలయాపన చేస్తున్నారని మండిపడుతున్నారు.
మంచినీటికీ ఇబ్బందే!
గత కొద్దిరోజులుగా కురుస్తున్న వరుస వర్షాలకు డ్రైనేజీలు వ్యర్థాలతో పూర్తిగా పూడుకుపోయాయి. పట్టణంలో ఇప్పటికే డెంగ్యూ, మలేరియా వంటి కేసులు నమోదవుతున్నాయని, ఇప్పటికై నా అధికారులు తేరుకుంటారా? లేదా? అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. దీనికితోడు వీధుల్లో వచ్చే రక్షిత మంచినీటి పైప్‌లైన్ సరఫరా కూడా అంతంత మాత్రంగానే ఉంటోందని, పర్యవేక్షణ లోపంతో ప్రజా సేవలు పూర్తిగా కుంటుపడ్డాయని స్థానికులు మండిపడుతున్నారు.
పాడేరులో అధ్వానంగా పారిశుధ్యం
పేరుకుపోయిన వ్యర్థాలు
దోమలు, ఈగలతో వ్యాధుల భయం
జాతర వేళ కూడా పట్టించుకోని
అధికార యంత్రాంగం
స్థానికుల ఆగ్రహం


