కొయ్యూరు: రాజవొమ్మంగి–కొయ్యూరు సరిహద్దు గ్రామాల్లో పులి సంచారం అటు అటవీ అధికారులను కలవరానికి గురిచేస్తుంటే, ఇటు స్థానిక ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. సరిహద్దుల్లోని కొమ్మిక, రాజులపాలెం, చిన్నరెల్లలపాలెం, బరతనపల్లి గ్రామాల మధ్య ఉన్న యూకలిప్టస్ తోటల్లో పులి సంచరిస్తున్నట్టు శనివారం అటవీ అధికారులు గుర్తించారు. పులి రోజుకు చాలా తక్కువ దూరం మాత్రమే కదులుతుండటంతో.. ఒకటి లేదా రెండు రోజుల క్రితమే అది ఏదైనా వన్యప్రాణిని లేదా పశువును వేటాడి తిని ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
పులి వెళ్లేందుకు మూడు మార్గాలు..
ప్రస్తుతం పులి ఉన్న ప్రాంతం నుంచి ముందుకు వెళ్లేందుకు మూడు మార్గాలు ఉన్నాయని అటవీ సిబ్బంది చెబుతున్నారు. బకులూరు మీదుగా తాండవ జలాశయం వైపు వెళ్లడం లేదా ఇటు నుంచి మంప వైపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీటితో పాటు అది వచ్చిన మార్గంలోనే వెనక్కి వెళ్లే అవకాశం కూడా ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.
భయపడొద్దు..
ఉపాధి హామీ పనులకు వెళ్లే కూలీలు, తోటల్లో పనులు చేసుకునే రైతులు అప్రమత్తంగా ఉండాలని పెదవలస రేంజ్ అధికారి (రేంజర్) ప్రశాంతికుమారి, ఎఫ్‌ఎస్‌వో శ్రీరాములు సూచించారు. కొమ్మిక, మంప పంచాయతీల పరిధిలోని గ్రామాల్లో అటవీశాఖ సిబ్బంది పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. పులి కదలికలను రేడియో కాలర్ ట్రాకింగ్ సాంకేతికత ద్వారా ఎప్పటికప్పుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నామని, ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. ఒకవేళ పులి దాడిలో పశువులు మృతి చెందితే రైతులకు తక్షణమే ప్రభుత్వ పరిహారం అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు వెల్లడించారు.
భయం గుప్పిట్లో గిరిజనం
అప్రమత్తమైన అటవీశాఖ
యూకలిప్టస్ తోటల్లో ఆనవాళ్ల గుర్తింపు
రేడియో కాలర్ ట్రాకింగ్‌తో
కదలికలపై నిఘా
కూలీలు, ప్రజలు జాగ్రత్తగా ఉండాలని అధికారుల హెచ్చరిక


